ఆంగ్లో ఇండియన్‌ అంటే ఎవరు? పార్లమెంట్‌లో ఎందుకు స్థానం కల్పించారు? ఎవరు రద్దు చేశారు?

29 Aug, 2023 14:01 IST|Sakshi

దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని లోక్‌సభ, అసెంబ్లీలలో ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీ ప్రాతినిధ్యం ఉండేది. లోక్‌సభకు ఆంగ్లో ఇండియన్‌ ప్రతినిధులను రాష్ట్రపతి స్వయంగా ఎన్నుకునేవారు. సభలో ఈ సంఘానికి రెండు సీట్లు రిజర్వ్ చేసేవారు. పార్లమెంట్‌లో అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉంటుంది. దేశంలో ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీ చరిత్ర గురించి తెలుసుకుందాం.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 (2)లో ఆంగ్లో ఇండియన్ ప్రస్తావన కనిపిస్తుంది. ఆంగ్లో-ఇండియన్ అంటే భారతదేశంలో నివసిస్తూ, వారి తండ్రి లేదా అతని తండ్రితరపు పూర్వీకులు యూరోపియన్ సంతతికి చెందినవారై ఉండాలి. చరిత్రను పరిశీలిస్తే భారతదేశంలో ఆంగ్లో-ఇండియన్ల రాక బ్రిటీష్ వారు భారతదేశంలో రైల్వే ట్రాక్‌లు,టెలిఫోన్ లైన్లు వేసినప్పుడు ప్రారంభమైంది. ఈ పనుల కోసం యూరప్ నుండి జనం భారతదేశానికి తరలి వచ్చారు. తర్వాత ఇండియాలో ఇక్కడి యువతులనే వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడ్డాడు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 331 ప్రకారం..
భారతదేశంలోని  ఆంగ్లో-ఇండియన్ల సంఘం ప్రతినిధులను దేశంలోని పార్లమెంటు, రాష్ట్రాలలోని అసెంబ్లీలకు నామినేట్‌ చేసేవారు.ఈ సంఘానికి సొంత నియోజకవర్గం అంటూ లేదు. ఈ హక్కును తొలిసారిగా ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నుంచి ఫ్రాంక్ ఆంథోనీ అందుకున్నారు. లోక్‌సభలో మొత్తం 545 స్థానాలు ఉన్నాయి. వీటికి 543 మంది ఎంపీలు ఎన్నికవుతారు. ఈ ఎంపీలలో ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీకి చెందినవారు ఎవరూ లేకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 331 ప్రకారం, రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్‌ సంఘానికి చెందిన ఇద్దరు ప్రతినిధులను లోక్‌సభకు నామినేట్ చేసేవారు.
రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం సభకు నామినేట్ అయిన ఆంగ్లో-ఇండియన్ 6 నెలల్లోపు ఏదైనా పార్టీ సభ్యత్వం తీసుకోవచ్చు. సభ్యత్వం తీసుకున్న తర్వాత వారు ఆ పార్టీ విప్‌కు కట్టుబడి ఉండాలి. దీనితో పాటు పార్టీ నియమనిబంధనల ప్రకానం నడుచుకోవాల్సి ఉంటుంది. 
ఇది కూడా చదవండి: సిక్కుల తలపాగా రహస్యం ఏమిటి? ఎందుకు ధరిస్తారు?

రాష్ట్రాలలో ఏ ఆంగ్లో ఇండియన్‌లు అసెంబ్లీ ఎన్నికలలో గెలవని పక్షంలో గవర్నర్‌ ఆంగ్లో-ఇండియన్‌ను ఎన్నుకుని అసెంబ్లీకి పంపే హక్కు కలిగి ఉంటారు. ఇలా ఎన్నికైనవారు  ప్రజల నుంచి ఎన్నుకోనివారై, రాష్ట్రపతి లేదా గవర్నర్‌ ద్వారా నామినేట్ అయితే వారికి రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసే హక్కు వారికి ఉండదు. 2012 రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసిన ఏకైక ఆంగ్లో-ఇండియన్ డెరెక్ ఓ బ్రియన్. ఈయన తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా ఎంపికయ్యారు. 

ఆదరణ పొందిన కీలర్ సోదరులు
పలువురు ఆంగ్లో-ఇండియన్లు మనదేశంలో ఆదరణ పొందారు. వారిలో కీలర్ సోదరులు ప్రముఖంగా కనిపిస్తారు. వీరిద్దరూ లక్నోలో పుట్టారు. ఎయిర్ ఫీల్డ్ మార్షల్ డెంజిల్ కీలర్, వింగ్ కమాండర్ ట్రెవర్ కీలర్ భారత వైమానిక దళంలో పని చేశారు. వీరు ప్రదర్శించిన ధైర్యసాహసాల కారణంగా 1965 ఇండో-పాక్ యుద్ధంలో వీరిద్దరికీ వీర చక్ర అవార్డు లభించింది. లక్నోలో చదువుకున్న ఫ్లైట్ లెఫ్టినెంట్ ఆల్ఫ్రెడ్ కుక్ కూడా 1965 ఇండో-పాక్ యుద్ధంలో వీర చక్ర అవార్డును అందుకున్నారు. పీటర్ ఫాంథమ్ పలుమార్లు ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యునిగా ఉన్నారు. 

మోడీ ప్రభుత్వ నిర్ణయంతో..
మోడీ ప్రభుత్వం తన రెండవ టర్మ్ సమయంలో, ఆంగ్లో ఇండియన్ల ఎంపిక విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంది. 2019 సంవత్సరంలో పార్లమెంటులో ఆంగ్లో-ఇండియన్ల ప్రాతినిధ్యాన్ని రద్దు చేసింది. ప్రతి పదేళ్ల తర్వాత పార్లమెంటులో రిజర్వేషన్లకు సంబంధించి సమీక్ష జరుగుతుంది. ఈ సమీక్షలో ఈ రెండు రిజర్వ్డ్ సీట్లలో రిజర్వేషన్ ఉంచాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. వారి రిజర్వేషన్ వ్యవధి 2020, జనవరి 25తో ముగిసింది. రాజ్యాంగంలో 126వ సవరణ సమయంలో జరిగిన సమీక్ష సందర్భంగా ఈ రిజర్వేషన్‌ను కొనసాగించకూడదని మోదీ మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో జార్జ్ బేకర్, రిచర్డ్ హే.. ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీ నుండి పార్లమెంటుకు ఎంపికైన చివరి ఎంపీలుగా నిలిచారు. 
ఇది కూడా చదవండి: ఆమె మన దేశపు రాకుమారి.. పాక్‌ ప్రభుత్వంలో పనిచేస్తూ..

మరిన్ని వార్తలు