హద్దు దాటితే ఆపదలే..!

28 May, 2017 01:48 IST|Sakshi
హద్దు దాటితే ఆపదలే..!

‘‘లేడీస్‌ టైలర్‌’కి సీక్వెల్‌ తీయాలని అప్పట్లో అనుకోలేదు. 31 ఏళ్ల తర్వాత సీక్వెల్‌ చేయడం ఓ మంచి అనుభూతి. ‘ఇలా కావాలి’ అని ‘మధుర’ శ్రీధర్‌గారు చెప్పారు. కథ రాసేశాను. ఆయనకు బాగా నచ్చింది. ఆ తర్వాత ‘ఫ్యాషన్‌ డిజైనర్‌’ని మొదలుపెట్టాం’’ అని వంశీ అన్నారు. సుమంత్‌ అశ్విన్‌ హీరోగా ఆయన దర్శకత్వంలో ‘మధుర’ శ్రీధర్‌ నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వంశీతో స్పెషల్‌ టాక్‌.

► వంశీగారూ.. మీరు గ్యాప్‌ తీసుకుంటే ఫ్యాన్స్‌ ఫీలైపోతారండి.. కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తే బాగుంటుందేమో?
వరుసగా సినిమాలు చేయాలని నాకూ ఉంది. ఇదిగో ఈ ‘ఫ్యాషన్‌ డిజైనర్‌’ తర్వాత ఓ సినిమా చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. మహాద్భుతమైన కథ ఒకటి రెడీ అవుతోంది. తెలుగులో ఇప్పటివరకూ అలాంటి కథ రాలేదు.

►లేడీస్‌ టైలర్‌’ సన్‌ గురించి కొన్ని మాటలు...
ఫాదర్‌లానే సన్‌కి టైలరింగ్‌ అంటే ఇష్టం. ఇప్పుడు ట్రెండ్‌ మారింది కదా. సన్‌.. ఫ్యాషన్‌ డిజైనర్‌ అవుతాడు. తండ్రిలా అరుగు మీద బట్టలు కుడుతుంటాడు. సిటీకెళ్లి షాప్‌ పెట్టాలనుకుంటాడు.

►లేడీస్‌ టైలర్‌’లో ఉన్న ఏయే క్యారెక్టర్లు ఈ సినిమాలో కంటిన్యూ అవుతాయి?
ఎవ్వరూ లేరు. అసలు అప్పటి ఆర్టిస్టుల్లా ఇప్పుడు పని చేసేవాళ్లూ, యాక్ట్‌ చేసేవాళ్లూ తక్కువైపోయారు. హిందీ సినిమాలను తీసుకుందాం. అక్కడ సీక్వెల్స్‌ ఎక్కువగా తీస్తుంటారు. ముందు భాగంలో నటించినవాళ్లు తర్వాతి భాగంలో దాదాపు ఉండరు. వేరే ఆర్టిస్టులు యాక్ట్‌ చేస్తుంటారు.

►మీ రెగ్యులర్‌ సినిమా హీరోయిన్‌లానే ఇందులో హీరోయిన్లు కనిపిస్తారా?
    కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తారు. అందరికీ నచ్చేట్లుగానే ఉంటారు.

మీ తొలి కథానాయిక గురించి?
అది గమ్మత్తుగా జరిగింది. ఎమ్మార్‌ ప్రసాద్‌రావుగారు ముందు బాపూగారితో ‘మంచు పల్లకి’ తీయాలనుకున్నారు. కుదరలేదు. ఆ తర్వాత ఎవరెవరితోనో ట్రై చేశారు. చివరికి నన్ను చేయమన్నారు. అప్పుడు డైరెక్షన్‌ చేయాలనే ఆలోచన నాకు లేదు. అయినా అడిగారు కాబట్టి, చేశాను. ఆ సినిమాలో హీరోయిన్‌గా సుహాసిని చేసిన విషయం తెలిసిందే. తను అప్పటికే తమిళంలో నాలుగైదు సినిమాలు చేసేసింది. అందులో మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి తను. ట్రెడిషనల్‌గా చూపించాం.

బాపూగారు చేయాల్సిన సినిమాకి మిమ్మల్ని అడిగినప్పుడు ఏమనిపించింది?
అప్పుడు నాకు 22 ఏళ్లు మాత్రమే. డైరెక్షన్‌లో ఎంతో నేర్చుకోవాల్సి ఉందనుకునేవాణ్ణి. అప్పుడే వరల్డ్‌ ఫిల్మ్స్‌ చూడటం మొదలుపెట్టాను. ఇంగ్లిష్‌ సినిమాలు బాగా చూసేవాణ్ణి. ఓ 30 ఏళ్లకి డైరెక్టర్‌ అవుదామనుకున్నాను. కానీ, వేమూరి సత్యనారాయణగారని..

ఆయన ‘నేర్చుకున్నది చాలు’ అంటూ డైరెక్షన్‌లోకి తోసేశారు. ఆ సంగతలా ఉంచితే.. నేను బాపూగారికి ఏకలవ్య శిష్యుణ్ని. ఆయన ఎక్కువ బొమ్మలు వేసినది నా కథలకే. అది తలుచుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. విశ్వనాథ్‌గారన్నా చాలా అభిమానం. వాళ్లిద్దర్నీ ప్రేరణగా తీసుకుని సినిమాలు తీయాలనుకున్నా కానీ, వారిలా తీయాలని మాత్రం అనుకోలేదు. అయితే బిగినింగ్‌ డేస్‌లో నాపై తమిళ దర్శకుడు భారతీరాజాగారి ప్రభావం ఉండేది. అప్పట్లో మద్రాసులోనే ఉండేవాణ్ణి. తమిళం మాట్లాడతాను.. రాయగలను కూడా.

తమిళం మాట్లాడటం వరకూ ఓకే కానీ.. రాయడం ఎలా నేర్చుకున్నారు?
తమిళం నేర్చుకోవడానికి ఓ కారణం ఉంది. నాకు బాలచందర్‌గారంటే ఇష్టం. ఆయన దగ్గర పని చేద్దామనుకున్నాను. ప్రయత్నిస్తే వాచ్‌మ్యాన్‌ గేటు కూడా దాటనివ్వలేదు. కానీ నేర్చుకున్న భాష మాత్రం ఉపయోగపడింది. నేషనల్‌ అవార్డు వచ్చినప్పుడు తమిళం, తెలుగు, కన్నడం మలయాళం.. ఇలా అవార్డు విన్నర్స్‌ అందరం ఓ విమానంలో వెళ్లాం.

అందులో బాలచందర్‌గారు ఉన్నారు. ఆ విమానంలో ఆయన పక్క సీటు నాదే. చాలా ఆనందపడ్డాను. ‘మీ దగ్గర పని చేయడానికే నేను తమిళం నేర్చుకున్నా’ అన్నాను. ఆయన నా భుజం మీద చేయి వేసి, ఆప్యాయంగా ఓ నవ్వు నవ్వారు. ఈ విధంగా కలుసుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. చాలా సంతోషపడ్డాను.

ఫైనల్లీ... ఫేస్‌బుక్‌లో భలే భలే పోస్టులు చేస్తుంటారు.. వంశీగారు ‘టెకీసావీ’ అంటే చాలామందికి వింతగా ఉంటుంది..
ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. డైలీ నేను కంటికి నచ్చిన దృశ్యాలను ఫొటో తీస్తాను. వాటిని ఫేస్‌బుక్‌లో పెడుతుంటాను. చాలా లైక్స్‌ వస్తుంటాయి. ఒకసారి ఒక పోస్ట్‌కి లక్షా 30 వేల లైక్స్‌ వచ్చాయి. అద్భుతం అంటూ కామెంట్స్‌ పెడుతుంటారు. టెక్నాలజీని ఎవరైనా వాడుకోవాలి. అయితే సద్వినియోగం చేసుకోవాలి.

కరెక్టే.. ఈ మధ్య ఫోన్లు మాట్లాడటమే పనిగా పెట్టుకున్నవాళ్లు, ఫేస్‌బుక్‌ లేకపోతే ఫేస్‌ మాడ్చేసేవాళ్లే ఎక్కువ..
అవును. ఈ సినిమా షూటింగ్‌ని పాపికొండల్లో చేశాం అన్నాను కదా. అక్కడికి కొంతమంది కుర్రాళ్లు వచ్చారు. కళ్లకు ఇంపుగా కనిపిస్తున్న ప్రకృతిని ఆస్వాదించకుండా ఫోన్‌ పట్టుకుని కొండ పైకి ఎక్కారు. అంత పైకి ఎందుకు వెళుతున్నారా అని చూస్తే.. మొబైల్‌ సిగ్నల్స్‌ కోసం అట. ఏదైనా మనం లిమిటేడ్‌గా వాడితే బాగానే ఉంటుంది.

పరిధి దాటితేనే ఆపదలు వస్తాయి. వీటి వల్ల క్రైమ్‌ కూడా ఎక్కువైపోతుంది. ఈ సినిమా షూటింగ్‌ అప్పుడు నా ఫోన్‌ గోదావరిలో పడిపోయింది. నేనేం కంగారుపడలేదు. ఎందుకంటే ఫోన్‌ లేకుండా ఉండలేనంత పరిస్థితుల్లో లేను. కొత్త ఫోన్‌ వచ్చేంతవరకు మాములుగానే ఉన్నాను.

టెక్నాలజీ పెరిగింది కాబట్టి, సినిమా తీయడం సులభం అయిందనిపిస్తోందా?
సినిమా తీయాలనే ఆలోచన ఉంటే ఏ కాలమైనా ఒక్కటే అని నా ఫీలింగ్‌.

పాటలు, ఫైట్స్‌ అంటూ రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలెందుకు తీయరు?
‘ఫ్యాషన్‌ డిజైనర్‌’ కమర్షియల్‌ సినిమానే. మాస్‌ సినిమానే. బీభత్సమైన ఫైట్స్‌ ఉండకపోవచ్చు. వినోదాత్మక చిత్రం. చక్కని కథ, గోదావరి అందాలు హాయిగా ఉంటుంది. మణిశర్మగారైతే బాగుంటుందని శ్రీధర్‌గారే అన్నారు. నిజంగానే ఆయన మంచి ట్యూన్స్‌ ఇచ్చారు. సినిమా అంతా పాపికొండల్లోనే తీశాం. అక్కడ స్టే చేసి, షూట్‌ చేసిన యూనిట్‌ మాదే అవుతుందేమో.