తెలంగాణలో తీసే చిత్రాలకు... తెలంగాణ కార్మికులే!

18 Jun, 2014 01:21 IST|Sakshi
తెలంగాణలో తీసే చిత్రాలకు... తెలంగాణ కార్మికులే!

 ‘‘తెలంగాణ చిత్ర పరిశ్రమ పునర్నిర్మాణమే మా ధ్యేయం. తెలంగాణ సినీ కళాకారుల అభ్యున్నతికి అహరహం శ్రమిస్తాం’’ అని తెలంగాణ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధ్యక్షుడు, నటుడు-నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ అన్నారు. తెలంగాణ సినిమాకు చెందిన 24 శాఖల ప్రతినిధులతో మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సినీ పరిశ్రమ పునర్నిర్మాణం కోసం చేపట్టాల్సిన పనుల గురించి రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ -‘‘రానున్న తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి ఎన్నికల్లో ఛాంబర్ అధ్యక్షునిగా తెలంగాణ వ్యక్తిని ఎన్నుకోవాలి. ఇది మా తొలి డిమాండ్. అలాగే... థియేటర్లలో పర్సంటేజ్ విధానం రావాలి.
 
 చిన్న సినిమాలపై పన్నును పూర్తిగా ఎత్తివేయాలి. థియేటర్లలో వేసే నాలుగు షోలలో తొలి ఆటను చిన్న సినిమాకు కేటాయించాలి. ఎన్టీఆర్ ప్రభుత్వం చిన్న సినిమాకు పదిలక్షల రూపాయిల సబ్సిడీ ఇచ్చేది. అయితే.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ విధానాన్ని రద్దు చేశాయి. ఇప్పుడు మళ్లీ ఆ విధానాన్ని కొనసాగించాలి. మా ముఖ్యమైన డిమాండ్ ఏమిటంటే.. ఇక నుంచి తెలంగాణలో నిర్మించే సినిమాలకు యాభై శాతం మంది తెలంగాణ కార్మికులనే తీసుకోవాలి. ఈ డిమాండ్లను సాధించేదాకా మా ప్రొడ్యూసర్స్ గిల్డ్ పోరాటం సాగిస్తూనే ఉంటుంది’’ అని తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన కార్మికులు సామరస్యంతో కలిసి మెలిసి పనిచేస్తూ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఎంప్లాయీస్ యూనియన్ సంయుక్త కార్యదర్శి రాజేశ్వరరెడ్డి సూచించారు.
 
  పెద్ద సినిమాలకు తెలంగాణ కార్మికులు చాలా తక్కువ మంది పని చేస్తున్నారని ఈ వివక్షను విడనాడాలని సినీ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్ అధ్యక్షుడు వి.వి.కృష్ణ కోరారు. తెలంగాణ నిర్మాతలు నిర్మించే సినిమాల్లో కళాకారులు కానీ, కార్మికులు కానీ వంద శాతం మంది తెలంగాణ వారే ఉండాలని, అలాగే... ఆంధ్ర ప్రాంత నిర్మాతలు నిర్మించే చిత్రాల్లో కనీసం యాభై శాతం మంది తెలంగాణ కళాకారులకు, కార్మికులకు అవకాశం ఇవ్వాలని ఎడిటర్స్ యూనియన్ అధ్యక్షుడు ఆవుల వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఇంకా ఈ సమావేశంలో స్టూడియో సెక్టార్ అధ్యక్షుడు రవి యాదవ్, ప్రొడ్యూసర్ గిల్డ్ నాయకులు రత్నాకర్, ఇ.వి.ఎన్.చారి, అలెక్స్‌లతో పాటు వివిధ సంఘాల నాయకులు గూడ రామకృష్ణ, సతీశ్, టి.ఎన్.రాజు, డేవిడ్, హెచ్.మూర్తి, స్వామిగౌడ్, వేణుకుమార్, రమేశ్, నైజాం నారి, కె.నాగరాజు, ఉపేందర్ తదితరులు మాట్లాడారు.