ప్రమాదం జరిగి, కాలికి దెబ్బ తగిలింది..నన్ను రీప్లేస్‌ చేస్తారేమో అనుకున్నా: రాహుల్‌ విజయ్‌

19 Nov, 2023 03:46 IST|Sakshi

రాహుల్‌ విజయ్, శివానీ రాజశేఖర్, శ్రీకాంత్‌ ప్రధాన పాత్రధారులుగా, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’  వాసు, విద్యా కొప్పినీడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో రాహుల్‌ విజయ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో కానిస్టేబుల్‌ రవి పాత్రలో నటించాను. ఎస్‌ఐ రామకృష్ణగా శ్రీకాంత్‌గారు, కానిస్టేబుల్‌ కుమారిగా శివానీ రాజశేఖర్‌ నటించారు.

శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కోట బొమ్మాళి అనే ఊర్లోని పోలీస్‌స్టేషన్‌లో ఏం జరిగింది? అన్నది ఈ సినిమా కాన్సెప్ట్‌. మలయాళ చిత్రం ‘నాయట్టు’కు ‘కోట బొమ్మాళి పీఎస్‌’ రీమేక్‌. అయితే నా పాత్రపై ఏ ప్రభావం ఉండకూడదని ‘నాయట్టు’ పూర్తి చిత్రం నేను చూడలేదు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా స్క్రీన్‌ప్లే రేసీగా ఉంటుంది. చివరి 20 నిమిషాలు చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఇక ఈ సినిమాలోని ‘లింగిడి..’ పాటకు మంచి క్రేజ్‌ వచ్చింది. ఈ పాటతోనే మరింత మందికి మేం చేరువ అయ్యాం. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో మా నాన్నగారు (ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌) అసిస్టెంట్‌ ఫైట్‌ మాస్టర్‌గా, ఫైట్‌ మాస్టర్‌గా చేశారు.

అదే బ్యానర్‌లో నేను హీరోగా చేయడం పట్ల ఆయన హ్యాపీగా ఉన్నారు. అలాగే ఈ సినిమా సమయంలో నాకు ప్రమాదం జరిగి, కాలికి దెబ్బ తగిలింది. దీంతో నాలుగు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలో నన్ను రీప్లేస్‌ చేస్తారేమో? అనుకున్నాను. కానీ ‘బన్నీ’ వాసు, విద్యాగార్లు నన్ను సపోర్ట్‌ చేశారు. ఇలాంటి సంస్థలో వర్క్‌ చేయడం నాకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఆర్కా మీడియాలో ఓ షో కమిట్‌ అయ్యాను’’ అని చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు