ఆస్కార్ రూట్ నుంచి డైవర్ట్ అయిన ది గుడ్ రోడ్

22 Dec, 2013 00:21 IST|Sakshi
ఆస్కార్ రూట్ నుంచి డైవర్ట్ అయిన ది గుడ్ రోడ్
 ఆస్కార్ అవార్డు అందుకోవాలనే కల దాదాపు ప్రతి కళాకారుడికి ఉంటుంది. కానీ, ఆ కల కొంతమందికే నెరవేరుతుంది. ఒకవేళ ఆస్కార్ ప్రతిమను సొంతం చేసుకోలేకపోయినా, కనీసం ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ వరకూ వెళ్లినా ఫర్వాలేదనుకుంటారు. ఆస్కార్‌కి ఉన్న క్రేజ్ అలాంటిది. ఇక అసలు విషయానికొస్తే ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఈ ఏడాది మన భారతదేశం నుంచి నామినేషన్ ఎంట్రీ పోటీలో గుజరాతీ సినిమా ‘ది గుడ్ రోడ్’ నిలిచింది. ఇక, అప్పట్నుంచీ ఈ చిత్రం నామినేషన్ వరకూ వెళితే బాగుంటుందని చాలామంది కోరుకున్నారు. కానీ, ఆ కోరిక నెరవేరలేదు. ఎందుకంటే, నామినేషన్ వరకూ వెళ్లకుండానే ‘ది గుడ్ రోడ్’ ఆస్కార్ రూట్ నుంచి డైవర్షన్ తీసుకుంది.  ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ ఎంట్రీకి ఎంపికైన తొమ్మిది చిత్రాల వివరాలను ఆస్కార్ అవార్డ్ కమిటీ ప్రకటించింది. వీటిలో ‘ది గుడ్ రోడ్’ లేకపోవడం ఆ యూనిట్ సభ్యులను నిరుత్సాహపరుస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 
 
 ఇక, నామినేషన్ దక్కించుకున్న ఇతర దేశాల చిత్రాల విషయానికి వస్తే... ‘ది బ్రోకెన్ సర్కిల్ బ్రేక్‌డౌన్ (బెల్జియమ్), ‘యాన్ ఎపిసోడ్ ఇన్ ది లైఫ్ ఆఫ్ యాన్ ఐరన్ పికర్’ (బోస్నియా మరియు హెర్‌జెగోవినా), ‘ది మిస్సింగ్ పిక్చర్’ (కంబోడియా), ‘ది హంట్’ (డెన్‌మార్క్), ‘టూ లైవ్స్’ (జర్మనీ), ‘ది గ్రాండ్‌మాస్టర్’ (హంగ్‌కాంగ్), ‘ది నోట్‌బుక్’ (హంగేరి), ‘ది గ్రేట్ బ్యూటీ’ (ఇటలీ), ‘ఒమర్’ (పలెస్టైన్) ఉన్నాయి. ఇల్లు అలకగానే పండగ కాదు అన్నట్లు.. నామినేషన్ దక్కించుకున్నంత మాత్రాన ఫైనల్స్‌కి వెళతాయనడానికి లేదు. వీటిలో ఓ ఐదు చిత్రాలను ఎంపిక చేసి, ఫైనల్స్‌కి పంపిస్తారు. వచ్చే నెల 16న నామినేషన్ దక్కించుకున్న ఆ ఐదు చిత్రాల వివరాలను ఆస్కార్ కమిటీ ప్రకటిస్తుంది. ఆ ఐదులో ఒక చిత్రాన్ని ఆస్కార్ వరిస్తుంది.