అంజలి చాలా నేర్పించింది!

23 May, 2019 07:20 IST|Sakshi
లిసా చిత్రంలో అంజలితో శ్యామ్‌ జోన్స్‌

సినిమా: నటి అంజలి సీనియర్‌ కావడంతో నాకు చాలా నేర్పించింది అని చెప్పాడు వర్థమాన నటుడు శ్యామ్‌ జోన్స్‌. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం లిసా. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. తెలుగులోనూ అనువాదమై విడుదల కానుంది. దీంతో ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్న చిత్ర హీరో శ్యామ్‌ జోన్స్‌ తన అనుభవాలను పంచుకుంటూ చెన్నైలోని లయోలా కళాశాలలో బీకాం చదువుతున్నప్పుడే నటనపై ఆసక్తి కలిగిందని చెప్పాడు. అలా సినిమా ఆలోచనలతోనే డిగ్రీని పూర్తి చేశానని తెలిపాడు. ఆ తరువాత ఏమాలి చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని చెప్పాడు. అందులో సముద్రకనితో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నాడు. తొలి చిత్రంతోనే నటుడిగా మంచి గుర్తింపు వచ్చిందన్నాడు.

ఆ తరువాత లిసా చిత్రంలో బ్రహ్మానందంకు కొడుకుగా యువ కథానాయకుడిగా నటించానని చెప్పాడు. ఇందులో తాను, నటి అంజలి జంటగా నటించామని తెలిపారు. బెంగళూర్‌ నుంచి కోడైక్కానల్‌కు వెళ్లే కళాశాల జంటగా నటించామని తెలిపాడు. నటిగా తనకు సీనియర్‌ అయిన నటి అంజలి చాలా విషయాలను తనకు చెప్పిందని, అలా నటనలో శిక్షణ ఇచ్చిందని చెప్పాడు.ఈ చిత్ర తెలుగులోనూ తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పినట్లు తెలిపారు. కాగా ధర్మప్రభు అనే చిత్రంలోనూ హీరోగా నటించానని, అందులో యమలోకంలో యోగిబాబు, భూలోకంలో తానూ హీరోలుగా నటించినట్లు చెప్పాడు. ఈ చిత్రం జూన్‌లో తెరపైకి రావడానికి రెడీ అవుతోందని తెలిపాడు. ఇది విభిన్నమైన వినోదభరిత కథా చిత్రంగా ఉంటుందని చెప్పాడు. తాను కుర్రాడిని కావడంతో యువ కథానాయకుడిగా నటించే అవకాశాలు వస్తున్నాయని, తదుపరి ఇద్దరు ప్రముఖ దర్శకుల చిత్రాల్లో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయని చెప్పాడు. నటుడు విజయ్‌సేతుపతి తర హాలో అన్ని రకాల పాత్రల్లో నటించి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించాలని కోరుకుంటున్నానని శ్యామ్‌జోన్స్‌ అంటున్నాడు

మరిన్ని వార్తలు