‘యు ట‌ర్న్‌’ మూవీ రివ్యూ

13 Sep, 2018 15:21 IST|Sakshi
Rating:  

టైటిల్ : యు ట‌ర్న్‌
జానర్ : సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌
తారాగణం : స‌మంత‌, ఆది పినిశెట్టి, భూమిక‌, రాహుల్ రవీంద్రన్‌, న‌రేన్‌
సంగీతం : పూర్ణచంద్ర తేజ‌స్వీ
దర్శకత్వం : ప‌వ‌న్ కుమార్‌
నిర్మాత : శ్రీనివాసా చిట్టూరి, రాంబాబు బండారు

పెళ్లి త‌రువాత సినిమాల ఎంపిక‌లో స‌మంత చాలా సెలెక్టివ్ గా ఉన్నారు. ఎక్కువ‌గా న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వ‌స్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది రంగ‌స్థలం, అభిమ‌న్యుడు లాంటి సూప‌ర్ హిట్స్‌ అందుకున్న సామ్ మ‌రో సూప‌ర్ హిట్ మీద కన్నేశారు. అందుకే క‌న్నడ‌లో ఘ‌న‌విజ‌యం సాధించిన యు ట‌ర్న్ సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెర‌కెక్కిన యు ట‌ర్న్ కు ఒరిజ‌న‌ల్ వ‌ర్షన్‌కు ద‌ర్శక‌త్వం వ‌హించిన ప‌వ‌న్ కుమారే ద‌ర్శక‌త్వం వ‌హించాడు. సూప‌ర్ నేచుర‌ల్‌ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన యు టర్న్‌తో స‌మంత ఆశించిన విజ‌యం సాధించారా..? లేడీ ఓరియంటెడ్ సినిమాతో ఆక‌ట్టుకున్నారా.? కన్నడ ప్రేక్షకులను అలరించిన యు టర్న్‌ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా..?

క‌థ :
రచన(స‌మంత) ఓ మీడియా సంస్థలో ఇంటర్న్‌షిప్ చేస్తుంటుంది.అదే సంస్థలో ఉద్యోగం కోసం ఓ హ్యూమన్‌ ఇంట్రస్ట్‌ స్టోరి చేసేందుకు ప్లాన్ చేస్తుంది. అందులో భాగంలో ఆర్కేపురం ఫ్లైఓవ‌ర్‌పై రోడ్ బ్లాక్స్ ను త‌ప్పించి యు ట‌ర్న్ తీసుకునే వారిని మీద స్టోరి చేయాలన్న ఆలోచనతో, యుటర్న్‌ తీసుకున్న వ్యక్తుల వెహికిల్‌ నంబర్స్‌ ద్వారా వారి అడ్రస్‌లు, ఫోన్‌ నంబర్లు తెలుసుకుంటుంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా సుందర్‌ అనే వ్యక్తిని కలిసేందుకు ప్రయత్నించినా వీలుపడదు. కానీ అదే రోజు సుందర్ ఆత్మహత్య చేసుకొని చనిపోవటంతో రచనను ఇన్వెస్టిగేషన్‌ కోసం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళతారు. విచార‌ణ‌లో భాగంగా రచన డైరీని ప‌రిశీలించిన పోలీసుల‌కు షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఆ డైరీలో ఉన్న వ్యక్తులందరూ సుందర్‌ లాగే గతంలో ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. అసలు ఆ డైరీలో ఉన్న వ్యక్తులు ఎవరు..? ఎలా చనిపోయారు.? వారి మరణానికి రచనకు సంబంధం ఏంటి.? ఈ సమస్యల నుంచి రచన ఎలా బయటపడింది..?  అన్నదే మిగతా క‌థ‌.

న‌టీన‌టులు ;
ఇన్నాళ్లు క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న స‌మంత ప్రస్తుతం న‌టిగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. అందుకే న‌ట‌నకు ఆస్కారం ఉన్న పాత్రల‌ను మాత్రమే ఎంచుకుంటున్నారు. యు ట‌ర్న్ సినిమాను ఏరికోరి సెలెక్ట్ చేసుకున్నారు. తన పర్ఫామెన్స్‌ తో సినిమా స్థాయిని పెంచారు సమంత. ప్రేమ, భ‌యం, సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోష‌న్స్‌ను అద్భుతంగా పండించారు. డబ్బింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. రచనకు సాయంచేసే పోలీస్ పాత్రలో ఆది పినిశెట్టి సరిగ్గా సరిపోయాడు. పెద్దగా వేరియేష‌న్స్ చూపించే అవ‌కాశం లేక‌పోయినా.. ఉన్నంత‌లో త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. భూమిక తెర మీద క‌నిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతో మంచి ఎమోష‌న్స్ పండించారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో భూమిక న‌ట‌న కంట‌త‌డిపెట్టిస్తుంది. స‌మంత ఫ్రెండ్ పాత్రలో క్రైమ్ రిపోర్టర్ గా రాహుల్ ర‌వీంద్రన్‌ త‌న పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇత‌ర పాత్రలో న‌రేన్, ర‌వి ప్రకాష్‌లు త‌మ ప‌రిధి మేర‌కు ఆక‌ట్టుకున్నారు.

విశ్లేష‌ణ :
థ్రిల్లర్ జానర్‌లో తెర‌కెక్కే సినిమాల‌ను ఓ సెక్షన్ ఆడియ‌న్స్ ఎప్పుడు ఆద‌రిస్తారు. అందుకే టాప్ స్టార్లు కూడా అప్పుడప్పుడు థ్రిల్లర్ సినిమాల వైపు చూస్తుంటారు. స‌మంత కూడా న‌టిగా తన స్థాయిని మెరుగుపరుచుకునేందుకు  క‌న్నడ సూప‌ర్ హిట్‌ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. ఒరిజిన‌ల్ వ‌ర్షన్‌కు దర్శక‌త్వం వ‌హించిన ప‌వ‌న్ కుమార్ తెలుగు వ‌ర్షన్ ను కూడా డైరెక్ట్ చేశారు. తొలి పది నిమిషాలు కాస్త నెమ్మదిగా మొదలు పెట్టినా.. ఒక్కసారి అసలు కథ మొదలయ్యాక ఆడియన్స్‌ను కట్టిపడేశాడు దర్శకుడు. ఎక్కడ అనవసరమైన కామెడీ, సాంగ్స్‌ లాంటివి ఇరికించకుండా పర్ఫెక్ట్ థ్రిల్లర్‌లా సినిమాను నడిపించాడు. పూర్ణ చంద్ర తేజస్వీ సంగీతం సీన్స్‌ను మరింత ఎలివేట్ చేసింది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమా స్థాయిని పెంచింది. అయితే సెకండ్‌హాఫ్‌లో కొన్ని ట్వీస్ట్ లు ఆడియన్స్‌ ముందే అంచనా వేయగలిగేలా ఉన్నాయి. థ్రిల్లర్ సినిమాకు ఇది డ్రాబ‍్యాక్‌ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్ :
సమంత నటన
నేపథ్య సంగీతం

మైన‌స్ పాయింట్స్ :
తొలి పది నిమిషాల
అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు లేకపోవటం

సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

Rating:  
(3.75/5)
Poll
Loading...
మరిన్ని వార్తలు