ఆ అవసరం లేదు

29 Jul, 2014 00:47 IST|Sakshi
ఆ అవసరం లేదు

తమ ఎదుగుదలను ఓర్వలేక గౌరవానికి భంగం కలిగించే చర్యల్లో భాగంగా తనపై చెక్కుమోసం కేసు పాల్పడ్డారని దర్శకుడు విక్రమన్ భార్య జయప్రియ ఆరోపణలు గుప్పించారు. వివరాల్లో కెళితే... కోయంబత్తూరు రామ్‌నగర్ సెంగుపా వీధికి చెందిన ప్రదోష్ (33) అనే ఫైనాన్షియర్ రెండు వారాల క్రితం కోయంబత్తూరు నగర పోలీసు కమిషనర్ విశ్వనాథన్‌కు ఒక ఫిర్యాదు చేశారు.

అందులో నీలగిరి జిల్లా కొత్తగిరికి చెందిన విన్సెంట్ టి.బాలు, చెన్నై నుంగంబాక్కంకు చెందిన సినీ దర్శకుడు విక్రమన్ భార్య జయప్రియ తనకు చెక్కు మోసంతో 14 లక్షల వరకు ఏ మార్చినట్లు ఫిర్యాదు చేశారు. దీంతో వీరిపై కోయంబత్తూరు పోలీసులు కేసు నమోదు చేసివిచారణ జరుపుతున్నారు.
 
ఈ క్రమంలో ఆదివారం కోయంబత్తూరులో రోటరీ క్లబ్ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు విక్రమన్ భార్య జయప్రియ విలేకరులతో మాట్లాడుతూ తన భర్త  ప్రస్తుతం  తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. తాను కూచిపూడి నృత్యకళాకారిణిగా నృత్య ప్రదర్శనలను నిర్వహిస్తున్నానని చెప్పారు.
 
చిత్ర రంగంలో తన భర్తపై వ్యతిరేకత ఉన్న కొందరు తమపేరు, ప్రతిష్టలకు భంగం కలిగించడానికి చెక్కుమోసం కేసు పెట్టించారని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన వ్యక్తికి తనకూ ఎలాంటి సంబంధం లేదన్నారు.  తమకు ఎలాంటి ఆర్థిక సమస్య లూ లేవని, ఎవరినో మోసం చేయాల్సిన అవసరం తమకు లేదని జయప్రియ పేర్కొన్నారు.