నేను రాజకీయాల్లోకి రావడం పక్కా : నటి

9 Mar, 2018 19:10 IST|Sakshi

తమిళసినిమా: నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా రాజకీయాల్లోకి రావడం అన్నది పక్కా అంటున్నారు.  కల్సా డాన్స్‌ కళాకారిణి అయిన ఈమె నటిగా రంగప్రవేశం చేసినప్పుడు క్లిక్‌ అవుతారో? లేదో అన్న సందేహం చాలామందికి కలిగింది. ఎందుకుంటే తొలి చిత్రం నిరాశపరచింది. మలి చిత్ర విడుదల నిలిచిపోయింది. ఆ తరువాత కూడా అవకాశాలు రాని పరిస్థితి. అలాంటి నటి ఇప్పుడు 9 చిత్రాలతో తీరిక లేనంత బిజీగా ఉన్నారు. లక్‌ అంటే ఈమెదే అనాలి. నటుడు విశాల్‌తో ప్రేమ, ఆ తరువాత మనస్పర్థలు లాంటి వదంతులు కూడా వరలక్ష్మిని పాపులర్‌ చేశాయని చెప్పొచ్చు. ఒక పక్క నటిగా బిజీగా ఉన్నా మరో పక్క మహిళల కోసం ‘సేవ్‌శక్తి’  అనే సంస్థను నెలకొల్సి దాని ద్వారా పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ప్రపంచ మహిళాదినోత్సవం సందర్భంగా ఉత్తర చెన్నై ప్రాంతంలో సేవ్‌శక్తి తరపున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరలక్ష్మీ ఇచ్చిన భేటీ..

ప్ర: అనూహ్యంగా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాజకీయ రంగప్రవేశం చేసే ఆలోచన ఏమైనా ఉందా?
జ: రాజకీయం అనేది కాని పదమా? ఎవరినో ఓడించాలన్న ఆలోచనతో రాజకీయాల్లోకి రాకూడదు గానీ, నటీనటులే కాదు, సమాజానికి మంచి చేయాలనుకునే వారెవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. సినిమా ద్వారా పేరు, ప్రఖ్యాతులనే బలాన్ని మంచి విషయాలకు ఉపయోగించడంలో తప్పులేదు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో నేను కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను. అన్నింటినీ ఒకే సారి మార్చలేం.

ప్ర: రాజకీయాల్లో మీ లక్ష్యం?
జ: మహిళలకు అన్ని విధాలుగా మంచి చేయాలన్నదే నా లక్ష్యం

ప్ర: రజనీకాంత్, కమలహాసన్‌ల రాజకీయరంగ ప్రవేశం గురించి?
జ: నేను ముందే చెప్పాను. ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. ఇంకా చెప్పాలంటే ఊరులోని వారందరు రావాలంటాను.

ప్ర: నటుడు విశాల్‌ రాజకీయరంగ ప్రవేశం గురించి?
జ: ఆయన రాజకీయరంగం గురించి చెప్పడానికేమీలేదు.

ప్ర: మీరు ఉత్తర చెన్నైలో సేవా కార్యక్రమాలను ప్రారంభించడానికి కారణం?
జ: కారణం ఇతర ప్రాంతాల కంటే అక్కడ సమస్యలు అధికం కావడమే. ఆ ప్రాంతంలో నాకు చేతనైనంత సాయం చేయాలనే అక్కడ సేవా కార్యక్రమాలు ప్రారంభించాను.

ప్ర: పాఠశాల విద్య విధానంలో ఎలాంటి మార్చులు రావాలంటారు?
జ: పాఠశాల విద్యతో పాటు ఆత్మరక్షణ విద్య, సెక్స్‌ గురించి అవగాహన పాఠాలు అవసరం. 

మరిన్ని వార్తలు