మ‌న ఇంటి మ‌హాల‌క్ష్మి

24 Nov, 2018 23:55 IST|Sakshi

బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ ‘క్వీన్‌’కు తెలుగు రీమేక్‌గా వస్తున్న ‘దటీజ్‌ మహాలక్ష్మి’తో మరోసారి సత్తా చాటుకోబోతుంది తమన్నా భాటియా. తమన్నా కెరీర్‌లో ‘మహాలక్ష్మి’ మరువలేని పాత్ర. ‘సిల్క్‌చీర కట్టుకున్న సాఫ్ట్‌వేర్‌రో..పోనీటెయిల్‌ కట్టుకున్న ఫస్ట్‌ర్యాంకురో.... దటీజ్‌ మహాలక్ష్మి దటీజ్‌ మహాలక్ష్మి’ అని హాయిగా పాడుకునే పాత్ర. తనకు అచ్చొచ్చిన పేరుతో ముందుకు వస్తున్న కలలరాణి తమన్నాభాటియా గురించి కొన్ని ముచ్చట్లు...


నచ్చేసింది
ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా సినిమాలు తెగ చూస్తుంది. ‘మొఘల్‌–ఏ–ఆజామ్‌’ ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాలు చాలా చాలా ఇష్టం. ఎన్నిసార్లు చూసిందో లెక్కేలేదు.  తన సినిమాల్లో తనకు బాగా నచ్చిన పాత్ర ‘మహాలక్ష్మి’. ‘100%›లవ్‌’ సినిమాలో మహాలక్ష్మి పాత్ర నటనపరంగా తమన్నాను మరో మెట్టు పైకి ఎక్కించింది. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది. పాటల కోసమే అన్నట్లు ఉండే పాత్రల్లో నటించడం కంటే శక్తిమంతమైన, స్వాభిమానం ఉన్న పాత్రలు చేయడం తనకు ఇష్టం అని చెబుతుంది.


ఎలా అంటే ఇలా...
ప్రొఫెషన్‌లో భాగంగా ప్రపంచంలో ఎన్నెన్నో నగరాలు తిరిగినా...హైదరాబాద్‌ అంటే ప్రత్యేక ఇష్టం అని చెబుతుంది తమన్నా. ఈ నగరం తనకు పాజిటివ్‌ వైబ్స్‌ ఇస్తుందట. ఇక్కడి బిర్యానీ, చేపలపులుసు అంటే మహాఇష్టం అని చెబుతుంది మహాలక్ష్మి.తమన్నా తెలుగు చక్కగా మాట్లాడుతుంది. ‘హౌ?’ అనే క్వశ్చన్‌ ఆశ్చర్యంగా  పైకి వచ్చినప్పుడు తాను చెప్పే సమాధానం ఇది: ‘నేను ఇక్కడి అమ్మాయినే అనుకుంటాను. ఇలా అనుకోవడం వల్లే కావచ్చు తెలుగు పరాయిభాష అనిపించదు. అసిస్టెంట్‌లతో కావచ్చు ఇతరులతో కావచ్చు...తెలుగులోనే  మాట్లాడడం వల్ల భాష సులభమైపోయింది.

సై
సినిమా అనేది డైరెక్టర్‌ మీడియం, విజన్‌ కాబట్టి స్క్రిప్ట్‌తో పాటు  డైరెక్టర్‌  ఎవరనేదానికి కూడా ప్రాధాన్యత ఇస్తానంటుంది. గ్లామర్‌ పాత్రలు మాత్రమే కాదు  డిమాండ్‌ను బట్టి డీగ్లామర్‌ పాత్రలు చేయడానికి కూడా సై అంటుంది. ‘ఊసరవెల్లి’ రెండవభాగంలో డీగ్లామర్డ్‌గా నటించింది. కాంప్లికేటెడ్‌ క్యారెక్టర్స్‌ చేయడంలో బెరుకు కంటే ఉత్సాహమే తన ముందుంటుంది. ‘ఆనందతాండవం’లో మధుమిత సవాలు విసిరే పాత్ర. బాడీలాంగ్వేజ్‌ విషయంలో ప్రత్యేకశ్రద్ధ తీసుకొని మరీ ఈ పాత్రలో నటించి భేష్‌ అనిపించుకుంది తమన్నా.

తత్వం బోధపడింది
వృథా ఖర్చుకు దూరంగా ఉంటుంది. అవసరమైన వాటినే కొంటుంది. ఆర్థిక క్రమశిక్షణ గురించి మాత్రమే కాదు...కాస్తో కూస్తో  ఫిలాసఫీ మాట్లాడుతుంటుంది ఈ అమ్మడు. మచ్చుకు... ‘జీవితం శాశ్వతమేమీ కాదు. జీవితంలో ఏదో ఒకరోజు చివరిరోజు కాక తప్పదు. కాబట్టి ఈ జీవితాన్ని పరిపూర్ణంగా జీవించాలి’ 

మరిన్ని వార్తలు