కంటెంట్‌ కింగ్‌.. ఆడియన్స్‌ కింగ్‌మేకర్స్‌!

13 Nov, 2018 07:42 IST|Sakshi

ఎంత భారీ బడ్జెట్‌ మూవీ అయినా, ఎంత పెద్ద స్టార్లు ఉన్నా.. అందులో​ఉన్న చిన్న లాజిక్‌, జనాలు మెచ్చే కంటెంట్‌ లేకపోతే అది డిజాస్టర్‌గా మిగిలిపోవాల్సిందే. సినిమాను నిలబెట్టేది స్టార్లు కాదు.. స్టోరీ. కథ, కథనాలు లేని సినిమాకు ఎంత బడ్జెట్‌ పెట్టినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఇదే పరిస్థితి నెలకొంది. 

ఆమిర్‌ ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌, కత్రినా కైఫ్‌ లాంటి భారీ తారాగణంతో ఇండియన్‌ మూవీ హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కిన ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. బాహుబలి సినిమా రికార్డులను బద్దలు కొడుతుందని ఆశపడిన బాలీవుడ్‌ వర్గాలకు ఎదురుదెబ్బ తగిలింది. రికార్డుల మాట అటుంచితే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేట్టు లేదు. ఈ మూవీ ఇప్పటి వరకు వంద కోట్ల మార్కును మాత్రమే దాటింది. 

అయితే ఈ చిత్రం విడుదలైన ఫస్ట్‌షో నుంచే నెగెటివ్‌ టాక్‌ మొదలై.. కలెక్షన్లకు గండికొట్టింది. ఎంత ఆమిర్‌, అమితాబ్‌లు ఉన్నా.. సినిమాలో అసలు విషయం లేకపోయే సరికి వసూళ్లపై ప్రభావం గట్టిగా చూపింది. అయితే ఇదే సమయంలో కుటుంబ కథానేపథ్యంలో లేటు వయసులో ప్రేమ, బిడ్డను కనడం, కుటుంబ ఘర్షణలు, ప్రేమానురాగాలతో కూడిన ‘బధాయీ హో’ విమర్శకుల ప్రశంసలనే కాదు, ప్రేక్షకుల మన్నలను కూడా దక్కించుకుంది. 

అయితే దివాళి కానుకగా అన్ని థియేటర్లలో ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’ను ప్రదర్శించారు. దాని ఫలితం తేలిపోయేసరికి వీకెండ్‌లో ఎలాగోలా గట్టెక్కించారు. అయితే ఈ వీకెండ్‌లో ‘బదాయిహో’కు షోలు తగ్గించేశారు. కానీ ఈ సోమవారం నుంచి మళ్లీ బధాయీ హోకు షోలు పెరిగాయి. ఎప్పటికైనా కథే కింగ్‌, అని ఆడియెన్సే కింగ్‌ మేకర్స్‌ అంటూ ప్రముఖ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. 

చదవండి : ‘బధాయీ హో’పై సమీక్ష

మరిన్ని వార్తలు