ద్రోణుడికి అర్జునుడు... నాకు మోహన్‌బాబు

22 Nov, 2015 07:00 IST|Sakshi
ద్రోణుడికి అర్జునుడు... నాకు మోహన్‌బాబు

‘స్వర్గం-నరకం’ @ 40
కొన్ని అంతే! మొదలైనప్పుడు మామూలుగా, అతి చిన్న ప్రయత్నాలుగా కనిపిస్తాయి. తీరా కొందరి జీవితాలనే మార్చేస్తాయి. ఇవాళ్టికి నలభై ఏళ్ళ క్రితం (1975 నవంబర్ 22న) రిలీజైన ‘స్వర్గం-నరకం’ అలాంటిదే! నటీ నటులంతా కొత్తవాళ్ళు... చిన్న బడ్జెట్... కలర్ సినిమాల క్రేజ్ ఊపేస్తున్న రోజుల్లో బ్లాక్ అండ్ వైట్... మద్రాస్ స్టూడియోలు దాటి బయటికొచ్చి, అంతా విజయవాడ ఇళ్ళలో షూటింగ్ ! అంచనాలేముంటాయి?

కానీ, అంతకు రెండేళ్ళ పైచిలుకు క్రితం డెరైక్టరై, సక్సెస్‌ల మీద సక్సెస్‌లిస్తున్న డెరైక్టర్  దాసరి నారాయణరావు సరిగ్గా తన ఈ పదో సినిమాతో మొత్తం కథనే మలుపుతిప్పేశారు. రిలీజయ్యాక ప్రతిచోటా జనం  మెప్పు... వసూళ్ళు... 6 కేంద్రాల్లో వంద రోజులు... ఆనక మరో 3 (హిందీ, తమిళ, మలయాళ) భాషల్లోకి రీమేక్...
 
అవును. మొదలైనప్పుడు ‘స్వర్గం - నరకం’ చిరుజల్లు. రిలీజయ్యాక వెండితెర తుపాన్. నాలుగు దశాబ్దాల తర్వాత ఇవాళ ఒక తీపి జ్ఞాపకం. మోహన్‌బాబు సహా ఎందరో ప్రముఖ ఆర్టిస్టుల తొలి అభినయం రికార్డు చేసిన సినీచరిత్ర. మావూళ్లయ్య, పి.ఎస్. భాస్కర రావు నిర్మించిన ఈ చిత్రానికి ఇవాళ్టితో 40 ఏళ్ళు నిండాయి. నిర్మాతలతో సహా అందరికీ అభివాదం చేస్తూ దాసరి పంచుకొన్న జ్ఞాపకాల్లో కొన్ని...
     
* అందరూ కొత్తవాళ్ళను పెట్టుకొని ‘స్వర్గం - నరకం’ తీయడానికి కారణం, ప్రేరణ - దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. ఆయనంటే నాకు అభిమానం. కొత్త వాళ్ళతో కలర్‌లో ఆయన ‘తేనెమనసులు’ తీస్తే, నేను ‘స్వర్గం-నరకం’ చేశా. అందుకే, దీన్ని ఆయనకే అంకితం చేశా.
* సక్సెస్‌లలో ఉన్న నాతో సినిమాలు చేయడానికి హీరోలు రెడీగా ఉన్నా, కొత్తవాళ్ళతోనే చేయాలనుకున్నా. పత్రికల్లో ప్రకటనలు వేసి, విజయవాడ, హైదరాబాద్, వైజాగ్, తిరుపతి, కాకినాడల్లో రెండేసి రోజుల చొప్పున కొత్తవాళ్ళను టెస్ట్ చేసి, ఎంపిక చేశాం.
* హైదరాబాద్‌లోని విశ్వేశ్వరరావును ‘ఈశ్వరరావు’గా, మద్రాసులోని భక్తవత్సలం నాయుడును ‘మోహన్‌బాబు’గా, విజయవాడ స్టేజ్ ఆర్టిస్ట్ ఉమను ‘అన్నపూర్ణ’గా తెరకు పరిచయం చేశా. మా స్క్రిప్ట్‌లో పాత్ర పేరు మోహన్. దానికి బాబు చేర్చి, ‘మోహన్‌బాబు’ చేశా.
* నిజానికి, మోహన్ పాత్రకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి రికమండేషన్‌తో బోసుబాబు అనే కుర్రాడు వచ్చాడు. పైగా, అసోసియేట్లతో తగాదా వచ్చి మోహన్‌బాబుకు చేసిన స్క్రీన్‌టెస్ట్‌ను వాళ్ళు దాచేయడంతో, నేను చూడనే లేదు. మోహన్‌బాబు మా ఆవిడ పద్మ వద్దకు వెళ్ళి బాధపడ్డాడు. చివరకు రవిరాజా తదితరులు చెప్పడంతో, ఇద్దరిలో ఎవరు బాగా చేస్తే, వాళ్ళను సెట్స్‌లో ఫైనలైజ్ చేద్దామని బెజవాడ షూటింగ్ బస్సులో ఆఖరి నిమిషంలో బోస్‌బాబుతో పాటు మోహన్‌బాబును కూడా ఎక్కించాం. బోస్‌బాబు జ్వరంతో అడ్డం పడ్డాడు. మోహన్‌బాబే చివరకు ఖరారయ్యాడు.
* తారలకు అందమైనబొమ్మలు తీసే ఫోటోగ్రాఫర్, అతను ప్రేమించి పెళ్ళాడిన ఆవిడ నిజజీవిత కథ నాకు తెలుసు. వృత్తిలోని అతని ప్రవర్తనను ఆమె అనుమానించింది. వాళ్ళ స్ఫూర్తితో ఈ స్క్రిప్ట్ అల్లా.
* మద్రాసు నుంచి బెంగళూరు వెళ్ళేలోగా, కీ డైలాగ్స్‌తో స్క్రిప్ట్ చెప్పా.
* నా దర్శకత్వంలో నేనే నటించడం మొదలుపెట్టిందీ ఈ చిత్రంతోనే. చివర్లో సందేశమిచ్చే ఆచారి పాత్రకు నా అసిస్టెంట్స్ రవిరాజా, రాజా చంద్ర, మా ఫ్రెండ్ రామచంద్రరావు, వైజాగ్‌లోని ఓ ప్రముఖ స్టేజ్ ఆర్టిస్‌ల్ని ట్రై చేశా. కుదర్లేదు. చివరకు ఆ వేషం నేనే వేశా.
* ఊళ్ళోని మా ఫ్రెండ్ మేనరిజమ్స్‌తో ఆచారి పాత్ర రాశా. ‘ఫినిష్’ అనే ఊత పదం పెడితే, అది జనంలో నానింది.
* మా సినిమాకు ఒక్కరోజు ముందు హీరో కృష్ణ నటించిన ‘దేవుడు లాంటి మనిషి’ రిలీ జైంది. కన్నడ రాజ్ కుమార్ సూపర్‌హిట్ ‘బంగారద మనుష్య’కి రీమేక్. పైగా కలర్ సినిమా. ఆ పోటీలోనే మా సినిమా మంచి ఓపెనింగ్స్‌తో హిట్టయింది.
* ‘విజయా’ నాగిరెడ్డి గారు నాతోనే ‘స్వర్గ్-నరక్’గా హిందీలో రీమేక్ చేశారు. అదే నా తొలి హిందీ సినిమా. దీన్ని తమిళంలో రాజేందర్, మలయాళంలో ఐ.వి. శశి రీమేక్ చేశారు.
* ‘స్వర్గం-నరకం’ నుంచి మోహన్‌బాబుతో సాహచర్యం విడ దీయరానంత పెరిగింది. ద్రోణు డికి అర్జునుడి మీద ఎంత గురో, నాకు అతని మీద అంత గురి.
* ఫిజిక్ డెవలప్ చేసి, డైలాగ్‌లో మాస్టర్‌గా, డిసిప్లిన్‌లో నంబర్1గా మోహన్‌బాబు ఎంతో ఎత్తు ఎదిగాడు. అతను వదిలేసిన ఎన్నో అవకాశాలతో చాలామంది హీరోలయ్యారు. ఏమైనా, ‘స్వర్గంనరకం’ ఓ తీపిగుర్తు.