గయ్యాళి అత్త.. మనసు మాత్రం వెన్న

28 Oct, 2015 11:31 IST|Sakshi
గయ్యాళి అత్త.. మనసు మాత్రం వెన్న

దురుసు నోటి పలుకుబడికి పంతులమ్మ మీరు...
బాక్సాఫీస్సూత్రాళికి పలుపు తాడు మీరే...
మీరు లేని బయోస్కోపు ఉప్పులేని చారు....
మీరు వచ్చి నిలిస్తేను సీనిక వవ్వారే...


ఇవి  ఓ నటి గురించి బాపు రమణలు చెప్పిన మాటలు.. ఆమే వెండితెరను ఏలిన అసామాన్య నటి సూర్యకాంతం. నిజమే.. ఆమె వెండితెర మీద ప్రసరించిన సూర్యకాంతి. అందుకే ఇప్పటికీ ఆ వెలుగును గుర్తుచేసుకొని తెలుగు సినిమా పరవశిస్తోంది. ఆమె లేకుండా కొన్ని ఆణిముత్యాలను ఊహించుకోలేం. సంసారం, రక్తసంబంధం, కులగోత్రాలు, కలిసు ఉంటే కలదు సుఖం, గుండమ్మ కథ, దసరా బుల్లోడు, మంచి మనసులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలు. స్టార్ హీరోల ఇమేజ్ను దాటి ఇది సూర్యకాంతం సినిమా అనే స్థాయి గుర్తింపు తెచ్చుకుంది ఆమె.

నవ్వించగలదు, ఏడిపించగలదు, బెదిరించగలదు, భయపెట్టగలదు... అందుకే  ఆమె మనల్ని వదిలి వెళ్లాక ఆ పాత్రలు సృష్టించడమే మానేశారు దర్శక నిర్మాతలు. 1949 నుంచి 1994 వరకు తెలుగు సినిమాను ఏలిన అద్భుతనటి సూర్యాకాంతం.. గయ్యాళి అత్త పాత్ర చేయాలి అంటే సూర్యకాంతమే చేయాలి అని కాదు... గయ్యాళి పాత్ర ఎవరు చేసినా సూర్యకాంతంలానే చేయాలి అనే స్థాయికి గుర్తింపు తెచ్చుకున్న మహానటి ఆమె.

సూర్యకాంతం, ఎంతో పురాణ వైశిష్ట్యం కూడా ఉన్న పేరు. అయినా దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఒక్క తెలుగు ఇంట్లో కూడా ఆ పేరు మళ్లీ పెట్టుకునే సాహసం ఎవరూ చేయలేదు. దీనంతటికి కారణం ఓ నటి... గయ్యాళి పాత్రలో ఆమె చూపించిన సహజత్వం ప్రేక్షకుల్లో ఆ స్థాయిలో చెరగని ముద్ర వేసింది.  లెక్కకు మించి ఎన్నో చిత్రాల్లో  ఒకే పాత్రలో నటించినా,  ప్రేక్షకులకు విసుగు కలగలేదంటే అది కేవలం ఆమె నటనా పటిమే. ముఖ్యంగా ఈర్ష్య, ద్వేష కలగలసిన గయ్యాళి పాత్రలలో ఆమె నటన అసామాన్యం.

సూర్యకాంతం గురించి మాట్లాడుకుంటూ గుండమ్మకథ సినిమా గురించి మాట్లాడుకోకపోతే అసంపూర్ణంగానే ఉంటుంది... తెలుగు సినిమా చరిత్రలో చెప్పుకోదగ్గ అతి కొద్ది సినిమాల్లో గుండమ్మకథ ఒకటి... ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ లాంటి ఎంతో మంది హేమాహేమీలు ఈ సినిమలో నటించినా.. టైటిల్‌ మాత్రం సూర్యకాంతం పోషించిన పాత్ర పేరును పెట్టారంటేనే తెలుస్తుంది ఆమెకున్న ఇంపార్టెన్స్‌ ఏంటో...

తెరమీద ఎక్కువగా గయ్యాళిపాత్రలు మాత్రమే చేసిన సూర్యకాంతం, సెట్లో మాత్రం ఎంతో కలివిడిగా ఉండేవారు. ముఖ్యంగా సూర్యకాంతం షూటింగ్ కు వస్తున్నారంటే ఆ రోజు సెట్ లో అందరూ వింధుభోజనం తినొచ్చని తెగ సంబరపడిపోయేవారట. షూటింగ్ సమయంలో ప్రతి ఒక్కరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించే ఆమె కెమెరా ముందు మాత్రం తెగ భయపెట్టేసేవారు. ఎన్నో అజరామర పాత్రలతో మనల్ని అలరించిన ఆమె స్ధాయి నటి, కనీసం ఆమె లేనిలోటు తీర్చగలిగే నటి కూడా తెలుగుతెర మీద ఇంతవరకు తారసపడలేదు. ఈ రోజు ఆ మహానటి జయంతి సందర్భంగా మరొక్కసారి ఆ గయ్యాళి గుండమ్మ సూర్యకాంతం గారికి ఘనంగా నివాళి అర్పిద్దాం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా