కర్ణాటక ప్రభుత్వానికి కేంద్ర పురావస్తు శాఖ నోటీసులు

13 Nov, 2023 13:59 IST|Sakshi

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన హంపీలోని విరూపాక్ష ఆలయంలో చారిత్రక స్తంభాన్ని తవ్వినట్లు వచ్చిన ఆరోపణలపై భారత ఆర్కియోలాజికల్ సర్వే కర్ణాటక దేవదాయ శాఖకు నోటీసులు జారీ చేసింది. ఇటీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరైన కర్ణాటక రాజ్యోత్సవ కార్యక్రమంలో జెండా ఏర్పాటు కోసం అక్కడ డ్రిల్లింగ్ చేసినట్లుగా ఆరోపిస్తున్నారు.

చారిత్రక ప్రదేశంలో తవ్వే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆక్షేపిస్తోంది. హంపీ విరూపాక్ష ఆలయ సముదాయం కేంద్ర సాంస్కృతిక శాఖ పరిధిలోని భారత ఆర్కియోలాజికల్‌ సర్వే రక్షణలో ఉందని, అనుమతులు లేకుండా ఆలయాన్ని మూసివేయడం, స్తంభాల మధ్య రంధ్రాలు చేయడం నిబంధనలకు విరుద్ధమని దేవదాయ శాఖ ఇన్‌ఛార్జ్‌ అధికారికి ఇచ్చిన నోటీసులో భారత ఆర్కియోలాజికల్‌ సర్వే పేర్కొంది.చారిత్రక కట్టడాల రక్షణ చట్టం (AMASR Act)లోని సెక్షన్ 30ను ఉల్లంఘించినందుకు గానూ వివరణ ఇవ్వాలని కోరింది. 

విజయనగర సామ్రాజ్య కాలంలో రాజధాని నగరంగా ఉన్న హంపిలోని స్మారక కట్టడాల సమూహంలో విరూపాక్ష ఆలయం భాగంగా ఉంది. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో విజయనగర రాజు రెండవ దేవరాయ నిర్మించారని చరిత్రకారులు భావిస్తున్నారు. 1986లో యునెస్కో హంపిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఇక్కడి వివిధ స్మారక చిహ్నాలను కేంద్ర సాంస్కృతిక శాఖ పరిధిలోని భారత ఆర్కియోలాజికల్‌ సర్వే పరిరక్షిస్తోంది.

మరిన్ని వార్తలు