ఆగం కావొద్దు

15 Nov, 2023 05:50 IST|Sakshi

కర్ణాటక, గుజరాత్‌ నేతలు కేసీఆర్‌పై దండయాత్ర చేస్తున్నారు సుస్థిర ప్రభుత్వానికి మద్దతివ్వాలి.. కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఓటమి ఖాయం 

నల్లగొండ జిల్లా చిట్యాల రోడ్‌ షోలో మంత్రి కేటీఆర్‌

చిట్యాల: కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసే బలమైన నాయకత్వం కలిగిన బీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాలని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఎన్నికలు వచ్చాయంటే జనంలో లేని వాళ్లు, ఇతర రాష్ట్రాల నుంచి ప్రచారానికి వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను చూసి ఓటర్లు ఆగమాగం కావొద్దన్నారు. కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి విపక్షాల నాయకులు వచ్చి బక్కపల్చగా ఉండే సీఎం కేసీఆర్‌పై దండయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు.

మంగళవారం నల్లగొండ జిల్లా చిట్యాలలో పార్టీ నకిరేకల్‌ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యతో కలిసి నిర్వహించిన రోడ్‌ షోలో కేటీఆర్‌ ప్రసంగించారు. బీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తే కేసీఆర్‌ మూడోసారి సీఎంగా పనిచేస్తారని, కాంగ్రెస్‌లో మాత్రం కౌన్‌ బనేగా సీఎం అన్నట్లుగా జిల్లాకో నలుగురు సీఎం అభ్యర్థులున్నారని, వారికి ఢిల్లీ నుంచి సీల్డ్‌ కవర్‌లో సీఎం పేరు వస్తుందని ఎద్దేవా చేశారు.

ఒకాయన పిల్లే లేదు కానీ పెళ్లి ముహూర్తం పెట్టుకున్నట్లు పార్టీలో సీఎం సీటు కోసం ముహూర్తం కూడా పెట్టుకున్నాడన్నారు. ప్రజలకు ఏం చేశారని కాంగ్రెస్‌కు ఓటెయ్యాలో ఆ పార్టీ నాయకులను ప్రశ్నించాలన్నారు. మరోసారి గెలిపిస్తే తెల్లరేషన్‌ కార్డుదారులకు సన్నబియ్యం, కేసీఆర్‌ రూ.5 లక్షల బీమా సౌకర్యం, పద్దెనిమిదేళ్లు నిండిన మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా నెలకు రూ.3వేల నగదు అందిస్తామని, ఆసరా పింఛన్‌లను పెంచుతామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.   

డబ్బు పొగరుతో కోమటిరెడ్డి బ్రదర్స్‌ పోటీ 
నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్‌ డబ్బు పొగరుతో పోటీచేస్తున్నారని, వారు ఓడిపోవడం ఖాయమని కేటీఆర్‌ పేర్కొన్నారు. నల్లగొండలో కంచర్ల భూపాల్‌రెడ్డి, మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వారిద్దరిని ఓడిస్తారని జోస్యం చెప్పారు. రిజర్వుడు నియోజకవర్గమైన నకిరేకల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యపై మీ పెత్తనం ఏందని కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ప్రశ్నించారు.

పేదింటి బిడ్డ చిరుమర్తి లింగయ్యను ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. రోడ్‌ షోలో భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, చెరుకు సుధాకర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

(బాక్స్‌) సంపద పెంచాలి.. పేదలకు పంచాలి  
నాగోలు: రాష్ట్రంలో అన్ని వర్గాలను, అన్ని రంగాలను అన్ని విధాలా ఆదుకున్న ఏకైక ప్రభుత్వం తమదే అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సంపద పెంచాలి.. పేదలకు పంచాలి అనేది తమ నినాదమన్నారు. మంగళవారం నాగోల్‌లో రాష్ట్ర హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్‌ వీవర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆతీ్మయ సమ్మేళనంలో కేటీఆర్‌ మాట్లాడారు.

మునుగోడులో గతంలో ఫ్లోరోసిస్‌తో ఎంతోమంది ఇబ్బందులు పడ్డారని, కేసీఆర్‌ మిషన్‌ భగీరథ పథకానికి రూపకల్పన ఫ్లోరోసిస్‌కు శాశ్వత పరిష్కారం చూపారని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని టెక్స్‌టైల్‌ పార్కులు పెట్టుకుందామని చెప్పారు. నేతన్నల బాగు కోసం ఇంకా ఏమైనా చేయాలనే ఆలోచన చేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ ఎల్‌.రమణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనేక చేనేత కార్మికుల పథకాలు రద్దు చేసిందన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పద్మశాలీల ఇంట్లో ఉండి చదువుకున్నందున, మన సమస్యలు తెలుసని చెప్పారు. వందకు వంద శాతం పద్మశాలీలు బీఆర్‌ఎస్‌ వైపు ఉన్నారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు