దేవుడు కూడా... తెలుగు సినిమా తీయలేడు!

14 Jun, 2015 10:10 IST|Sakshi
దేవుడు కూడా... తెలుగు సినిమా తీయలేడు!

 - దర్శకుడు పూరి జగన్నాథ్
 

పూరి స్పీడు... చార్మి అంతకన్నా యమస్పీడు... వాళ్ళి కాంబినేషన్‌లో వచ్చిన తొలి తెలుగు సినిమా ‘జ్యోతి లక్ష్మీ’ కూడా పేరు నుంచి పాటల విజువల్స్ దాకా ప్రతి అంశంతో స్పీడుగా జనాన్ని ఆకర్షిస్తోంది. శుక్ర వారం విడుదలైన
 ఆ సినిమా గురించి పూరి, చార్మి ‘సాక్షి’ మీడియా గ్రూప్‌తో మాట్లాడారు.
 పూరి చెప్పిన కబుర్లు...
 
 * ‘‘ ‘ఇడియట్’లో హీరో పాత్ర చంటి, హీరోయిన్‌ను ‘ఒసేయ్’ అన్నాడని ఒకరు తిడితే, మరొకరు సరిగ్గా అలాంటి అబ్బాయి కోసమే వెతికి పెళ్ళి చేసుకున్నారు. ప్రేక్షకుల్లో ఒకరికి నచ్చింది, మరొకరికి నచ్చదు. అందరికీ నచ్చేలా ఆ దేవుడు కూడా తెలుగు సినిమా తీయలేడు.’’  
 
* ‘‘వేశ్య అంటే సాటి ఆడవాళ్లకే ఇష్టం ఉండదు. మగవాళ్లు ఇష్టపడతారు. ఆడవాళ్లు మాత్రం అసహ్యించుకుంటారు. 45 ఏళ్ల క్రితం మల్లాది వెంకట కృష్ణమూర్తిగారు వేశ్య కథతో ‘మిసెస్ పరాంకుశం’ నవల రాసినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఇప్పుడూ అలాగే ఉన్నాయి.’’
 
 * ‘‘ఈ సినిమాలో ‘ఆడవాళ్లను అర్థం చేసుకోకపోయినా ఫర్లేదు....గౌరవించండి చాలు’ అని నేను రాసిన డైలాగ్ చాలామందికి నచ్చింది. మగాళ్లలో చాలామంది ఆడవాళ్లను చిన్నచూపు చూస్తారు. నేనీ సినిమా తీయడం వెనక ఉన్న ఉద్దేశం ఒకటే ...మహిళలు ఏ వృత్తిలో ఉన్నా, వారిని అందరూ గౌరవించాలి.  అంతే... బేసిగ్గా నేను ఫెమినిస్టును. ఆడవాళ్లను సాటి ఆడవాళ్లే గౌరవించాలి. అందుకే ఈసారి నుంచి మహిళా ప్రాధాన్య చిత్రాలను తీయాలనుకుంటున్నా.’’
 
 జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి... పక్కనున్న  పోలీస్ స్టేషన్‌లో అప్పగించా!  - చార్మి
 
 చార్మి చెప్పిన కబుర్లు...
* ‘‘పూరి గారు ఈ కథ చెప్పినప్పుడు బావుందనిపించింది. కానీ హీరోయిన్‌గా కాకుండానే నా మీద నిర్మాత అనే బాధ్యతా పెట్టారు. ‘జ్యోతిలక్ష్మీ’లో నేను నటించలేదు.. ప్రవర్తించానంతే.’’
 
 * ‘‘ఏడెనిమిది సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గురించి చెబుతాను. కొత్తగా కారు కొనుక్కొని హైదరాబాద్‌లో చాలా రద్దీలో ఉన్న ట్రాఫిక్‌లో వెళుతున్నాను. ఇంతలో ఒకతను వచ్చి కారును గుద్దాడు. సారీ చె ప్పి వెళ్లిపోకుండా, అనవసరంగా మాతో  గొడవ పెట్టుకున్నాడు. కార్లో ఉన్న నన్ను చూసి హీరోయిన్స్ గురించి తప్పుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. నాకు కోపం వచ్చి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి పక్కన ఉన్న పోలీస్ స్టేషన్‌లో అప్పగించాను. హీరోయిన్స్ అంటే గౌర వం లే ని వాళ్లు... తమ ఇంట్లోని ఆడ వాళ్లను కూడా గౌరవించ రని నా ఫీలింగ్.’’