కాలేజ్‌కి అప్‌గ్రేడ్‌ అయినట్టుంది

14 Oct, 2018 05:18 IST|Sakshi
సంగీత దర్శకుడు యస్‌.యస్‌. తమన్‌

‘‘పాటలు ఎంత సక్సెస్‌ సాధించినా కూడా సినిమా హిట్‌ అయితేనే పాటలు మరింతగా ప్రేక్షకుల్లోకి వెళ్తాయి. డైలాగ్‌కు మ్యూజికల్‌ వెర్షనే పాట అని నమ్ముతాను’’ అని తమన్‌ అన్నారు. ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్‌ తెరకెక్కించిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. యస్‌.రాధాకృష్ణ నిర్మించారు. ఈ చిత్రం గురువారం రిలీజైంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు యస్‌.యస్‌. తమన్‌ పలు విశేషాలు పంచుకున్నారు.

► ‘అరవింద సమేత’ సినిమా కోసం పని చేయడం మంచి అనుభూతి. ఒక్కోపాట చేస్తున్నప్పుడు ఎన్టీఆర్‌ అన్నయ్య, త్రివిక్రమ్‌గారు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. మనసు పెట్టి చేశావు అని ఆ ఇద్దరూ అభినందించడం ఆనందంగా ఉంది. ఇండస్ట్రీలో కూడా చాలా మంది దర్శకులు అభినందిస్తున్నారు.

► ఈ చిత్రం కథకు అనుగుణంగానే మ్యూజిక్‌ కంపోజ్‌ చేశాను. ఎక్కడా కావాలని పాటను ఇరికించలేదు. అంత ఇంపార్టెన్స్‌ ఉంది కథకు. పక్కదారి పట్టకుండా తెరకెక్కించినందుకు త్రివిక్రమ్‌ గారికి హ్యాట్సాఫ్‌.

► ఎనిమిదేళ్లుగా త్రివిక్రమ్‌గారితో పని చేయాలనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. ఈ సినిమా పూర్తయ్యాక స్కూల్‌ నుంచి కాలేజ్‌కి అప్‌గ్రేడ్‌ అయినట్టుంది.

► గత కొంత కాలంగా కేవలం కథానుగుణంగా పాటలు అడుగుతున్నారు. అందరి అభిరుచులు మారుతున్నాయి. మంచి పరిణామం. కాపీ ట్యూన్స్‌ వాడితే ఇంత మైలేజ్‌ ఉండేదా? నేను ఏమీ అనననేగా నన్ను అడుగుతున్నారు. టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ని ఆమాట అడుగుతారా?

► సంగీత దర్శకుడిగా రాణించాలంటే చాలా ప్రోగ్రామ్స్‌ చేయాలి. స్టేజ్‌షోలు కూడా ఉపయోగపడతాయి. ఆ అనుభవంతోనే రాణించగలం అని నమ్ముతాను.

మరిన్ని వార్తలు