నిర్మాత లేకపోతే ఏమీ లేదు

30 Jan, 2020 00:15 IST|Sakshi
కేయస్‌ రామారావు

‘‘సుమారు 51 ఏళ్లుగా మూడు తరాల వాళ్లతో సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాను. వాళ్లు ఎలా ఆలోచిస్తున్నారు? అని తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్లతో పోటీపడి పని చేయడానికి ప్రయత్నిస్తుంటాను’’ అన్నారు ప్రముఖ నిర్మాత కేయస్‌ రామారావు. ఆయన నిర్మించిన చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. విజయ్‌ దేవరకొండ, రాశీ ఖన్నా, కేథరీన్, ఐశ్వర్యా రాజేశ్, ఇజబెల్లా హీరో హీరోయిన్లుగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఫిబ్రవరి 14న ఈ సినిమా రిలీజ్‌ కానున్న సందర్భంగా కేయస్‌ రామారావు చెప్పిన విశేషాలు.

► ‘పెళ్లి చూపులు’ సినిమా చూసినప్పుడు నాకు విజయ్‌ దేవరకొండ ఒక రవితేజ, ఉపేంద్రలా అనిపించాడు. అప్పుడే అతనితో సినిమా చేయాలనుకున్నాను. అతని స్టయిల్లోనే ఉండే ప్రేమకథా చిత్రమిది.

► క్రాంతి మాధవ్‌తో ఇదివరకు ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ సినిమా నిర్మించాను. తను చాలా భిన్నంగా ఆలోచిస్తాడు. ప్రేక్షకులకు కొత్త అనుభవం ఇవ్వాలనుకునే దర్శకుడు. ఈ సినిమా కథానుసారమే నలుగురు హీరోయిన్స్‌ని తీసుకున్నాం. రాశీ ఖన్నా పాత్ర బోల్డ్‌గా, ఐశ్వర్యారాజేశ్‌ పాత్ర న్యాచురల్‌గా ఉంటాయి. కేథరీన్‌ సపోర్టింగ్‌ రోల్‌లో కనిపిస్తుంది. ఇజబెల్లాది కూడా మంచి పాత్రే.

► ఈ సినిమాను 2018 అక్టోబర్‌లో ప్రారంభించాం. అనుకున్నదానికంటే కొంచెం ఎక్కువే ఆలస్యం అయింది. అయినా కరెక్ట్‌ సమయానికే వస్తున్నాం. ప్రేమ అనే ఫీలింగ్‌ను ఆస్వాదించేవారందరికీ ఈ సినిమా నచ్చుతుంది.

► ప్రస్తుతం అమేజాన్‌ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌ అంటూ ప్రేక్షకుడి చేతిలోకి వినోదం వచ్చేసింది. అందులో బోల్డ్‌ కంటెంట్‌ వస్తోంది. అయినా బిగ్‌ స్క్రీన్‌ మీద సినిమా ఆనందించాలనే ఆడియన్స్‌ సంఖ్య ఎక్కువగానే ఉంది. వాళ్లు బోల్డ్‌ కంటెంట్‌ను బిగ్‌ స్క్రీన్‌ మీద చూడడానికి హర్షించరు. అందాన్ని సభ్యతతో చూపించేదే సినిమా.

► సినిమాల ఖర్చులు పెరిగాయి. దాంతో ఎక్కువ థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. దీని వల్ల వేరే సినిమాకు థియేటర్స్‌ కొరత ఏర్పడుతోంది. ఆ సినిమా నిలదొక్కుకొని టాక్‌ తెచ్చుకునేసరికి మరో పెద్ద సినిమా వస్తుంది. ఈ పరిస్థితిని నివారించడానికి ఓ ప్రణాళికను తీసుకురావాలి. కంటెంట్‌ను తయారుచేసే నిర్మాత కన్నా కంటెంట్‌ను ప్రేక్షకుల్లో తీసుకెళ్లే వాళ్లే ఎక్కువ డబ్బు చేసుకుంటున్నారు. నిర్మాత లేకపోతే ఏమీలేదు.

► సినిమాను పంపిణీ చేసే విధానంలో మార్పులు వచ్చాయి. మెల్లిగా మోనోపోలీ వ్యవస్థకు వెళ్లిపోయేలా ఉంది. థియేటర్స్‌ అన్నీ కొందరి దగ్గరే ఉండటం వల్ల కొందరి నిర్మాతలకు మంచి జరుగుతుంది.. ఇంకొందరికి మంచి జరగదు. థియేటర్స్‌ ఉన్నవాళ్లు వాళ్ల సినిమా ఉంటే థియేటర్స్‌ అన్నీ వాళ్ల సినిమాకే ఉంచుకుంటున్నారు. దీని వల్ల ప్రాబ్లమ్స్‌ పెరుగుతాయి.

>
మరిన్ని వార్తలు