కేసుల్లో మళ్లీ రికార్డు

20 Jun, 2020 03:42 IST|Sakshi
పట్నాలో సీఆర్పీఎఫ్‌ జవాన్ల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రంలోకి చేరిన వరద నీరు

ఒకే రోజు 13,586 మందికి పాజిటివ్‌ 

క్షీణించిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్‌ జైన్‌ ఆరోగ్యం  

న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజు రోజుకీ విజృంభిస్తోంది. కొత్త కేసులు నమోదులో మరో రికార్డు సృష్టించింది. 24 గంటల్లో 13,586 కేసులు నమోదయ్యాయి. 336 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,80,532కు, మృతుల సంఖ్య 12,573కి చేరుకుందని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజుకి 10 వేలు దాటి కేసులు నమోదు కావడం వరసగా ఇది ఎనిమిదో రోజు. జూన్‌ 1 నుంచి 19 మధ్య 1,89,997 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత భారత్‌ ఉంది.  

ప్రైవేటు ఆస్పత్రికి సత్యేందర్‌ జైన్‌
కరోనా వైరస్‌ సోకిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్‌ జైన్‌ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఆయనకు న్యుమోనియా కూడా సోకడంతో సాకేత్‌లోని మ్యాక్స్‌ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ప్లాస్మా థెరపీ చేసే అవకాశాలున్నాయి.

మూతబడిన కర్ణాటక సీఎం కార్యాలయం
శివాజీనగర: కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప కార్యాలయం, అధికారిక నివాసం కూడా అయిన కృష్ణలో పనిచేసే ఓ ఉద్యోగిని భర్తకు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో శానిటైజేషన్‌ కోసం కార్యాలయాన్ని మూసివేశారు. ముఖ్యమైన సమావేశాలన్నీ యెడియూరప్ప విధాన సౌధలో నిర్వహించారు.

2 లక్షలు దాటిన రికవరీ కేసులు  
కోవిడ్‌–19 బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య బాగా పెరగడం మన దేశానికి అత్యంత ఊరటనిస్తోంది. ఇప్పటివరకు 2,04,710 మంది రోగులు కరోనా నుంచి కోలుకుంటే , 1,63,248 మంది చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 53.79శాతానికి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు.  

 చైనాలో ఇటీవల 37 కొత్త కరోనా కేసులు రాగా, అందులో 25 కేసులు బీజింగ్‌లో వచ్చాయి.  బీజింగ్‌లో కనిపించిన కరోనా వైరస్‌కు యూరోప్‌ వైరస్‌కు సంబంధాలు ఉన్నాయని చైనా వైరాలజిస్టులు తెలిపారంటూ గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక శుక్రవారం ఓ కథనం ప్రచురించింది. ప్రస్తుతం బీజింగ్‌లో 183 మంది కరోనా వైరస్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు