యాత్ర పొలిటికల్‌ సినిమా కాదు

27 Jan, 2019 03:13 IST|Sakshi
మహి వి. రాఘవ్‌

వైఎస్‌ఆర్‌... జనరంజకమైన పాలన, సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానేత. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. వైఎస్‌ఆర్‌ పాత్రలో మలయాళ స్టార్‌ మమ్ముట్టి నటించారు. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్‌ మహి వి. రాఘవ్‌ దర్శకత్వం వహించారు. శివ మేక సమర్పణలో విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా మహి వి.రాఘవ్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.


► ‘యాత్ర’ని గతేడాది చివర్లోనే పూర్తి చేశారు కదా, సినిమా విడుదల తేదీ ఎందుకు మార్చారు?
మహి: నిజానికి గతేడాది డిసెంబర్‌ 21కి రిలీజ్‌ అనుకున్నాం. ఆ తర్వాత ఈ జనవరి 9న విడుదల అని  ఫిక్స్‌ అయ్యాం. అయితే సంక్రాంతికి ఎక్కువ సినిమాలు రిలీజ్‌ అవుతుండటం వల్ల థియేటర్ల సమస్య ఉంటుంది. ప్రాక్టికల్‌గా... థియేటర్లు దొరికి రిలీజ్‌ చేసే అంత బలం మా వద్ద లేదు. అందుకే ఫిబ్రవరి 8న రిలీజ్‌ చేస్తున్నాం. మరో కారణం ఏంటంటే ‘యన్‌.టి.ఆర్‌ : మహానాయకుడు’ కూడా ఫిబ్రవరిలోనే విడుదలవుతోంది కదా. అప్పుడే ‘యాత్ర’ రిలీజ్‌ చేస్తే అయిపోతుందిలే అనుకున్నాం. అందులో దాచిపెట్టేది ఏమీ లేదు.

► అసలు ‘యాత్ర’ ఎలా మొదలైంది?
‘యాత్ర’ చేద్దామనుకున్నప్పుడు నాకు తెలిసిన ఏ ఒక్కరు కూడా ‘ఏం పర్లేదు చెయ్‌.. మంచిది అనలేదు. పొలిటికల్‌ సినిమా ఎందుకు?’ అన్నారు. కానీ  నాకు నా కథపై నమ్మకం ఉంది. ఇప్పుడు కాకపోయినా ఓ 50 ఏళ్ల తర్వాతైనా వైఎస్‌గారి గురించి చెప్పాల్సిన కథ ఇది. నా ‘ఆనందో బ్రహ్మ’ సినిమా సక్సెస్‌ అయింది కాబట్టి ‘యాత్ర’కి రిస్క్‌ తీసుకునే చాన్స్‌ దొరికింది. ఆ సినిమా ఫ్లాప్‌ అయ్యుంటే మార్కెట్‌ని బట్టి పోవాల్సి వచ్చేది. ‘ఆనందో బ్రహ్మ’ చేస్తున్నప్పుడే ‘యాత్ర’ కథ గురించి విజయ్‌ చల్లా, శశి దేవిరెడ్డిగార్లతో చర్చించేవాణ్ని. కథ బాగా వస్తే చూద్దామన్నారు. కథ బాగా కుదరడం, పైగా నాపై ఉన్న నమ్మకంతో చేద్దామన్నారు.

► వైఎస్‌గారి బయోపిక్‌ తీయాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఈ కథకి స్ఫూర్తి ఏంటి?
నాకు వైఎస్‌గారి గురించి చాలా తక్కువ తెలియడం అడ్వాంటేజ్‌ అయింది. ఆయన పాదయాత్ర చేసినప్పుడు కానీ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ నేను ఈ దేశంలో లేను. వైఎస్‌గారి మరణానికి ఏడాది ముందు 2008లో ఇండియా వచ్చాను. 2009లో ఎలక్షన్లు రావడం.. వైఎస్‌గారు మళ్లీ అధికారం చేపట్టడం జరిగాయి. ఆయన మరణానంతరం జనాలంతా ఎక్కడ చూసినా ఆయన గురించే మాట్లాడుకుంటుండటం విన్నాను. వైఎస్‌గారి అభిమానులో, వీరాభిమానులో మాట్లాడుకుంటుంటే విని సినిమా తీయడం కష్టం అయ్యుండేది. ఆయన గురించి వేరేవాళ్లు చెబుతున్నప్పుడు కొత్తగా, బాగా అనిపించింది. అప్పుడే ఆయనపై స్టోరీ రెడీ చేద్దామనిపించింది. వైఎస్‌గారితో ప్రయాణం చేసిన వారిని కలిసి, వారి అనుభవాలు, జరిగిన సంఘటనలు తెలుసుకున్నా. ఆయనతో ఏ సంబంధం లేనివాళ్లు కూడా ‘వైఎస్‌ అది చేశారు.. ఇది చేశా’రని మాట్లాడుకుంటుండం ఆశ్చర్యమనిపించింది. వైఎస్‌గారితో ప్రయాణం చేసినవాళ్లో, కడపలోనే ఆయన గురించి మాట్లాడుతున్నారంటే అది వేరే విషయం. అరే.. ఓ ఐదారేళ్లలో ఆయన ప్రజలకి ఎంత సేవ చేసి ఇంత ఇంపాక్ట్‌ చూపించారో అనిపించింది.

► మీరు ఎప్పుడైనా వైఎస్‌గారిని కలిశారా?
నాకా భాగ్యం కలగలేదు. కానీ, ఆయనతో మాకున్న చిన్న లింక్‌ ఏంటంటే మా అమ్మది ఇడుపులపాయ దగ్గర చక్రాయపేట మండలంలోని చిలేకాంపల్లె అనే ఊరు. కానీ, వైఎస్‌గారి కథ మనం చెప్పాలని మాత్రం ఉండేది. మా అమ్మ నా సినిమాలు ఎప్పుడూ చూడలేదు. కానీ, ‘యాత్ర’ సినిమా చూస్తానన్నారు. అది కూడా నా గురించి కాదు.. వైఎస్‌గారి గురించి.  

► ఈ బయోపిక్‌ చేయాలనుకున్నప్పుడు విజయమ్మగారిని కానీ, వైఎస్‌ జగన్‌గారిని కానీ కలిశారా?
‘యాత్ర’ పోస్టర్‌ లుక్‌ రిలీజ్‌ చేసిన తర్వాత పాదయాత్రలో జగన్‌ అన్నని కలిశాను. వైఎస్‌గారిపై సినిమా చేయాలనుకుంటున్నానంటే ఓకే అన్నారు.  జగన్‌ అన్న ‘మా నాన్న చేయనివి చెప్పొద్దు. నాన్నగారు చేయనిదాని క్రెడిట్‌ మనకొద్దు’ అన్నారు. అంతేకాదు.. ‘నాన్నగారి గురించి జనాలకు మీరు ఓ కథ చెప్పాలనుకున్నారు. ఆ కథ ఏంటని నేను తెలుసుకుని, మార్పులు చేర్పులు చేయమని చెప్పడం కరెక్ట్‌ కాదు’ అన్నారు. ఆ మాట జగన్‌ అన్న చెప్పడం చాలా గ్రేట్‌. ఇప్పుడొస్తున్న బయోపిక్‌లలో ఎస్టాబ్లిష్‌ అయ్యే విషయాలనే చూపిస్తున్నారు.

► వైఎస్‌గారి బాల్యం, విద్యార్థి దశ ఈ సినిమాలో ఉంటాయా?
లేదు. ఆయన పాదయాత్ర ఘట్టం నుంచే సినిమా ఉంటుంది. ఈ కథని డ్రైవ్‌ చేయడానికి ఏం అవసరం అనే అంశాలన్నీ తీసుకుని కథ రెడీ చేశా. అలాగని కేవలం పాదయాత్ర గురించి మాత్రమే ఉండదు. అయితే 2004 ఎన్నికలకు ఆర్నెల్ల ముందు నుంచి పాదయాత్ర చేసినట్టు చూపించాం. ఆయన వాస్తవంగా ఎన్నికలకు ఏడాదిన్నర క్రితం పాదయాత్ర చేశారని మనకు తెలుసు. కానీ, మనం సినిమా అనే ఫార్మాట్‌లో.. ఓ డ్రమటైజ్డ్‌ ఫార్మాట్‌లో  చెప్పదలచుకున్నాం కాబట్టి ఆ పాత్రల్ని మూవ్‌ చేయడం కానీ, తగ్గించడమో, పెంచడమో చేశాం.

► ఈ సినిమాలో వైఎస్‌గారి తనయుడి పాత్రలో జగన్‌గారు కనిపిస్తారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి?
సినిమా చివరలో వచ్చే సన్నివేశంలో ఓ ఫుటేజ్‌లో ఉంటారే కానీ, సినిమాలో ఎక్కడా నటించలేదు. వైఎస్‌గారు చనిపోయినప్పుడు తీసుకున్న కొన్ని రియల్‌ విజువల్స్‌లో ఆయన ఎక్కడైనా కనిపిస్తారు కానీ, సెపరేట్‌గా ఆయనపై షూట్‌ చేయలేదు. ∙‘యాత్ర’ పక్కా పొలిటికల్‌ మూవీ అని, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఈ విషయాలు మీదాకా వచ్చాయా?
అలా ఏం లేదు. వైఎస్‌గారి గొప్పతనం చెప్పడానికి ఇంకొకర్ని మనం చిన్నగా చేయాల్సిన అవసరం లేదు. ఒకర్ని తిట్టాల్సిన లేదా చెడు చేయాల్సిన అవసరం కూడా లేదు. వైఎస్‌గారికి ఉన్న పాజిటివ్‌ థ్రెడ్స్‌ని మనం కరెక్ట్‌గా చూపించగలిగితే చాలు అనుకున్నాం. మన దేవుణ్ని మహానుభావుడు అనుకోవడానికి వేరొకర్ని చిన్నగా చేయాల్సిన అవసరం రాలేదు. పైగా అలాంటి లక్షణం వైఎస్‌గారిది కాదు.

► ఫిబ్రవరిలో ‘యాత్ర’ రిలీజవడం ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్లస్‌ అవుతుందనుకుంటున్నారా?
నిజాయతీగా చెప్పాలంటే అలా అనుకోవడం ఓవర్‌ ఎస్టిమేషన్‌ అనుకుంటున్నాం. ఇప్పుడున్న ప్రజలు, ఓటర్లు స్మార్ట్‌ అండ్‌ ఇంటెలిజెంట్‌. ఎవరికి ఓటేస్తే ఎంత లాభం అని ఓ క్యాలిక్యులేషన్‌తో చెప్పేస్తారు. అంత తెలివైన ఓటర్లు ఓ సినిమాతో ప్రభావితం అవుతారని నేను అస్సలు నమ్మను. 30 ఏళ్ల కిందట సినిమా చూసి వాళ్లు ఎగై్జట్‌ అయ్యి ఓట్లు వేసుండొచ్చేమో. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకవేళ మా సినిమా ప్రభావితం చేస్తే మంచిదే.

► ‘యాత్ర’ టీజర్, ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. జగన్‌గారికి చూపించారా?
చూపించాను.. బాగుందన్నారు. సినిమాలో ఏం ఉంటుందనే అంశాల్ని ట్రైలర్‌లో చూపించాం అంతే. ఏ అంశాన్నీ మిస్‌లీడ్‌ చేయలేదు.

► ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతవరకూ రీచ్‌ అవుతుందనుకుంటున్నారు?
నాకు ఆ ఆలోచన లేదండీ. ఇదొక హానెస్ట్‌ ఫిల్మ్‌. సినిమా చూసినప్పుడు ఆ పాత్రతో వాళ్లు ఎమోషనల్‌గా కచ్చితంగా కనెక్ట్‌ అవుతారు. ఎంతమంది చూస్తారు, ఎంత వసూలు చేస్తుందనే ఆలోచన లేదు. తెలుగు ప్రేక్షకులే కాదు.. మలయాళ ప్రేక్షకులు కూడా ‘యాత్ర’ని ఓ మంచికథగా యాక్సెప్ట్‌ చేస్తారు. వైఎస్‌గారు తెలిసిన వాళ్లు చూడటం కాదు.. తెలియని వారు కూడా చూడాలి.. ‘ఎవరో ఓ నాయకుని కథ, చరిత్ర ఇది. కథగా చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎమోషన్‌గా ఉంది’ అనేది అచీవ్‌ అవ్వాలి. అది మేం అచీవ్‌ అయ్యామనుకుంటున్నాం.

► మీ తర్వాతి ప్రాజెక్ట్స్‌ ఏంటి?
‘యాత్ర’ బాగా ఆడితే ఇంతకంటే ఇంకో పెద్ద సినిమా వస్తుంది. ఆడకుంటే మరో చిన్న సినిమా అవకాశం వస్తుంది. అది కూడా సరిగ్గా ఆడకుంటే ఏ వెబ్‌సిరీసో చేయాలి. మనం కథ చెప్పాలని వచ్చాం. అది సినిమానా, వెబ్‌ సిరీసా, అమేజాన్, నెట్‌ఫ్లిక్స్‌ వంటి సంస్థలకు చెబుతామా? అన్నది ముఖ్యం కాదు. ఏదేమైనా ఓ సినిమా నా చరిత్రను అంతం చేయదు. ఈ సినిమా కాకుంటే మరో సినిమా.. అది కూడా కాకుంటే వెబ్‌ సిరీస్‌. అంతేకానీ కథ చెప్పడం మాత్రం ఆపం (నవ్వుతూ).

‘యాత్ర’ రాజకీయ సినిమా అని ప్రేక్షకులు భావిస్తున్నారు. వాళ్లకున్న సర్‌ప్రైజ్‌ ఏంటంటే ఇందులో రాజకీయాలు ఉన్నది కేవలం 20 శాతమే. మిగిలిన 80 శాతం హ్యూమన్‌ డ్రామా. ఎమోషనల్‌గా చాలా బాగుంటుంది. వైఎస్‌గారు రాజకీయ నాయకుడు కావొచ్చు కానీ, ఇది పొలిటికల్‌ సినిమా మాత్రం కాదు. రాజకీయాలు చాలా తక్కువ ఉంటాయి. పాదయాత్రకి ముందు వరకూ వైఎస్‌గారంటే ఒక విధమైన లీడర్‌ అనే ప్రచారం చేశారు కొందరు వ్యక్తులు.. మీడియా వాళ్లు. పాదయాత్ర ద్వారా ఆయన ప్రజల్ని కలుసుకుని, మాట్లాడారు. దీంతో వైఎస్‌గారు ఇంత మంచి మనిషా అంటూ జనాలు భావించారు. అప్పటివరకూ ఆయనపై ఉన్న ఇమేజ్‌ వట్టిదే అనుకుని మార్పు చెందారు.

మరిన్ని వార్తలు