ప్రజాక్షేత్రంలోకి... ఎన్‌ఆర్‌ఐలు

15 Apr, 2018 09:08 IST|Sakshi

ఐదు నియోజకవర్గాలపై దృష్టిసారించిన ప్రవాస తెలంగాణవాదులు

రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఉత్సాహం

మరికొంతమంది సొంత బలంతోనే రాజకీయ ప్రవేశం

పెద్దతలలున్న నియోజకవర్గాలపైనే ప్రధాన దృష్టి 

కొత్తమలుపు తిరగనున్న రాజకీయం 

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కొత్తతరం నాయకులు రాజకీయ అరంగేట్రం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమంలో పరోక్ష సహకారాన్ని అందించిన ప్రవాస తెలంగాణవాదులు రాజకీయ 
కురుక్షేత్రంలో అడుగుపెట్ట బోతున్నారు. సమకాలీన రాజకీయాలకు దీటుగా తమ సత్తాను చాటేందుకు ప్రజాక్షేత్రంలోకి ప్రవేశించబోతున్నారు. ఇప్పటికిప్పుడు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తామనే విషయాన్ని బాహాటంగా ప్రకటించకున్నా చాలావరకు అధికార టీఆర్‌ఎస్‌ వైపునకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.  

సాక్షి ప్రతినిధి, నల్లగొండ  : ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా పాతుకుపోయిన నియోజకవర్గాలనే లక్ష్యంగా చేసుకుని ఎన్‌ఆర్‌ఐలు పోటీలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్నా రు. అదే క్రమంలో మరికొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీల బలాబలాలను బేరీజు వేసుకుని పోటీకి అనుకూలంగా ఉన్న స్థానాలను ఎంపిక చేసుకుంటున్నట్లు సమాచారం. దీనికోసం ప్రత్యేకంగా ఆయా ప్రాంతాల్లో అంతర్గత సర్వేలు కూడా చేయించుకుంటున్నారు. ఒకవేళ ఏ పార్టీనుంచి ఆదరణ లభించక...స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే...ఆయా నియోజకవర్గాల్లో స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపి, పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షింవచ్చని భావిస్తున్నారు. రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు విదేశాల్లో స్థిరపడిన తాజా, మాజీ ఎమ్మెల్యేల వారసులు, బడా వ్యాపారవేత్తలు ఈ జాబితాలో ఉన్నారు. 

పెద్ద తలలే...టార్గెట్‌...
అధికార, ప్రతిపక్ష పార్టీల్లో పెద్ద తలకాయలనే ఎన్‌ఆర్‌ఐలు లక్ష్యంగా చేసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్, ఆయన సతీమణి పద్మావతి ఎమ్మెల్యేగా ఉన్న కోదాడ నియోజకవర్గాలతోపాటు, రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట నియోజకవర్గాల్లో ఎన్‌ఆర్‌లు అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీటితోపాటు మిర్యాలగూడ, ఎస్టీ రిజర్వుడ్‌ స్థానమైన దేవరకొండనుంచి కూడా పోటీలో నిలబడేందుకు ఎన్‌ఆర్‌ఐలు తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ జాబితాలో...సంకినేని తరుణ్, దొంతరి శ్రీధర్, జలగం సుధీర్, గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి, శాన సైదిరెడ్డి, సక్రునాయక్‌ , పోరెడ్డి శ్రవంత్‌ ఇలా పలువురు ప్రవాస తెలంగాణవాదులు ఉన్నారు. గెలుపు ఓటములు ఎలా ఉన్నా ఒకసారి ఎన్నికలు వస్తే ప్రధానమైన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశంగా దీన్ని ఉపయోగించుకోవాలని పలువురు ప్రవాస తెలంగాణవాదులు వ్యూహారచన చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పోటీచేసి ఓడిపోయిన ప్రవాస తెలంగాణ వాదులు కూడా ఇక్కడ తమ ప్రాబల్యం పెంచుకునేందుకు ఎన్నికలు ఉపయోగపడుతాయని ఆలోచన చేస్తున్నారు. దీనిలో భాగంగానే గతంలో ఉమ్మడి జిల్లాలో పోటీ చేసిన ఎన్‌ఆర్‌ఐల భవితవ్యాన్ని కూడా ఆరా తీస్తున్నారు.  

పార్టీ..లేదా స్వతంత్ర అభ్యర్థిగా..
వచ్చే ఎన్నికల్లో మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం, కోదాడ ప్రాంతా నికి చెందిన ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌ లేదా స్వతంత్ర అభ్యర్థిగా, ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న ఎన్‌ఆర్‌ఐ బీజేపీ నుంచి, నాగార్జుసాగర్‌ టికెట్‌ ఆశిస్తున్న వ్యక్తి టీఆర్‌ఎస్‌ నుంచి, మిన్నెసోటలో ఉండి దేవరకొండ నుంచి  స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేద్దాం అనుకుంటున్న మరో ఎన్‌ఆర్‌ఐ..ఇలా చాలా మంది తమతమ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. జలసాధన సమితి తరఫున గతంలో అనేక మందిని పోటీలో నిలిపి ఫ్లోరోసిస్‌ దుస్థితిని దేశవ్యాప్తం చేసినట్టు, అదే స్థాయిలో తమ తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి ఈ ఎన్నికలను ఉపయోగించుకో వాలని భావిస్తున్నట్టు కోదాడ ప్రాంత ప్రవాస తె లంగాణ వాది జలగం సుధీర్‌ అభిప్రాయపడ్డారు.   

మరిన్ని వార్తలు