అలాంటి చిత్రాల్లో నటించను

4 May, 2016 03:53 IST|Sakshi
అలాంటి చిత్రాల్లో నటించను

నటి తమన్నాకిది సెకెండ్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. అయితే తొలి ఇన్నింగ్స్‌లో కంటే ఇప్పుడే నటిగా తనకంటూ ఇక సార్థకతను ఏర్పరచుకుంటున్నారని చెప్పవచ్చు. అంతేకాదు బాహుబలికి ముందు ఆ తరువాత అని కూడా తమన్నా నట జీవితాన్ని విభజించి చూడాల్సి ఉంటుంది. తొలి ఇన్నింగ్‌లో అందాలారబోతకే పరిమితమైన ఈ బ్యూటీ ఇప్పుడు కాస్త నటనకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పడం కంటే అలాంటి అవకాశాలు వరిస్తున్నాయనే అనాలి. బాహుబలి, తోళా వంటి ద్విభాషా చిత్రాలు వరుసగా విజయం సాధించడంతో తమన్నాకు మరిన్ని అవకాశాలు తలుపుతడుతున్నాయి.

దీంతో ఈ అమ్మడి ధోరణిలోను మార్పు కనిపిస్తోంది. పారితోషికాన్ని అమాంతం పెంచేశారన్న ప్రచారం జరుగుతోంది. ఇకపోతే చెత్త చిత్రాల్లో నటించేదిలేదంటూ పెద్ద పెద్ద స్టేట్‌మెంట్‌లను ఇచ్చేస్తున్నారి ముంబై భామ. ముఖ్యంగా శోక పాత్రల్లో నటించేది లేదని అంటున్నారు. దీని గురించి తమన్నా ఏమంటున్నారో చూద్దాం. చిత్రాలు చూసే విషయంలో ఎవరి ఇష్టాలు వారికుంటాయి. కొందరికి ఉత్కంఠ భరితంగా సాగే హారర్ థ్రిల్లర్ కథా చిత్రాలు నచ్చుతాయి. మరి కొందరికి అవి నచ్చవి. వారు ప్రేమతో కూడిన కుటుంబ కథా చిత్రాలను ఇష్టపడతారు.

భావోద్రేకాలతో కూడిన కంట తడిపెట్టించే కథా చిత్రాలను చూసే వారు ఉంటారు. నాకు మాత్రం శోక భరిత కథా చిత్రాలంటే అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి చిత్రాలు చూడడానికి ఎవరైనా పిలిచినా రానని పారిపోతాను. అయితే అలాంటి చిత్రాల్లో నటించడంతో మంచి నటనను ప్రదర్శించే అవకాశం ఉంటుందంటారు. అందులో నిజం ఉండవచ్చు. సినీ అభిమానులు సంతోషంగా గడపడానికే థియేటర్లకు వస్తుంటారు. వారిని బాధాతప్త శోక కథలతో ఎందుకు కన్నీళ్లు పెట్టించాలి. అలా కంటతడి పెట్టించే చిత్రాల్లో నేను నటించను.

ఒక వేళ నటించాల్సిన పరిస్థితులు ఏర్పడినా వాటిని నేను చూడను. ఇప్పటి వరకూ జాలీగా ఉండే చిత్రాల్లోనే నటించాను. ఇకపై కూడా ఆ తరహా చిత్రాలనే చేస్తాను అంటున్నారు తమన్నా. ప్రస్తుతం బాహుబలి-2, తమిళంలో విజయసేతుపతికి జంటగా ధర్మదురై చిత్రాల్లో నటిస్తున్న తమన్నా విశాల్‌తో రొమాన్స్ చేసే కత్తిసండై చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. త్వరలో అజిత్‌కు జంట గా నటించే అవకాశం కూడా కొట్టేసే ప్రయత్నంలో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.