ఆయనతో సినిమా చేయడం నాకో గొప్ప పాఠం!

14 Oct, 2016 22:58 IST|Sakshi
ఆయనతో సినిమా చేయడం నాకో గొప్ప పాఠం!

‘‘మలయాళ మూవీ ‘ప్రేమమ్’ రీమేక్ కోసం దర్శకుడు చందూ మొండేటి నన్ను కలిసినప్పుడు ఆలోచించా. ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నా. అందుకని మళ్లీ రీమేక్ మూవీనా? అనిపించింది. వరుసగా రీమేక్ చిత్రాల్లో నటిస్తుండటంతో ‘రీమేక్ రాణి’ అయిపోయా (నవ్వుతూ)’’ అని కథానాయిక శ్రుతీహాసన్ అన్నారు. నాగచైతన్య, శ్రుతీహాసన్, మడొన్నా సెబాస్టియన్, అనుపమా పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో చందూ మొండేటి దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘ప్రేమమ్’ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా శ్రుతీహాసన్ చెప్పిన విశేషాలు.

► మలయాళ ‘ప్రేమమ్’ మూవీ చూశా. బాగా నచ్చింది. రీమేక్ అయినా చందూ తన శైలిలో తెలుగుకి అనుగుణంగా కథ తయారు చేశారు. కథ, నా పాత్ర నచ్చడంతో ఒప్పుకున్నా. ఈ చిత్రంలో నేను సాఫ్ట్, డిగ్నిఫైడ్ టీచర్ సితార పాత్రలో కనిపిస్తా.
 
► రియల్ లైఫ్‌లో మాత్రం సితార పాత్రకు విరుద్ధంగా ఉంటా. అందుకే ఈ పాత్రను ఓ ఛాలెంజ్‌గా భావించి చేశా. ప్రేక్షకులకు బాగా నచ్చింది. కొందరైతే సౌందర్యలా ఉన్నావని ప్రశంసించడం మరచిపోలేని అనుభూతి. టీచర్ పాత్ర కాబట్టి మేకప్‌కి పెద్దగా చాన్స్ లేదు. వాస్తవానికి నాకు మేకప్ లేకుండా నటించడమంటేనే ఇష్టం.

► ‘ప్రేమమ్’లో నటించక ముందే నాగచైతన్య, నేను ఫ్రెండ్స్. దాంతో మేం షూటింగ్‌లో చాలా సరదాగా ఉండేవాళ్లం. షూటింగ్ మొత్తం ఓ పిక్నిక్‌లా జరిగింది. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్‌తో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయాలని ఉంది. బలమైన కథ ఉంటే చేస్తా.
     
► నా వరకు నేను వంద శాతం హార్డ్‌వర్క్ చేస్తా. కష్టపడని వాళ్లంటే నాకు నచ్చదు. నా పాత్ర బాగా వచ్చేందుకు రిహార్సల్స్ చేస్తా. చెల్లి అక్షరాహాసన్‌కు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. కానీ, సినిమాల ఎంపికలో సలహాలివ్వను. రచన, సింగింగ్ అంటే నాకు ఇష్టం. ప్రస్తుతానికి బిజీ కాబట్టి, వాటిపై పెద్దగా దృష్టి సారించడంలేదు. భవిష్యత్‌లో నిర్మాతగా చేయాలనుంది.  

► నాన్నతో (కమల్‌హాసన్) ‘శభాష్ నాయుడు’ చిత్రంలో నటించడం నాకొక గొప్ప పాఠం. షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. పవన్‌కల్యాణ్‌గారితో ‘గబ్బర్‌సింగ్’ తర్వాత ‘కాటమరాయుడు’లో నటిస్తుండడం హ్యాపీ. ‘సెవన్త్ సెన్స్’ తర్వాత సూర్యగారితో ‘సింగం 3’ లో నటించడం మంచి అనుభవం.