తొమ్మిది భాషల్లో అనువాదమైన తెలుగు బాలల చిత్రం గంగా భవాని

17 Nov, 2013 00:37 IST|Sakshi
తొమ్మిది భాషల్లో అనువాదమైన తెలుగు బాలల చిత్రం గంగా భవాని
 పిచ్చి పుల్లయ్య, చరణదాసి, జయం మనదే, ఇల్లరికం, మైనర్‌బాబులాంటి చిత్రాలు డెరైక్ట్ చేసిన ప్రసిద్ధ దర్శక నిర్మాత తాతినేని ప్రకాశరావు ఓ బాలల చిత్రం చేశారు. 1979లో విడుదలైన ఆ సినిమా పేరు ‘గంగా భవాని’. చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ నిర్మించిన తొలి దక్షిణ భారత చిత్రం ఇదే కావడం విశేషం. తెలుగులో రూపొందిన ఈ చిత్రం 9 భాషల్లో అనువాదం కావడం మరో విశేషం. కథ విషయానికొస్తే - కొంతమంది స్మగ్లర్లు దేవతా విగ్రహాలను తస్కరించి విదేశాలకు తరలిస్తుంటారు. ఓ ఊళ్లో గంగా భవానీ విగ్రహాన్ని ఓ ముఠా తస్కరిస్తే, ముగ్గురు పిల్లలు ఎంతో సాహసంతో వాళ్లను పోలీసులకి పట్టిస్తారు.
 
  ఈ ముగ్గురు పిల్లల పాత్రలను రాము, రవిశంకర్, గురుప్రసాద్ పోషించారు. గుమ్మడి, మిక్కిలినేని, పద్మనాభం, బాలయ్య, త్యాగరాజులాంటి హేమాహేమీలు కూడా ఇందులో నటించారు. ఇందులో రెండు పాటలు కూడా ఉన్నాయి. రమేశ్‌నాయుడు స్వరాలందించారు. ఆరుద్ర రచన చేశారు. మల్లీ ఇరానీ ఛాయాగ్రహణం అందించారు. ఈ సినిమాకు మంచి పేరొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ బాలల చిత్రం పురస్కారం కూడా లభించింది. అయితే సినిమా నిడివి ఆరు రీళ్లు కావడంతో మామూలు థియేటర్లో విడుదల చేయడానికి ఎవరూ సాహసించలేదు. ఈ సినిమా ప్రింట్ సొసైటీ దగ్గర భద్రపరచి ఉందో లేదో? ఒకవేళ ఉంటే కనుక ఇలాంటి అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల సమయంలోనే ప్రదర్శిస్తే సముచితంగానూ, సమయోచితంగానూ ఉంటుంది.