‘అగ్ని–5’ విజయవంతం

27 Dec, 2016 02:07 IST|Sakshi
‘అగ్ని–5’ విజయవంతం

అణ్వస్త్ర సామర్థ్యమున్న ఖండాంతర క్షిపణి
పరిధి 5–6 వేల కిలోమీటర్ల పైనే
ఒడిశాలోని అబ్దుల్‌కలాం ద్వీపం నుంచి ప్రయోగం
దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీతోనే రూపకల్పన
త్వరలోనే భారత రక్షణ వ్యవస్థలోకి ప్రవేశం


బాలాసోర్‌: రక్షణ శాఖ అమ్ములపొదిలోకి త్వరలోనే అణ్వాయుధ సామర్థ్యమున్న ఖండాంతర విధ్వంసక క్షిపణి అగ్ని–5 చేరనుంది. ఒడిశాలోని బాలాసోర్‌లో అబ్దుల్‌ కలాం ద్వీపం నుంచి సోమవారం అగ్ని–5ను విజయవంతంగా పరీక్షించారు. ఈ బాలిస్టిక్‌ క్షిపణి పరిధి 5–6 వేల కిలోమీటర్లు. అగ్ని–5 పరిధిలో చైనా, రష్యా దేశాలు పూర్తిగా.. సగానికిపైగా యూరప్, ఆఫ్రికా ఖండాలున్నాయి. అగ్ని–5ను నాలుగు విడతల్లో విజయవంతంగా పరీక్షించటం వల్ల వ్యూహాత్మక బలగాల కమాండ్‌ (ఎస్‌ఎఫ్‌సీ)లోకి దీన్ని ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమమైందని రక్షణశాఖ స్పష్టం చేసింది.

మూడు దశల్లో పనిచేసే భూఉపరితల లక్ష్యాలను ఛేదించగలిగే సామర్థ్యమున్న అగ్ని–5ను ఉదయం 11.05 గంటలకు ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌లో మొబైల్‌ లాం చర్‌ నుంచి ప్రయోగించారు. 17 మీటర్ల పొడవు, 50 టన్నుల బరువు, రెండు మీటర్ల వ్యాసార్థంమున్న ఈ క్షిపణికి 3 దశల్లో పనిచేసే ఇంజన్లను అమర్చారు. 1,500 కిలోల అణ్వాయుధాలను ఈ క్షిపణి మోసుకెళ్లగలదు. అవసరమైతే చాలా తక్కువ సమయంలోనే దీన్ని లాంచింగ్‌ కోసం సిద్ధం చేయొచ్చు.

అత్యాధునిక అగ్ని–5
2012లో అగ్ని–5 సిద్ధమైనప్పటికీ నాలుగు విడతల్లో విజయవంతంగా పరీక్షించాకే అగ్ని–5 సామర్థ్యాన్ని అధికారికంగా సోమవారం ధ్రువీకరించారు. ఇప్పటివరకున్న అగ్ని క్షిపణుల్లో అగ్ని–5 చాలా ప్రత్యేకమైంది. 5వేల కి.మీ.కు మించిన పరిధిలోని లక్ష్యాలను ఛేదించే సత్తా ఉండటంతోపాటు.. దీని నేవిగేషన్, గైడెన్స్‌ వ్యవస్థ, ఇంజన్, వార్‌హెడ్‌లను మోసుకెళ్లే సామర్థ్యం అన్నీ అత్యాధునిక సాంకేతికతో కూర్పుచేశారు. దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీని ట్రయల్స్‌లో విజయవంతంగా పరీక్షించారు. అత్యంత కచ్చితత్వం కలిగిన రింగ్‌ లేజర్‌ గైరో ఆధారిత ఇనర్షియల్‌ నేవిగేషన్‌సిస్టమ్‌ (ఆర్‌ఐఎన్‌ఎస్‌), అధునాతనమైన మైక్రోనేవిగేషన్‌ వ్యవ స్థ (ఎమ్‌ఐఎన్‌ఎస్‌) ఉన్నాయి. హైస్పీడ్‌ కంప్యూటర్, లోపాల్లేని సాఫ్ట్‌వేర్, నమ్మకమైన బస్‌.. అగ్ని–5ను దోషరహిత క్షిపణిగా మార్చాయని డీఆర్డీవో అధికారులు తెలిపారు. 2011 కల్లా ఇది సిద్ధమవుతుందని భావించినప్పటికీ వివిధ కారణాలతో ఆలస్యమైంది.

రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు
అగ్ని–5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన డీఆర్డీవో శాస్త్రవేత్తలను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని మోదీ అభినందించారు. దేశ వ్యూహాత్మక రక్షణ వ్యవస్థను మరో అడుగు ముందుకు తీసుకెళ్లారని ప్రశంసించారు. మన వ్యూహాత్మక, నియంత్రణ సామర్థ్యాన్ని బలోపేతం చేశారని ప్రణబ్‌ ట్వీట్‌ చేశా రు. ‘అగ్ని–5 సక్సెస్‌ భారతీయుందరికీ గర్వకారణం. వ్యూహాత్మక రక్షణ వ్యవస్థకు బ్రహ్మాండమైన బలాన్నందించారు’ అని మోదీ అభినందించారు.    

వైఎస్‌ జగన్‌ అభినందనలు: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అగ్ని–5 క్షిపణి ప్రయోగం విజయవంతంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. డీఆర్డీవో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. క్షిపణి ప్రయోగం సక్సెస్‌పై ఆయన ట్టిట్టర్‌లో హర్షం వ్యక్తం చేశారు.

ఎలా పనిచేస్తుంది?
విక్షేపక మార్గంలో అత్యున్నత ఎత్తుకు చేరుకున్న తర్వాత ఇనర్షియల్‌ నేవిగేషన్‌ సిస్టమ్‌ ద్వారా, ఆన్‌బోర్డు కంప్యూటర్‌ మార్గదర్శకత్వంలో  రెట్టించిన వేగంతో (క్షిపణి వేగం, భూమ్యాకర్షణ శక్తి కలిపి) నిర్దేశిత లక్ష్యం వైపు అగ్ని–5 దూసుకెళ్తుంది. ఈ సమయంలో క్షిపణి ఉష్ణోగ్రత 4 వేల డిగ్రీల సెల్సియస్‌ను దాటిపోతుంది. అందుకోసం స్వదేశీ తయారీ కార్బన్‌–కార్బన్‌ కంపోజిట్‌ రక్షణ కవచం.. ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు మించకుండా లక్ష్యం చేరేవరకు పేలోడ్‌ను కాపాడుతుంది. ఆర్‌ఐఎన్‌ఎస్, ఎమ్‌ఐఎన్‌ఎస్‌S కమాండ్‌తో టార్గెట్‌ను ఢీ కొంటుంది. సోమవారం ప్రయోగం సందర్భంగా మధ్య దార్లో, లక్ష్యిత స్థానంలో ఏర్పాటు చేసిన రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్‌ వ్యవస్థ మిసైల్‌ కచ్చితత్వాన్ని ధ్రువీకరించినట్లు తెలిసింది. తొలిరెండు దశల ప్రయోగంతోనే ఈ మిసైల్‌ సామర్థ్యం ప్రపంచానికి అర్థమైంది.

>
మరిన్ని వార్తలు