స్క్రీన్‌ తలైవి ఎవరు?

21 Aug, 2018 00:11 IST|Sakshi

అమ్మను బతికుండగా గుండెల్లో పెట్టుకున్నారు తమిళ జనం.ఇప్పుడు తెర మీద చూసి దండం పెట్టుకోవాలనుకుంటున్నారు.స్క్రీన్‌ తలైవి ఎవరు?స్క్రీన్‌ మీద తలైవిని తలపించేది ఎవరు?జయలలిత జీవితంపై తయారవనున్న సినిమాలు కుతూహలం రేపుతున్నాయి.ఇప్పుడు తమిళనాడులో అందరి దృష్టి ఒక డేట్‌ మీదే ఉంది.ఫిబ్రవరి 24, 2019.నిజానికి ఆ తేదీ చాలా దూరం ఉంది. అయినప్పటికీ హడావుడి మొదలైంది.ఎందుకు?ఏదైనా అద్భుతం జరగబోతోందా?అలాంటిదే.ఆ తేదీన ఒకే వ్యక్తి జీవితంతో నలుగురైదుగురు బయోపిక్‌లు మొదలెట్టాలనుకుంటున్నారు.అర్థమయ్యే ఉంటుంది.అవును.. జయలలిత జీవిత కథను సినిమాగా తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.అయితే ఎప్పుడూ లేనట్లు విడివిడిగా నలుగురైదుగురు బయోపిక్‌కి టార్గెట్‌ పెట్టడం విశేషం.ఇంతకీ ఫిబ్రవరి 24 ప్రత్యేకత ఏంటో చెప్పలేదు కదూ.అది జయలలిత పుట్టినరోజు. మరి.. ఆ రోజు ఆమె జీవిత చరిత్రతో ఎన్ని సినిమాలు మొదలవుతాయో కానీ.. ప్రస్తుతానికి ప్లాన్‌ చేస్తున్న దర్శక–నిర్మాతల గురించి, ‘జయలలిత బయోపిక్‌లో నటించాలని ఉంది’ అని ఇప్పటికే తమ ఆసక్తి బయటపె ట్టిన కథానాయికల గురించి తెలుసుకుందాం.

2016 డిసెంబర్‌ 5.
తమిళనాడు ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిన రోజు. ‘అమ్మ’ అస్తమించిన రోజు. ‘కోలుకుంటున్నారు. ఇక డిశ్చార్జ్‌ అవ్వడమే ఆలస్యం’ అని ప్రకటించిన కొద్ది రోజులకే ‘తుది శ్వాస విడిచారు’ అనే షాకింగ్‌ న్యూస్‌. ప్రజల కోసం జీవించారు అని ప్రజలు అనుకోవడం వల్లే వారికి ఆ షాక్‌. అంతేనా? జయలలిత పట్టుదల ఉన్న మనిషి. పట్టుపట్టారంటే సాధిస్తారు. చదువులో మెరిట్‌ తెచ్చుకున్నా క్లాసికల్‌ డాన్స్‌లో టాప్‌ అనిపించుకున్నా ఈ పట్టుదల వల్లే. తల్లి సంధ్య సినిమా నటే అయినా కూతుర్ని నటిగా చూడాలనుకోలేదు. ఒకరోజు ఊరికే మేకప్‌ వేసుకున్నందుకు కుమార్తెను చెడామడా తిట్టారు. అలాంటిది ఆర్థిక పరిస్థితులకు తలవొంచి కూతుర్ని నటిని చేశారు. అయిష్టంగా వచ్చినా వృత్తికి న్యాయం చేయాలన్నది జయలలిత పట్టుదల. సాధించారు. వెండితెరను ఏలారు. ప్రముఖ నటుడు ఎంజీఆర్‌తో పరిచయం, ఆయన ద్వారా రాజకీయాల్లోకి రావడం, పలు సవాళ్లను ఎదుర్కోవడం.. ఇలా జయలలిత జీవితం ఎప్పుడూ సాఫీగా సాగలేదు. అన్ని సవాళ్లను అధిగమిస్తూ ప్రజలతో ‘పురట్చి తలైవి’ (విప్లవ నాయకురాలు) అనిపించుకున్నారు. ఈ డైనమిక్‌ లేడీ జీవితంతో ఒక సినిమా అంటే అది సంచలనం. వచ్చే ఏడాది ఆమె జీవితాన్ని వెండితెరపై చూడబోతున్నాం. ఒక సినిమా కాదు.. మూడు నాలుగు సినిమాల రూపంలో.

శశికళ దృష్టి కోణంలో వర్మ సినిమా
‘అమ్మ’ చనిపోయాక ఆమె బయోపిక్‌కి సంబంధించిన ప్రకటన వచ్చింది ముందుగా రామ్‌గోపాల్‌ వర్మ నుంచే. జీవిత కథలు తీయడం, వాస్తవ సంఘటనలతో సినిమాలు తీయడం వర్మకు చాలా ఈజీ. ‘రక్తచరిత్ర’, ‘26/11 ముంబై ఎటాక్స్‌’, ‘వంగవీటి’ వంటి బయోపిక్స్‌తో ఆయన రాటుదేలి ఉన్నారు.  వర్మ తీస్తున్న సినిమాలు వచ్చినవి వచ్చినట్లు వెళ్లిపోతున్న సమయంలో ఈ సినిమాలు ‘స్పెషల్‌’గా నిలిచాయి. సో.. బయోపిక్స్‌ తీయడంలో వర్మని కొట్టేవాళ్లు లేరని చెప్పడం అతిశయోక్తి కాదు. జయలలిత బయోపిక్‌ని ఆమె ఆప్తమిత్రురాలు శశికళ పాయింటాఫ్‌ వ్యూ నుంచి తీస్తానని వర్మ పేర్కొన్నారు.  మరి.. వర్మ మైండ్‌లో ఉన్న బయోపిక్‌ కెమెరా ముందుకి వచ్చేదెప్పుడో?

వారంలో మూడు అనౌన్స్‌మెంట్లు
జస్ట్‌ వారం అంటే వారమే అయింది విబ్రీ మీడియా సంస్థ అధినేత విష్ణు ఇందూరి జయలలిత బయోపిక్‌ ప్రకటించి. ఎన్టీఆర్‌ బయోపిక్‌ నిర్మిస్తున్న విబ్రీ మీడియా జయలలిత జీవిత చరిత్రను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తీయనుందని ఈ ప్రకటన సారాంశం. ‘మదరాస పట్టణం’, ‘దైవ తిరుమగళ్‌’ (తెలుగులో ‘నాన్న’), ‘అభినేత్రి’ తదితర చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న ఎ.ఎల్‌. విజయ్‌ ఈ చిత్రానికి దర్శకుడుగా పేర్కొన్నారు. ఫిబ్రవరి 24న ఈ చిత్రాన్ని ప్రారంభించి అదే రోజున టైటిల్‌ రోల్‌ చేసే నటి ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేయబోతున్నారట. విష్ణు ఇందూరి ప్రకటించిన తర్వాత జయలలిత బయోపిక్‌కి సంబంధించి మరో ప్రకటన వచ్చింది. తమిళ దర్శకుడు మిస్కిన్‌ దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన  దర్శకురాలు ప్రియదర్శిని తాను కూడా జయలలిత బయోపిక్‌ తీస్తున్నట్టు ప్రకటించారు. ‘‘నటిగా, రాజకీయ నాయకురాలిగా జయలలిత ఎదుర్కొన్న సవాళ్లని ఫోకస్‌ చేస్తూ ఈ సినిమా తీయాలనుకుంటున్నాను’’ అన్నారు ప్రియదర్శిని. వచ్చే నెల 20న నటీనటులను ప్రకటించాలనుకుంటున్నారట.  ప్రియదర్శినికి అనుభవం తక్కువ. కనుక ఈ సినిమా ఆమెకు ఓ సవాల్‌గా నిలువనుంది.  

అయితే ప్రియదర్శిని నుంచి ఈ అనౌన్స్‌మెంట్‌ వచ్చిందో లేదో సీనియర్‌ డైరెక్టర్‌ భారతీరాజా నుంచి ఓ ప్రకటన వచ్చింది. జయలలిత బయోపిక్‌ తాను తీయబోతున్నట్టు హల్‌చల్‌ సృష్టించారాయన. బాలీవుడ్‌ నిర్మాత ఆదిత్యా భరద్వాజ్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని చెబుతున్నారు. జయలలిత పాత్రకు ఐశ్వర్యా రాయ్, అనుష్కల్లో ఎవరో ఒకర్ని తీసుకోవాలనుకుంటున్నారని ఫీలర్స్‌ వదులుతున్నారు. ఎంజీఆర్‌ పాత్రకు కమల్‌ హాసన్‌నుగాని, మోహన్‌లాల్‌ను గాని సంప్రదించాలనుకుంటున్నారట. ‘అమ్మ–పురట్చి తలైవి’ అనేది టైటిల్‌. అంటే.. ‘అమ్మ–విప్లవ నాయకురాలు’ అని అర్థం. మొదట    డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని మొదలుపెట్టాలనుకుంటున్నారు. కానీ జయలలిత బర్త్‌డే నాడు కొబ్బరికాయ కొట్టాలనుకుంటున్నారట.

జయ జీవితం... నవరసభరితం
ఆమె అందగత్తె. ఎందరికో కలల రారాణి. ఎం.జి.ఆర్‌ వంటి సూపర్‌స్టార్‌కు కో స్టార్‌. సన్నిహితురాలు. రాజకీయాలలో పురుష సమాజాన్ని ఎదురొడ్డి నిలిచిన ధీశాలి. అసెంబ్లీలో చీర లాగబడి పరాభవంతో ప్రతిజ్ఞ బూనిన అభినవ ద్రౌపది. అదే సమయంలో పేదల పట్ల దయాళువు. సెంటిమెంట్ల పుట్ట. మరో స్త్రీకి నెచ్చెలి. ఇన్ని పార్శా్వలు బహుశా ఏ ఇతర వ్యక్తిలోనూ లేవు. అందుకే జయ జీవితాన్ని ఎన్ని బయోపిక్స్‌గా తీసినా జనం వాటిని తప్పక చూస్తారు. ఎందుకంటే ఎంత తీసినా ఆమె కథ ఇంకా మిగిలి ఉంటుంది కనుక. 

జయలలితగా ఎవరెవరు  నటించాలని అనుకుంటున్నారు?
మన సౌత్‌లో గడచిన 15 ఏళ్లల్లో తిరుగు లేని తార త్రిష. ఆమె తర్వాత ఎంతోమంది వచ్చినా త్రిష స్టిల్‌ బిజీ. కెరీర్‌లో ఎన్నో రకాల పాత్రలు చేసిన త్రిషకు జయలలితగా నటించాలని ఉందట. ‘‘ఆమె సినిమా కెరీర్‌ గ్రాఫ్‌ అద్భుతం. పొలిటికల్‌ గ్రాఫ్‌ సూపర్‌.  పవర్‌ఫుల్‌ లేడీ. ఆమె బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే హ్యాపీ’’ అని ఓ సందర్భంలో త్రిష పేర్కొన్నారు. అందాల తార నయనతార వచ్చి పదేళ్లు పైనే అయింది. అయినా క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. అవకాశం వస్తే ఆమెకు కూడా జయలలిత బయోపిక్‌లో నటించాలని ఉందట. ‘‘జయలలితగారి జీవిత చరిత్రలో ఏ కథానాయికకు మాత్రం నటించాలని ఉండదు. ఆ చాన్స్‌ నాకు వస్తే చేస్తా’’ అని ఓ సందర్భంలో నయన అన్నారు.  ఇక ‘పురట్చి తలైవి’ పాత్రలో నటించడానికి ఉత్సాహంగా ఉన్న మలయాళ నటి ఎవరో తెలుసా? ‘సాహసం శ్వాసగా సాగిపో’లో నటించిన మలయాళ కుట్టి మంజిమా మోహన్‌ గుర్తున్నారు కదా. ఆమెకు జయలలిత పాత్ర చేయాలని ఉందట. మీరు ఎవరి బయోపిక్‌లో నటించాలనుకుంటున్నారు? అని నాకు ఆప్షన్‌ ఇస్తే.. ‘‘నా ఓటు జయలలితగారి జీవితానికి. ఆమె చాలా డేరింగ్‌ అండ్‌ బోల్డ్‌ లేడీ. జయలలితగారి ఆ క్వాలిటీస్‌కి నేను పెద్ద అభిమానిని. అందుకే ఆవిడ బయోపిక్‌లో యాక్ట్‌ చేయాలనుంది’’ అన్నారు. ‘మహానటి’ సావిత్రి పాత్రకు కీర్తీ సురేష్‌ తప్ప ఎవరూ నప్పేవారు కాదనే విధంగా ఆమె నటించారు. ఆ బయోపిక్‌కి పూర్తిగా న్యాయం చేసిన కీర్తి ఆ సినిమా ప్రమోషన్స్‌లో మరో బయోపిక్‌కి చాన్స్‌ ఉందని హింట్‌ ఇచ్చారు. అదే విధంగా ఇప్పట్లో మరో బయోపిక్‌ అంటే ఆలోచించాలి? వెంటనే మరో జీవిత చరిత్ర అంటే సామాన్యమైన విషయం కాదని కూడా ఆమె అన్నారు. ఇంతకీ కీర్తీ హింట్‌ ఇచ్చినది జయలలిత బయోపిక్కేనా? వేచి చూద్దాం.

విద్యాబాలన్‌పై  అందరి దృష్టి
ఒక బయోపిక్‌ అనౌన్స్‌ చేయగానే ఎవరు నటిస్తే బాగుంటుంది? అనే చర్చ జరగడం కామన్‌. ప్రస్తుతం ఇదే చర్చ ఇటు సౌత్‌ అటు నార్త్‌లో జరుగుతోంది. మొదటగా సౌత్‌ నుంచి నార్త్‌కి వెళ్లి కథానాయికగా సెటిలైన ‘విద్యాబాలన్‌’ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సిల్క్‌ స్మిత జీవితం ఆధారంగా తీసిన ‘డర్టీ పిక్చర్‌’కి విద్యా ఎంత న్యాయం చేశారో తెలిసిందే. ఆన్‌సెట్స్‌లో ఉన్న ‘యన్‌.టి.ఆర్‌.’ బయోపిక్‌లో బసవ తారకం పాత్ర చేస్తున్నారామె. ‘డర్టీ పిక్చర్‌’ తర్వాత ఏ బయోపిక్‌ ప్రస్తావన వచ్చినా విద్యాబాలన్‌ పేరు వినిపిస్తుంటుంది. ప్రముఖ బాలీవుడ్‌ నటి మీనాకుమారి జీవితం ఆధారంగా హిందీ దర్శకుడు తిగ్‌మాన్షు ధూలియా తీయాలనుకున్న సినిమాలో విద్యాబాలన్‌నే తీసుకున్నారు. ముందు ఒప్పుకున్న విద్యా ఆ తర్వాత తప్పుకున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితంతో సినిమా చేయడానికి బాలీవుడ్‌లో  సన్నాహాలు మొదలైనప్పుడు కూడా విద్యాబాలన్‌ పేరే వినిపించింది. ఇప్పుడు కూడా జయలలిత బయోపిక్‌కి ఆమె పేరు వినిపిస్తోంది. 
– సినిమా డెస్క్‌

మరిన్ని వార్తలు