దేవుని దర్శించుకోవడానికీ ఆధార్‌..

1 Sep, 2017 12:32 IST|Sakshi
సాక్షి, బెంగళూరు : ఉత్తరఖాండ్‌లో ప్రతేడాది ఎంతో భక్తిశ్రద్ధలతో, వైభోవంగా జరిగే బద్రినాథ్‌, కేదర్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రి తీర్థయాత్రలకు వెళ్లాలంటే ఇక ఆధార్‌ తప్పనిసరి. ఈ పుణ్యయాత్రలకు వెళ్లే వారికి ఆధార్‌ కార్డును తప్పనిసరి చేస్తూ కర్నాటక ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. యాత్రికులకు ప్రభుత్వం అందిస్తున్న 20వేల రూపాయల ట్రావెల్‌ సబ్సిడీ దుర్వినియోగమవుతుందనే భయాందోళనతో కర్నాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 17న ప్రభుత్వం సమీక్షించిన ఛార్‌ ధామ్‌ తీర్థయాత్ర నిబంధనల ప్రకారం, సబ్సిడీని పొందడానికి దరఖాస్తుదారులకు ఆధార్‌ కార్డును ఫ్రూప్‌గా పరిగణించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.
 
'' రాష్ట్రంలో శాశ్వత నివాసం కలిగిన 1000-1500 మంది ప్రజలకు ఛార్‌ ధామ్‌ యాత్రం కోసం ప్రతేడాది ట్రావెల్‌ సబ్సిడీ అందుబాటులో ఉంటుంది. కానీ ఈ ఏడాది యాత్రికుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశముంది. ప్రభుత్వం అందించే సబ్సిడీలపై ట్రావెల్‌ ఆపరేటర్లు భక్తులకు పలు తప్పుడు మార్గాలను సూచిస్తున్నారు. తప్పుడు ప్రయాణ పత్రాలు సమర్పించి సబ్సిడీ మొత్తాన్ని దుర్వినియోగ పరచాలని చూస్తున్నారు. దీంతో ఆధార్‌ కార్డును తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది'' అని ఓ సీనియర్‌ అధికారి చెప్పారు. 2014లో సిద్ధరామయ్య ప్రభుత్వం దగ్గర్నుంచి ఈ యాత్రకు వెళ్లే కొంతమంది రాష్ట్ర నివాసులకు సబ్సిడీ అందించడం ప్రారంభించారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఈ యాత్రకు వెళ్లేందుకు ఈ ట్రావెల్‌ సబ్సిడీని అందుబాటులోకి తెచ్చారు. 
మరిన్ని వార్తలు