టైటిల్‌ ఒక్కటే... కథలు రెండు!

1 Aug, 2017 23:34 IST|Sakshi
టైటిల్‌ ఒక్కటే... కథలు రెండు!

...ఆ రెండిటిలోనూ హీరో ఒక్కరే కావడం విశేషమిక్కడ! మలయాళ హీరో మోహన్‌లాల్‌ ‘విలన్‌’ టైటిల్‌తో మాతృభాషలో ఓ సినిమా చేస్తున్నారు. అందులో మన తెలుగు నటుడు శ్రీకాంత్, హీరో విశాల్, హీరోయిన్లు రాశీ ఖన్నా, హన్సిక ముఖ్య తారలు. సేమ్‌ టైటిల్‌కు ముందు ‘ది’ తగిలించి.. ‘ది విలన్‌’ టైటిల్‌తో కన్నడలో ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో శివ రాజ్‌కుమార్, ‘ఈగ’ ఫేమ్‌ సుదీప్‌ హీరోలు. అమీ జాక్సన్‌ హీరోయిన్‌.

ఇప్పుడీ కన్నడ విలన్‌ను తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తీయాలనుకుంటున్నారు నిర్మాత సీఆర్‌ మనోహర్‌. తెలుగులో ‘మహాత్మ, రోగ్‌’ సినిమాలను నిర్మించిందీయనే. తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుదీప్, అమీలు సుపరిచితులే. శివ రాజ్‌కుమార్‌ గురించి తక్కువమందికి తెలుసు. సో, ఆ పాత్రలో మిగతా భాషల ప్రేక్షకులకు పరిచయమున్న నటుడయితే బాగుంటుందని మోహన్‌లాల్‌ను సంప్రదించారు.

కన్నడ వెర్షన్‌లో శివ రాజ్‌కుమార్‌ చేస్తున్న పాత్రను తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్స్‌లో మోహన్‌లాల్‌ చేస్తారన్న మాట. ప్రస్తుతం హీరో, దర్శక–నిర్మాతల మధ్య డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. ‘ది విలన్‌’కు మోహన్‌లాల్‌ ఆల్మోస్ట్‌ సైన్‌ చేసినట్టే! ఇంకో విశేషం ఏంటంటే... ఇందులోనూ శ్రీకాంత్‌ కీలక పాత్ర చేస్తున్నారు. ఆయన కూడా సేమ్‌ టైటిల్‌తో రూపొందుతోన్న రెండు సినిమాల్లో చేయబోతున్నారన్న మాట!