ఏం రాశారా అని టెన్షన్!

12 May, 2016 00:03 IST|Sakshi
ఏం రాశారా అని టెన్షన్!

- చార్మి
 ‘‘నేను చాలా సినిమాల్లో నటించా. కానీ, ‘జ్యోతిలక్ష్మి’ సినిమా నా జీవితంలో మరచిపోలేనిది. హీరోయిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జ్యోతిలక్ష్మి’ చిత్రకథ, పాత్రలు, ఆదర్శంగా నిలిచే అంశాలను ఒక పుస్తకంగా తీసుకు రావడం నా అదృష్టం’’ అని హీరోయిన్ చార్మి అన్నారు. చార్మీ ప్రధాన పాత్రలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జ్యోతిలక్ష్మి’ చూసి ఇన్‌స్పైర్ అయిన కె.సర్వమంగళ గౌరి ‘జ్యోతిలక్ష్మి’ అంటూ పుస్తకం రాశారు. ఆ పుస్తకావిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.
 
 ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి పుస్తకం ఆవిష్కరించి, చార్మికి అందించారు. చార్మి మాట్లాడుతూ, ‘‘ప్రీమియర్ షో చూసి, బయటకు వస్తున్నప్పుడు ఒకావిడ సమాజానికి ఉపయోగపడే చిత్రం ఇదని చెబుతోంది. ఆమె ఎవరా అని ఆరా తీస్తే సర్వమంగళ గౌరిగారని తెలిసింది. ఆవిడ ఈ చిత్రంపై పుస్తకం రాశారంటే ఏం రాశారా? అనే టెన్షన్ నాలో ఉంది’’  అని పేర్కొన్నారు.
 
  తనికెళ్ల మాట్లాడుతూ- ‘‘ఒక సినిమా మీద పరిశోధక గ్రంథం రాయడమంటే చార్మి, పూరీ ధన్యులయ్యారు’’ అన్నారు. సర్వమంగళ గౌరి మాట్లాడుతూ- ‘‘ఎన్నో సామాజిక అంశాలను ‘జ్యోతిలక్ష్మి’ గుర్తుకు తెచ్చింది. ఈ అంశాలు నన్ను ఇన్‌స్పైర్ చేయడంతో కేవలం మూడు రోజుల్లోనే ఈ పుస్తకం రాశా’’ అని తెలిపారు. హీరో సత్య, పూరీ తనయుడు ఆకాశ్ తదితరులు పాల్గొన్నారు.