ట్రోల్స్‌పై స్పందించిన యామీ గౌతమ్‌

2 Mar, 2020 13:30 IST|Sakshi

ఫెయిర్‌ అండ్‌ లవ్లీ యాడ్‌తో అందరింట్లోనూ తిష్టవేసింది యామీ గౌతమ్‌మొదట సీరియల్‌ నటిగా తర్వాత మోడల్‌గా, అనంతరం హీరోయిన్‌గా కెరీర్‌లో దూసుకుపోతున్న యామీ తాజాగా అస్సాం పర్యటనకు వెళ్లింది. ఆదివారం ‘గ్రేట్‌ గువహటి మారథాన్‌- 2020’ను ప్రారంభించేందుకు అస్సాంలోని స్థానిక విమానాశ్రయానికి చేరుకుంది. దీంతో అనేకమంది అభిమానులు ఆమెకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆమెకు అత్యంత దగ్గరగా సమీపించాడు. యామీ అనుమతి తీసుకోకుండానే ఆమెకు అస్సాం సంప్రదాయ గమోసాను తొడగాలని చూశాడు. దీంతో వెంటనే ఆమె అతన్ని చేతిని దూరంగా నెట్టేసింది.

అందులో తప్పేముంది
ఆమె వెంట ఉన్నవాళ్లు కూడా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపొమ్మన్నారు. ఈ ఘటనపై యామీని టార్గెట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు విపరీతంగా ట్రోల్‌ చేశారు. ‘అస్సామీల సంప్రదాయాన్ని నువ్వు ఘోరంగా అవమానించావు’ అంటూ ఆమెపై తిట్ల దండకం ఎత్తుకున్నారు. దీనిపై స్పందించిన యామినీ.. ఆత్మరక్షణ కోసమే అలా చేశానని పేర్కొంది. ఒక మహిళగా ఎవరైనా తనకు సన్నిహితంగా రావాలని చూస్తే అసౌకర్యంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. తానే కాదు, ఏ మహిళ ఇలా చేసినా అది తప్పు కానే కాదని పేర్కొంది. అంతేతప్ప కావాలని పనిగట్టుకుని మరీ ఎవరి మనోభావాలను కించపర్చాలనుకోలేదని ట్విటర్‌ వేదికగా సమాధానమిచ్చింది. (మీ మీద ట్రోలింగ్‌ జరుగుతోంది: జర్నలిస్ట్‌ ఫోన్‌)

ఫొటో షేర్‌ చేసిన యామీ
మరో ట్వీట్‌లో ‘నేను అస్సాంకు రావడం ఇది మూడోసారి. అస్సామీలన్నా, వారి సంప్రదాయాలన్నా నాకు ఎంతో ఇష్టం. ఓ ముఖ్యమైన కార్యక్రమం కోసం నేనీ అందమైన రాష్ట్రానికి విచ్చేశాను. కానీ ఓ కట్టుకథ అల్లి నాపై ద్వేషం పెంచాలని చూస్తున్నారు’ అని మండిపడింది. అనంతరం అస్సామీల సంప్రదాయ గమోసా, జపి(కండువా, టోపీ) ధరించిన ఫొటోలను షేర్‌ చేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. కాగా ఆమె విమర్శలపాలవ్వడం ఇది తొలిసారేం కాదు. గతంలోనూ ఆమె స్థానికత గురించి, ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ యాడ్స్‌లో నటించడాన్ని పలువురు తప్పుపట్టగా వాటికి ధీటైన సమాధానాలిచ్చిన సంగతి తెలిసిందే. (ట్రోల్‌ చేసిన వ్యక్తికి హీరోయిన్‌ యామి గౌతం కౌంటర్‌)

మరిన్ని వార్తలు