పోరాడే శక్తినిచ్చిన ప్రయాణం ఇది

11 May, 2019 00:32 IST|Sakshi

‘‘నా కోసం ఇంత ప్రేమను, ఇన్ని ప్రార్థనలను, ఇన్ని శుభాకాంక్షలను అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌. నేను, నా కుటుంబం మీ ప్రేమకు రుణపడి ఉంటాం’’ అని ఇర్ఫాన్‌ ఖాన్‌ అన్నారు. న్యూరో ఎండోక్రైన్‌ డిజార్డర్‌తో ఇర్ఫాన్‌ బాధపడిన సంగతి తెలిసిందే. లండన్‌లో  ట్రీట్‌మెంట్‌ తీసుకుని ఇండి యా తిరిగొచ్చి, మళ్లీ సినిమాలు చేస్తున్నారాయన. తాను తిరిగి రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలంటూ ప్రేమతో ఓ లేఖ రాశారు. ‘‘క్యాన్సర్‌ నుంచి కోలుకోవడానికి గడిచిన కొన్ని నెలల ప్రయాణంలో సాగింది. ఈ ప్రయాణంలో మళ్లీ జీవితంతో తిరిగి పోరాటం చేసే శక్తిని, రియల్, రీల్‌ లైఫ్‌ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని తిరిగి తెచ్చుకున్నాను.

నా జర్నీని అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారని నాకు తెలుస్తూనే ఉంది. కానీ ఈ ప్రయాణాన్ని నేనే ఇంకా అర్థం చేసుకుంటూనే ఉన్నాను. ఈ జర్నీ తాలూకు బాధను నా పనితో నయం చేయాలనుకుంటున్నాను. నా జర్నీని మీరు గౌరవించి నేను నయం కావడానికి నాకు సమయం ఇచ్చారు. మీ ఓపికకు, ఓదార్పుకు థ్యాంక్స్‌. నా లైఫ్‌ని ఎప్పటికప్పుడు భూమి నుంచి ఆకాశం వరకూ విస్తరింపజేసుకోవాలని కోరుకునే వ్యక్తిని నేను. ఆకాశంలో కూడా విస్తరించగలనో లేదో నాకు తెలియదు కానీ ప్రయత్నమైతే చేస్తాను. చేస్తూనే ఉంటాను’’ అంటూ ‘నాకింకా తెలియదు నేను గద్దనో, తుఫానునో, ఇంకా పూర్తి కాని పాటనో’ (‘వైడనింగ్‌ సర్కిల్స్‌’ అనే కవిత నుంచి తీసుకున్న వాక్యాలు)’’ అని పేర్కొన్నారు ఇర్ఫాన్‌ఖాన్‌. 

మరిన్ని వార్తలు