ఒంటి చేతితో... విజయ సాధన | Sakshi
Sakshi News home page

ఒంటి చేతితో... విజయ సాధన

Published Wed, Jun 18 2014 12:10 AM

ఒంటి చేతితో...  విజయ సాధన

అలవోకగా విజయం సాధించారు...
అని చెప్పడానికి ‘ఒంటి చేత్తో విజయం సాధించారు’ అనే మాటను వాడుతుంటారు.
ప్రపంచ స్థాయి టేబుల్ టెన్నిస్‌లో అద్భుతంగా రాణిస్తున్న బ్రునా అలెగ్జాండ్రే కూడా ఒంటి చేత్తోనే విజయాలు సాధిస్తుంది. నిజానికి ఆమెకు కుడి చేయి లేదు.
‘‘లేని దాని గురించి బాధ పడడం కాదు...ఉన్న శక్తిని ఎలా వినియోగించుకోవాలో ఆలోచిస్తాను’’ అని చెప్పే బ్రునా గురించి తెలుసుకుందాం....
 
గత సంవత్సరం హైదరాబాద్‌లో జరిగిన వరల్డ్ జూనియర్స్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్‌లో అందాల బొమ్మ బ్రునా అలగ్జాండ్రే ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ‘ప్రత్యేకత’ ఆమె అందం వల్ల వచ్చింది కాదు. ఒంటి చేతితో ఆమె చేసిన విన్యాసాల వల్ల వచ్చిన ప్రత్యేకత అది. ఆమె కదలికలు మెరుపు విన్యాసాల్లాగా ఉన్నాయి. ఆట ఆడే క్రమంలో ఆమె అరుపులు గర్జనల్లా ఉన్నాయి. ‘‘ఒంటి చేతితో భలే ఆడుతుంది’’ అని ప్రేక్షకులు ఆశ్యర్యానికి గురయ్యేలా చేసింది బ్రునా. పదహారణాల భారతీయ యువతిలా కనిపించే బ్రునా బ్రెజిల్ అమ్మాయి. దక్షిణ బ్రెజిల్‌లోని సాంటా కేటరినాలో జన్మించిన బ్రునా భారతదేశమన్నా, ఇక్కడి దుస్తులు అన్నా బాగా ఇష్టపడుతుంది.

‘‘భారతీయ యువతులు చాలా శక్తిమంతులు’’ అని చెబుతుంది బ్రునా. నిజానికి, ఆమెలో ఉన్న శక్తిసామర్థ్యాలు తక్కువేమీ కాదు. వైద్యంలో జరిగిన పొరపాటు వల్ల మూడు సంవత్సరాల వయసులో కుడి చేతిని కోల్పోయింది. ఏడు సంవత్సరాల వయసులో టేబుల్ టెన్నిస్‌ను మొదలుపెట్టిన బ్రునా ఇప్పటి వరకు ఎనిమిది అంతర్జాతీయ పారా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లలో ప్రతిభ చాటుకుంది.
 సొంత శైలి...: టేబుల్ టెన్నిస్ ఆడడంలో తనదైన సొంత శైలి ఏర్పాటు చేసుకుంది బ్రునా. దాని వెనుక ఎంతో సాధన ఉంది. ‘‘ఒక్క చేతిలో ఆడడం కష్టం కదా?’’ అని అడిగితే ఆమె చిన్నగా నవ్వి... ‘‘మొదట్లో కష్టంగానే ఉండేది. గత ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్న కఠోర సాధన వల్ల ఇప్పుడు పెద్దగా కష్టం అనిపించడం లేదు’’ అంటుంది.

ఆమె స్ఫూర్తితో...: పోలండ్‌కు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నటాలియా అంటే బ్రునాకు చాలా అభిమానం. ఆమె నుంచి ఎంతో స్ఫూర్తి పొందింది. నటాలియాకు కుడి చేయి లేదు. అయినా  ఆ లోటు ఎక్కడ కనిపించకుండా అద్భుతంగా ఆడుతుంది. విశేషమేమిటంటే తాను ఎంతగానో అభిమానించే నటాలియాతో లండన్ ఒలింపిక్ వుమెన్స్ టేబుల్ టెన్నిస్‌లో బ్రునా పోటీ పడింది. ‘‘నటాలియాతో పోటీ పడి ఓడిపోయాను. అయితేనేం, బలమైన ప్రత్యర్థిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయంలో మాత్రం ఎన్నో విషయాలు తెలుసుకున్నాను’’ అంటుంది బ్రునా. పుస్తకాలు ఎక్కువగా చదివే బ్రునాలో మానసిక పరిణతి స్పష్టంగా కనిపిస్తుంది. ‘‘పోటీలోని ప్రత్యర్థులపై ఎటాక్, డిఫెన్స్‌లో ఆమెకు మంచి బలం ఉంది. ఎలాంటి స్థితిలోనైనా నింపాదిగా ఉండగలదు’’ అని బ్రునా గురించి మెచ్చుకోలుగా అంటారు కోచ్ లింకన్ యసుద.

‘‘అన్నయ్య టెన్నిస్ ఆడుతుంటే ఆసక్తిగా చూసేదాన్ని. నాకూ ఆడాలనిపించేది.  ఒంటిచేతితో ఆడడం కష్టం అనుకునేదాన్ని. టేబుల్ టెన్నిస్ రాకెట్ పట్టుకోవాలన్న నా కోరికతో అనుమానం వెనక్కి వెళ్లిపోయింది. మెల్లగా  ఆడడం మొదలు పెట్టాను’’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది బ్రునా. ఆమె ఆడిన 66 మ్యాచ్‌లలో 56 గెలిచి ‘టెన్నిస్ స్టార్’ అనిపించుకుంది. టోర్నమెంట్‌లలో విజయం టేబుల్ టెన్నిస్‌తో ఆమె మరింత మమేకం కావడానికి ఉపయోగపడింది. ‘‘గెలిచిన తరువాత లభించే అభినందనలు వెయ్యి ఏనుగుల బలాన్ని  ఇస్తాయి. మరిన్ని విజయాలు సాధించాలనే పట్టుదలను పెంచుతాయి’’ అంటుంది బ్రునా.

 పెద్ద కల... ఇప్పుడు బ్రునా ముందు ఒక పెద్ద కల ఉంది. అది... పారా ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకోవడం, 2016 సమ్మర్ ఒలింపిక్స్‌లో బ్రెజిల్‌కు ప్రాతినిధ్యం వహించడం.

‘‘దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే గొప్ప విషయం ఏముంటుంది?’’ అంటుంది ఆమె. బ్రునాకు ఫుట్‌బాల్ అంటే కూడా ఇష్టం. ఫుట్‌బాల్ ఆటగాడు ‘కాక’కు అభిమాని. ‘‘మైదానంలో ‘కాక’ ఆడుతుంటే చూడాలి. ఆ వేగం మాటలకు అందదు’’ అంటుంది బ్రునా. ఈ విషయం పక్కన పెడితే ‘‘ఆమె టేబుల్ టెన్నిస్ రాకెట్ పట్టుకొని ఆడుతుంటే చూడాలి. ఆ వేగం ఎవరికీ సాధ్యపడదు’’ అని బ్రునా గురించి చెప్పుకునే అభిమానులకు కొదవ లేదు.

 ‘‘టేబుల్ టెన్నిస్‌లో అద్భుతాలు సృష్టించాలని ఆమె రాకెట్ పట్టలేదు. బాల్యంలో తన సోదరుడితో పాటు సరదాగా నేర్చుకుంది. అనుకోకుండా అద్భుతాలు సృష్టించింది’’ అంటాడు మెచ్చుకోలుగా కోచ్ లింకన్.ఒలింపిక్ గేమ్స్, పారా ఒలింపిక్ గేమ్స్‌లో సమానస్థాయి ప్రతిభను కనబరిచి చరిత్ర సృష్టించింది పోలిష్ స్టార్ నటాలియా. బ్రునా కూడా ఇప్పుడు అదే పనిలో తీరిక లేకుండా ఉంది.
 
సమస్య అనుకుంటే అన్నీ సమస్యలే. దానికి అంతు లేదు. సమస్య లేదు అనుకుంటే లేనే లేదు. నా కుడిచేయి గురించి నేను ఆలోచించను. కాబట్టి నాకు అది సమస్యగా అనిపించదు. ఎంత బాగా ఆడగలుగుతున్నాను అనే దాని  గురించే ఎక్కువగా
 ఆలోచిస్తాను.
 - బ్రునా
 
 

Advertisement
Advertisement