ఎముకలు కొరికే చలిలో... | Sakshi
Sakshi News home page

ఎముకలు కొరికే చలిలో...

Published Sun, Nov 17 2013 12:25 AM

anuskha is good hard worker says potluri v prasad

నిర్మాతల శ్రేయస్సును కోరే  కథానాయికలు ప్రస్తుతం అరుదైపోయారనే చెప్పాలి. సౌకర్యాల విషయంలో.. ఏ మాత్రం రాజీ పడకుండా నిర్మాతలకు చుక్కలు చూపించడంలో నేటి కథానాయికలు దిట్టలు. ఒకప్పుడు సౌందర్య నిర్మాతల పాలిటి కల్పతరువుగా వెలిగారు. తాను కోరడమే ఆలస్యం... అయిదు నక్షత్రాల హోటళ్లలో సూట్ తీయడానిక్కూడా వెనుకాడని నిర్మాతలున్న రోజుల్లోనే... హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ప్రశాంత్ కుటీర్ అనే చిన్న గెస్ట్‌హౌస్‌లో బస చేసేవారు సౌందర్య. 
 
 పారితోషికం విషయం కాని, సౌకర్యాల విషయంలో కాని, చివరకు కాస్ట్యూమ్స్ కొనుగోళ్ల విషయంలో కూడా ఆమె చాలా ఉదారంగా ప్రవర్తించేవారట. నిర్మాత కష్టాలు పడకుండా, నష్టపోకుండా చూసుకునేవారట. కానీ ప్రస్తుత కథానాయికలు అందుకు పూర్తి విరుద్ధం. వాళ్లకు నిర్మాతల్ని కష్టపెట్టడమే పని. అయితే... అలాంటి కథానాయికల లిస్ట్‌లో నుంచి అనుష్కను మాత్రం మినహాయించాలి. నిర్మాతల క్షేమాన్ని కాంక్షించే విషయంలో సౌందర్యను తలపిస్తున్నారట అనుష్క. గతంలో చాలామంది నిర్మాతలు ఈ విషయాన్ని బహిరంగంగానే వ్యక్తపరిచినా...
 
  ‘వర్ణ’ నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి ఇటీవల ఈ విషయాన్ని ధృఢపరిచారు. ‘‘జార్జియాలో ఎముకలు కొరికే చలిలో ‘వర్ణ’ షూటింగ్ చేశాం. ఆ చలిలో అనుష్క అందించిన సహకారం మరిచిపోలేను. ప్రత్యేకమైన సౌకర్యాలేం ఆశించకుండా, దాదాపు వారం రోజుల పాటు ఆ ఎపిసోడ్‌ని పూర్తి చేశారామె. ఈ చిత్రం బడ్జెట్ అంచనాలకు మించడంతో పారితోషికం విషయంలో కూడా ఆమె ఉదారత చూపించారు. నేటి కథానాయికల్లో నిజంగా అనుష్క ఆణిముత్యమే’’ అన్నారాయన.
 

Advertisement
Advertisement