బరి తెగిస్తున్నారు | Sakshi
Sakshi News home page

బరి తెగిస్తున్నారు

Published Thu, Jan 12 2017 11:42 PM

బరి తెగిస్తున్నారు - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు : కోర్టు తీర్పు నేపథ్యంలో కోడి పందేలకు అనుమతి ఇచ్చేది లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో పందేలు నిర్వహించి తీరుతామంటూ పందేల రాయుళ్లు ఇప్పటికే బరులను సిద్ధం చేశారు. వాటిచుట్టూ షామియానాలు వేస్తూ ఇతర ఏర్పాట్లు ముమ్మరంగా సాగిస్తున్నారు. భీమవరం ప్రకృతి ఆశ్రమ ప్రాంతంలో ఇప్పటివరకూ ఏర్పాట్లు చేయలేదు. మరోవైపు పెద్ద బరిగా పేరొందిన వెంపలో కబడ్డీ పోటీలు, ఇతర పోటీల కోసం ఏర్పాట్లు చేశారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే చివరి నిమిషంలో అయినా పందేలు వేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. చాలాచోట్ల బరుల్లో పగలు, రాత్రి పందేలు వేయడానికి వీలుగా ఫ్లడ్‌లైట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల అమలుకు కట్టుబడి ఉన్నామని, వెయ్యి మందిపై బైండోవర్‌ కేసులు పెట్టామని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటికే జిల్లావ్యాప్తంగా బరులను అన్నిహంగులతో సిద్ధం చేశారు. ట్రాక్టర్లతో చదును చేసి పందేలు వేయడానికి అనుకూలంగా నిత్యం నీటితో తడుపుతున్నారు. బరుల చుట్టూ కంచెలు వేశారు. పందెం రూ.లక్షకు తక్కువ కాకుండా వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పందేల శిబిరాల్లోనే కోసాట, గుండాట వంటి జూదాలతోపాటు మద్యం, తినుబండారాల స్టాల్స్‌ ఏర్పాటు చేసేందుకు రేట్లు మాట్లాడుకున్నారు. గుండాట బోర్డు పెట్టుకోవడానికి  రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ధర నిర్ణయించారు. ప్రతి బరి వద్ద కనీసం 3నుంచి 6వరకు గుండాట బోర్డులు ఏర్పాటు కానున్నాయి. కత్తులు కట్టడానికి అనుమతి లేకపోతే డింకీ పందే లు వేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. పో లీస్‌ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ టీడీపీ నేతలు ముందుండి మరీ కోడి పందే ల నిర్వాహకులకు అభయం ఇస్తున్నారు. భోగి రోజున ముహూర్తాన్ని నిర్ణయించుకున్న పందేలరాయుళ్లు మూడు రోజులు తమను అపేవారే లేరని చెబుతున్నారు.
ఎక్కడికక్కడ బరులు రెడీ
తాడేపల్లిగూడెంలో 8 బరులను సిద్ధం చేశారు. తాళ్లపూడి మండలం పెద్దేవంలో రెండు చోట్ల, గజ్జరంలో రెండు చోట్ల,  వేగేశ్వరపురంలో రెండు చోట్ల, తాళ్లపూడి, పోచవరం పందేలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భీమడోలు మండలం గుండుగొలనులో పెద్దఎత్తున పందేలు వేసేందుకు రంగం సిద్ధమైంది. భీమడోలు, పూళ్ల, సూరప్పగూడెం, అంబర్‌పేట, పోలసానిపల్లి గ్రామాల్లో కోడి పందేలు, గుండాట, కోసాట నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మెట్ట ప్రాంతంలోని చింతలపూడి, సీతానగరం, రాఘవాపురం, లింగపాలెం మండలం కొణిజర్ల, ములగలంపాడు, కామవరపుకోట మండలం కళ్లచెర్వు, రావికంపాడు, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం, లక్కవరం, కొయ్యలగూడెం మండలం రామానుజపురం, నరసాపురం పట్టణంలోని రుస్తుంబాద, నరసాపురం మండలం వేములదీవి, లక్ష్మణేశ్వరం, సీతారామపురం, మొగల్తూరు మండలం మొగల్తూరు, కేపీపాలెం, పేరుపాలెం, కాళీపట్నం బరులు సిద్ధమయ్యాయి. పెదవేగి మండలంలో 12 బరులు సిద్ధం కాగా, కొప్పాకలో ప్రధాన బరి ఉంది. పెదపాడు మండలంలో 5 చోట్ల పందేలు వేయనుండగా, అప్పనవీడులో ప్రధాన బరి రెడీ అయ్యింది.  దెందులూరు మండలం చల్లచింతలపూడి, పంగిడిగూడెంలో ప్రధాన బరులు ఏర్పాటు చేస్తున్నారు. పాలకొల్లు మండలం పూలపల్లి బైపాస్‌ రోడ్డులో టీడీపీ నేత ఆధ్వర్యంలో కోడిపందేల నిర్వహణకు రంగం సిద్ధమైంది. పాలకొల్లు–భీమవరం రోడ్డులో పూలపల్లి వద్ద గల లేఅవుట్‌ ప్రాంతంలో బీజేపీ నేత ఆధ్వర్యంలో బరి రెడీ చేశారు. వడ్లవానిపాలెం, లంకలకోడేరు, పోడూరు మండలం కవిటం, పోడూరు, గుమ్మలూరు, పెనుమదం, జిన్నూరు, యలమంచిలి మండలం కలగంపూడి, పోలవరం, మట్లపాలెం, వడ్డిలంక, బూరుగుపల్లి, యలమంచిలి, కాజ, కొంతేరు గ్రామాల్లో కోడి పందేల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఏటా మాదిరిగానే పందేలు సాగిపోతాయా లేక పోలీసులు అడ్డుకట్ట వేస్తారా అన్నది కొన్ని గంటల్లో తేలిపోనుంది. 
 

Advertisement
Advertisement