దాహంతో చనిపోయిన ఒంటెలు

22 May, 2015 21:24 IST|Sakshi
దాహంతో చనిపోయిన ఒంటెలు

దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత ఎంతుందో తెలపడంతోపాటు విచ్చలవిడిగా కొనసాగుతోన్న జంతువుల అక్రమరవాణాకు అద్దంపట్టే ఘటన ఇది. నీళ్లు తాగకుండా దాదాపు రెండు నెలల వరకు జీవించగలిగిన ఒంటెలు అక్రమ రవాణాదారుల చేతుల్లో పడి దాహంతో విలవిలలాడి చనిపోయాయి. ఉత్తరప్రదేశ్లోని మీరట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. జంతువుల అక్రమరవాణాపై జంతు సంరక్షులు కొందరు ఇచ్చిన సమాచారంతో శుక్రవారం ఉదయం తనిఖీలు చేపట్టిన పోలీసులకు.. ఒక ఇరుకైన ట్రాలీలో తరలిస్తోన్న 16 ఒంటెలు కంటబడ్డాయి. భగ్పట్ నుంచి మొరాదాబాద్కు వాటిని తరలిస్తోన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

అయితే ఒంటెలను మాత్రం పోలీస్ ష్టేషన్ ఆవరణలోని తీవ్రమైన ఎండలో కట్టేసి ఉంచారు. వాటిలో మూడు ఒంటెలు దాహంతో విలవిలలాడి స్టేషన్ ఆవరణలోనే ప్రాణాలు కోల్పోయాయి. విషయం తెలుసుకున్న జంతు సంరక్షులు పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఒంటెల్సి స్వాధీనం చేసుకున్నారని తెలియగానే ఢిల్లీలోని సంజయ్ గాంధీ జంతు సంరక్షణ శాల అధికారులతో మాట్లాడామని, పోలీసులు కూడా వాటిని ఢిల్లీకి తరలిస్తారని తమతో అన్నారని, కానీ తరలింపులో తలెత్తిన ఆలస్యం, పోలీసుల నిర్లక్ష్యం కారణంగా మూగ జీవాలు ప్రాణాలు కోల్పోయాయని జంతుసంరక్షకులు పేర్కొన్నారు. కాగా, తాము నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని, ప్రొసీజర్స్ అన్నీ పూర్తయిన తర్వాత ఒంటెల్ని ఢిల్లీకి తరలించాలనుకున్నామని, ఎడారి ఓడలుగా పేరున్న ఒంటెలు ఎండకు చనిపోవడం ఆశ్చర్యంతోపాటు బాధ కలిగించిందని పోలీసులు ప్రకటించారు.

మరిన్ని వార్తలు