ఏ సినిమా చూసినా అందులో నేనే హీరోని!

30 Jun, 2019 05:58 IST|Sakshi
శ్రీ తేజ్‌

వైఎస్‌ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, దేవినేని నెహ్రూ.. ఈ మూడు పాత్రల్లో ఒదిగిపోయిన నటుడు శ్రీ తేజ్‌. ఈ పాత్రల ద్వారా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకోవడంతో పాటు ప్రేక్షకుల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. త్వరలో విడుదల కానున్న ‘అక్షర’లో హీరోగా నటించడంతో పాటు మరికొన్ని చిత్రాలు సైన్‌ చేసిన శ్రీతేజ్‌ చెప్పిన విశేషాలు.

► ‘కథానాయకుడు, మహానాయకుడు’, ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’కన్నా ముందే నేను ‘నా సామి రంగా’, ‘తీయని కలవో’, ‘కదిలే బొమ్మల కథ’ సినిమాల్లో హీరోగా చేశా. అవి హిట్‌ కాలేదు. సినిమా హిట్‌ అయితేనే మేం జనంలోకి వెళ్లగలుగుతాం. లేకుంటే అది ఎంతమంచి సినిమా అయినా వెళ్లలేం. హిట్‌కి, ఫ్లాప్‌కి ఉన్న డిఫరెన్స్‌ అదే. ఎన్టీఆర్‌ ‘కథానాయకుడు, మహానాయకుడు’ సినిమాల్లో వైఎస్‌ రాజశేఖర రెడ్డిగారి పాత్ర చేశాను. అది మంచి పేరు తెచ్చింది. అలాగే ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’లో చేసిన చంద్రబాబునాయుడిగారి పాత్ర కూడా ప్రశంసలు తెచ్చింది.

► నాది విజయవాడ. బీకాం చదువుకున్నా. చిన్నప్పటి నుంచి యాక్టర్‌ అవ్వాలనే ఫ్యాంటసీలో ఉండేవాణ్ణి. ‘టెర్మినేటర్‌’ సినిమాని ఇంట్లో వీసీఆర్‌లో నాన్నగారు చూపించారు. స్కూల్‌ నుంచి వచ్చేటప్పుడు నేనే హీరోలా ఫీలై, ప్యాడ్‌ని గన్‌లా పట్టుకునేవాణ్ణి. ఏ సినిమా చూసినా అందులో హీరో పాత్రలో నన్ను ఊహించుకుంటూ అనుకరించేవాణ్ణి.

► ఏడాదికి 365 రోజులు అయితే అప్పట్లో నాకు 35రోజులే పని. మిగతా రోజుల్లో ఖాళీ. ఈ టైమ్‌లోనే మానసికంగా బలంగా ఉండాలి. ఈలోపు మైండ్‌ ఖాళీగా ఉంటుంది. ఒక యాక్టర్‌కి ఎంత బాధ ఉన్నాసరే ఆ బాధ మొహంలో కనిపించకూడదు.. బాడీ ఫిట్‌గా ఉంచుకోవాలి. ఎప్పుడూ బ్రెయిన్‌లో ఒత్తిడి ఉండకూడదు. అందుకని సోషియల్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్స్‌ ఏవైనా ఉంటే... డబ్బులు ఖర్చు పెట్టకపోయినా ఫిజికల్‌గా అయినా నా సహకారం ఉంటుంది కదా అని నా ఫ్రెండ్‌తో కలిసి హెల్పింగ్‌ నేచర్‌ వర్క్స్‌ ఉంటే చేసేవాణ్ణి. మొదటి నుంచీ హెల్పింగ్‌ నేచర్‌ ఉన్నవాణ్ణి నేను. క్రమశిక్షణగా ఉండటానికి ఎన్‌సీసీ ఉపయోగపడింది. స్పోర్టివ్‌గా ఉండటానికి స్పోర్ట్స్‌.. సినిమాలు చూస్తే ఒత్తిడి ఉండదు. ఒక మనిషిని అభివృద్ధి చేయడానికి  ఒక్కో అంశం ఉపయోగపడుతుందని నా అభిప్రాయం.

► విడుదలకు సిద్ధమైన ‘అక్షర’లో హీరోగా చేశాను. అయితే అన్ని సినిమాల్లోనూ హీరోగానే చేయాలని ఫిక్స్‌ కాలేదు. కథని ముందుకు నడిపించడానికి ప్రాధాన్యత ఉన్న ఏ పాత్ర అయినా చేయడానికి సిద్ధం. హిందీలో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, నసీరుద్దీన్‌ షా, ఇమ్రాన్‌ ఖాన్‌.. వీళ్లంతా మంచి మంచి పాత్రలు చేస్తున్నారు. వాళ్లలా చేయాలనుకుంటున్నాను.

మరిన్ని వార్తలు