నైపుణ్య పరీక్ష

19 Feb, 2018 14:52 IST|Sakshi
చిన్నారులకు అక్షరాలు నేర్పిస్తున్న అంగన్‌వాడీ టీచర్‌ 

అంగన్‌వాడీ కేంద్రాల్లో నూతన విధానానికి శ్రీకారం

పాఠశాలల మాదిరిగా చిన్నారులకు ప్రొగ్రెస్‌ రిపోర్టు 

ప్రతిభ ఆధారంగా స్టార్ల కేటాయింపు 

అచ్చంపేట రూరల్ ‌: పాఠశాలల్లో విద్యార్థుల నైపుణ్యాన్ని తెలుసుకోవడానికి పరీక్షలు నిర్వహించి, మార్కుల ప్రకారం ర్యాంకులు కేటాయించడం తెలిసిందే. ప్రభుత్వం నూతనంగా అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు మూడు నెలలకోసారి పరీక్షలు నిర్వహించి వారిలోని నైపుణ్య అభివృద్ధిని తెలుసుకోనున్నారు. వెనకబడిన  చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ప్రగతి పత్రాలను అందజేశారు. పాఠశాల స్థాయి మాదిరిగా చిన్నారులకు అంగన్‌వాడీ స్థాయిలోనే ప్రొగ్రెస్‌ రిపోర్టును చిన్నారుల తల్లిదండ్రులకు అందజేయనున్నారు.

మూడు నెలలకోసారి....
ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులకు ప్రతి మూడు నెలలకోసారి నైపుణ్య పరీక్షలు నిర్వహించి కొత్తగా రూపొందించిన పుస్తకాల్లో నమోదు చేయనున్నారు. అచ్చంపేట ఐసీడీఎస్‌ పరిధిలో అచ్చంపేట, అమ్రాబాద్, పదర మండలాల సెక్టార్లు ఉన్నాయి. మూడు మండలాల పరిధిలో 138 పెద్ద అంగన్‌వాడీ కేంద్రాలు, 57 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. కేంద్రాలలో 5633 మంది చిన్నారులు ఉన్నారు. 

2017 జూలై నుంచి..
2017 జూలై నుంచి చిన్నారులకు ప్రతిభ ఆధారంగా స్టార్లను కేటాయిస్తున్నారు. మూడు నుంచి ఐదేళ్ల వయస్సు పిల్లలకు నీలిరంగు పుస్తకాలు ముద్రించారు. మూడు నుంచి నాలుగేళ్ల వయస్సు చిన్నారులకు వ్యక్తిగత, శారీరక మేథో వికాసం నేర్చుకునేలా, నాలుగు నుంచి ఐదేళ్ల వయస్సుచిన్నారులకు పై పరీక్షలతో పాటు బడికి సంసిద్ధత పరీక్షలు నిర్వహించారు. జూలై, డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించి చిన్నారుల ప్రగతిని వారి తల్లులకు అందజేశారు. అలాగే ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. 

ప్రతిభ ఆధారంగా స్టార్ల కేటాయింపు
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఆట పాటలతో అక్షరాలు నేర్పిస్తున్నాం. చిన్నారుల ప్రతిభ ఆధారంగా స్టార్లను కేటాయిస్తున్నాం. ప్రగతి పత్రం ఆధారంగా చిన్నారుల ప్రతిభ వారి తల్లులకు చెబుతున్నాం. వెనకబడిన చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం.  
– విజయలక్ష్మి, అంగన్‌వాడీ టీచర్, అచ్చంపేట

>
మరిన్ని వార్తలు