నోటా.. తూటా..! అభ్యర్థులు నచ్చకపోతే దీనికే ఓటా..!?

19 Nov, 2023 09:54 IST|Sakshi

గెలుపోటములను శాసించే ఆయుధం!

ఫలితాలను తారుమారు చేసే అవకాశం..

సాక్షి, రంగారెడ్డి/వికారాబాద్‌: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కలి్పస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఓటర్లకు అవకాశం కలి్పంచింది. ఇందులో భాగంగా ఈవీఎం (ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్స్‌)లో బరిలో ఉన్న అభ్యర్థుల గుర్తుతో పాటు నోటా ఆప్షన్‌ను ఏర్పాటు చేసింది. పోటీలో ఉన్న అభ్యర్థులకు ఓటు వేయడం లేదు అనే ఆప్షన్‌ను ఈవీఎంలలో అభ్యర్థుల గుర్తుతో పాటు నోట అనే బటన్‌ను పొందుపర్చారు. ఆ బటన్‌ నొక్కితే ఓటు ఏ పారీ్టకి పడదు. కానీ ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లే లెక్క.

గెలుపోటములపై ప్రభావం!
నోటాకు పడే ఓట్లు తూటా కంటే బలమైనవిగా మారాయా..? అభ్యర్థుల ఫలితాలను ప్రభావితం చేస్తున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. గతంలో పలు నియోజకవర్గాల్లో వెల్లడించిన ఫలితాల్లో నోటాకు పడే ఓట్లు గెలుపోటములను శాసించే శక్తిగా మారాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారిపై కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి కేవలం 78 ఓట్లతో గెలుపొందారు. నోటాకు 1,139 ఓట్లు పోలయ్యాయి. నోటాకు బదులు అభ్యర్థులకు ఈ ఓట్లు పోలై ఉంటే గెలుపోటముల ఫలితం మరోలా ఉండేది.

2018 ఎన్నికల్లో నోటాకు పోలైన ఓట్లు..
► పరిగిలో మొత్తం 2,29,436 ఓట్లకు గాను 1,75,371 ఓట్లు అభ్యర్థులకు.. నోటాకు 1,381 పడ్డాయి. ఇక్కడ 13 మంది అభ్యర్థులు పోటీ చేయగా ఆరుగురికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.  
► తాండూరు నియోజకవర్గంలో 2,01,917 ఓట్లు ఉండగా అభ్యర్థులకు 1,56,436 ఓట్లు, నోటాకు 787 పోలయ్యాయి. 13 మంది పోటీ చేయగా ఏడుగురు అభ్యర్థులకు నోటాకు పడిన ఓట్ల కంటే తక్కువ పోలయ్యాయి.  
► కొడంగల్‌ నియోజకవర్గంలో మొత్తం 2,01,941 ఓట్లకు గాను అభ్యర్థులకు 1,65,559, నోటాకు 1,472 పోలయ్యాయి. 15మంది అభ్యర్థులు పోటీ చేయగా పది మందికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.  
► వికారాబాద్‌ నియోజకవర్గంలో మొత్తం 2,07,222 ఓట్లు ఉండగా 1,53,722 ఓట్లు అభ్యర్థులకు, నోటాకు 1,531 పోలయ్యాయి. 13 మంది అభ్యర్థులు పోటీ చేయగా లేడుగురికి నోటాకు పోలైన ఓట్ల కంటే తక్కువ వచ్చాయి. 
► చేవేళ్ల నియోజకవర్గంలో 2,24,230 ఓట్లకు గాను 1,77,197 ఓట్లు అభ్యర్థులకు, నోటాకు 1,469 పోలయ్యాయి. నియోజకవర్గం నుంచి పది మంది పోటీ చేయగా ఐదుగురు అభ్యర్థులకు నోటా కంటే తక్కువ పోలయ్యాయి.

మరిన్ని వార్తలు