బాల్యం గుర్తొస్తోంది..!

12 Jan, 2017 23:44 IST|Sakshi
బాల్యం గుర్తొస్తోంది..!

శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ‘శతమానం భవతి’ ఓవర్‌సీస్‌లో ఈ 13న, ఇండియాలో 14న విడుదలవుతోంది. అమెరికాలో 12న ప్రీమియర్‌ షోలు వేశారు. ఈ చిత్రం గురించి శర్వానంద్‌ చెప్పిన విశేషాలు...
సంక్రాంతి పండక్కి అత్తమామలు, పిన్నీ బాబాయ్‌లు మా ఇంటికి వచ్చి వెళ్లే వరకూ జరిగే కథతో ఈ సినిమా ఉంటుంది. ఇందులో కూడా సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. అందువల్ల సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నాం. గత ఏడాది మూడు పెద్ద సినిమాల మధ్య నా ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ విడుదలైంది. ఈసారీ అది రిపీట్‌ అయింది.‘ఆనందాన్ని పదిమందికి పంచితే బాగుంటుంది. కానీ, బాధని పంచి, వాళ్లను కూడా బాధ పెట్టడం ఎందుకు?’ అనే మనస్థత్వం గల పక్కింటి కుర్రాడి తరహా పాత్రలో నటించా. ‘పల్లెటూరి వదలి నేను రాను. వ్యవసాయం చేసి డబ్బులు సంపాదిస్తా’ అని ఆలోచిస్తూ, తాతయ్య సిద్ధాంతాలను ఆయన వారసుడిగా ముందుకు తీసుకువెళ్లాలనుకునే పాత్ర ఇది.

ఇది కొత్త కథ కాదు. కానీ, ఒక్క శాతం కూడా ప్రేక్షకులకు ఎక్కడా పాత సినిమాలు గుర్తుకు రావు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇంటికి ఫోన్‌ చేసి ‘హలో అమ్మా... ఎలా ఉన్నావ్‌?’ అని అడుగుతారు. నాకు అంత నమ్మకం ఉంది. ఆ గ్యారెంటీ ఇస్తున్నా. తల్లిదండ్రులను మనం ఎంత ప్రేమిస్తున్నామనేది మూలకథ. మా నాన్నగారికి ఐదుగురు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్‌. చిన్నప్పుడు సంక్రాంతి వస్తే మా ఊరికి వెళ్లేవాళ్లం. రాత్రయితే పరుపులు వేసుకుని వరండాలో నిద్రపోయేవాళ్లం. సినిమాలో అలాంటి సీన్‌ ఉంది. అందుకని నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ‘దిల్‌’ రాజుగారితో ఆ విషయం చెబితే.. ‘సినిమా చూసేవాళ్లకి కూడా మధురమైన జ్ఞాపకాలు గుర్తొస్తాయి’ అన్నారు.

మొదట్లో ఈ సినిమా చేసే ఉద్దేశం లేదు. కథ విన్న తర్వాత ‘నో’ చెప్పలేకపోయాను. ‘నువ్వే చెయ్‌. ఈ కథ నీకు సూటవుతుంది’ అని సాయిధరమ్‌ తేజ్‌ చెప్పాడు. ఖాళీగా ఉన్నానని ఏదో ఒక  సినిమా చేయడం ఇష్టం లేదు. కథపై నమ్మకం కుదిరితేనే సినిమా చేస్తా.  ఈ సినిమాతో నాకు ఫ్యామిలీ ప్రేక్షకులు పెరుగుతారని ఆశిస్తున్నా. ప్రస్తుతం బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌గారి నిర్మాణంలో చేస్తున్న సినిమా మరో ఐదు రోజులు షూటింగ్‌ చేస్తే పూర్తవుతుంది. మారుతి దర్శకత్వంలో పూర్తి వినోదాత్మక సినిమా ఒకటి అంగీకరించా! పెళ్లి గురించి ప్రస్తుతానికి ఆలోచించడం లేదు. ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన వివాహమా? అనడిగితే... ఏదీ ప్లాన్‌ చేయలేదు!