గడిచిన 9 రోజుల్లో 76 వేలకు పైగా కేసులు

10 Jun, 2020 10:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

40 రోజుల్లోనే 86శాతం కేసులు

న్యూఢిల్లీ: గత 40 రోజుల్లో దాదాపు 86 శాతం కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని హిందుస్తాన్ టైమ్స్ తెలిపింది. అలానే మే, జూన్ మధ్య 84 శాతం మంది రోగులు మరణించినట్లు పేర్కొంది. కరోనా వైరస్‌ వ్యాప్తికి సంబంధించినంతవరకు మే నెల భారతదేశంలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. తాజా పరిశీలన ప్రకారం ఒక్క మే నెలలోనే 1,53,000 కేసులు నమోదయ్యాయి. జూన్ 1 నుంచి దేశంలో ఆంక్షలను తగ్గించడమే కాక, ఆర్థిక కార్యకలాపాలను పునః ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గడిచిన తొమ్మిది రోజుల్లో దేశంలో 76,000 కన్నా ఎక్కువ కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని హిందూస్తాన్ టైమ్స్ తెలిపింది.

ప్రస్తుత అన్‌లాకింగ్‌ దశలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో మాల్స్, మతపరమైన ప్రదేశాలు, రెస్టారెంట్లు సోమవారం నుంచి ప్రారంభించబడ్డాయి. అధిక కేసులు నమోదవుతున్న కంటైన్మెంట్‌ జోన్లు మినహాయించి దేశవ్యాప్తంగా అన్ని కార్యాలయాలు, ఇతర సంస్థలు కూడా తిరిగి ప్రారంభించారు. దేశంలో మంగళవారం నాడు దాదాపు 10,000 కేసులు నమోదయ్యి మొత్తం సంఖ్య 2.6 లక్షలను దాటింది. అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. ఫలితంగా వందలాది ​కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలను నియమించింది. ఈ బృందాలు పెద్ద ఎత్తున కేసులు వెలుగు చూస్తున్న జిల్లాలు, మున్సిపాలిటిల్లో పర్యటించి వైరస్‌ వ్యాప్తి చెందడానికి గల కారణాలను పరిశీలించనున్నాయి. (భయపడింది చాలు.. ఇక జాగ్రత్తపడితే మేలు!)

ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్‌ అనేక దేశాలతో పోల్చితే కోవిడ్ -19 పోరాటంలో భారత్ మెరుగైన స్థానంలో ఉందని తెలిపారు. ‘సామాజిక దూరం, చేతుల శుభ్రత, మాస్క్‌లు, ఫేస్‌ కవర్లు వంటి నిబంధనలను కఠినంగా పాటించడం ద్వారా కోవిడ్ -19 కి వ్యతిరేకంగా పాటిస్తోన్న సామాజిక వ్యాక్సిన్‌ను మనం మరచిపోకూడదు అని ఆయన పిలుపునిచ్చారు.

కరోనా కేసుల సంఖ్యలో భారత్‌.. అమెరికా, బ్రెజిల్, రష్యా, యూకే తరువాత ఐదవ స్థానంలో నిలిచిందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ గణాంకాలు చెబుతున్నాయి. కరోనా వైరస్‌ గత డిసెంబరులో చైనాలో ఉద్భవించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 71.5 లక్షల మందికి పైగా వైరస్‌ బారిన పడగా.. 4 లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. (కొత్త అవకాశాలు తీసుకొచ్చిన కరోనా)

మరిన్ని వార్తలు