యువరాణికి పట్టం.. డిప్యూటీ సీఎంగా దియాకుమారి

12 Dec, 2023 20:14 IST|Sakshi

జైపూర్‌: అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ.. చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో అనుహ్యంగా కొత్తవారిని ముఖ్యమంత్రులుగా ప్రకటించి సరికొత్త వ్యూహాన్ని అమలు పరిచింది. అయితే తాజాగా కూడా అదే ఫార్ములా ప్రయోగించింది. రాజస్థాన్‌లో కేవలం మొదటిసారి గెలిచిన భజన్‌లాల్‌ శర్మను సీఎంగా బీజేపీ ప్రకటించింది. అయితే ఇక్కడ ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చింది బీజేపీ హైకమాండ్‌. ప్రేమ్‌ చంద్‌ భైరవ, దియా కుమారిలను డిప్యూటీ సీఎం పదవులు వరించాయి.

సామాజిక సమీకరణాల దృష్ట్యా రాజస్థాన్‌లో రాజ కుంటుబానికి చెందిన దియా కుమారికి.. డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఈసారీ బీజేపీ హైకమాండ్‌ రాజస్థాన్‌ సీఎంగా దియా కుమారికి అవకాశం కల్పిస్తారని పార్టీలో జోరుగా ప్రచారం జరిగింది. సీఎం పదవి కోసం వసుంధర రాజే, అర్జున్‌రామ్‌, గజేంద్ర షెకావత్‌, అశ్విని వైష్ణవ్‌ వంటి సీనియర్‌ నేతలతో పోటీపడ్డ దియా కుమారి.. డిప్యూటీ సీఎం పదవిని దక్కించుకుంది.

ప్రస్తుతంగా ఆమె వ్యక్తిగత, రాజకీయ జీవితం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.  జైపూర్‌ మహారాజ కుటుంబంలో ఆమె 1971లో జన్మించారు.  తాత మాన్‌ సింగ్‌-2 బ్రిటీష్‌ ఇండియా కాలంలో చివరి జైపూర్‌ మహారాజు. తండ్రి  బ్రిగేడియర్ సవాయ్ భవానీ సింగ్ మహావీర చక్ర అవార్డు గ్రహిత. ఆయన 1971లో ఇండియా-పాకిస్తాన్‌ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. మహారాణి గాయత్రీ దేవి పాఠశాల విద్య, జైపూర్‌లోని మహారాణి కళాశాలలో కాలేజీ చదువును పూర్తి చేసుకున్నారు. నరేంద్ర సింగ్‌ను వివాహం చేసుకున్న దియాకుమారికి.. ముగ్గురు పిల్లలు. ఆమె 2018లో నరేంద్ర సింగ్‌తో విడాకులు తీసుకుంది. 

రాజకీయం జీవితం..
రాజకీయలపై ఆసక్తితో దియాకుమారి 2013లో అసెంబ్లీ ఎన్నికల్లో మాధోపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. మొదటిసారి గెలుపొందగానే పలు ప్రాంతాలను అభివృద్ధి చేసింది. 2019 లోక్‌సభ ఎ‍న్నికల్లో రాజసమంద్ నియోజకవర్గం నుంచి పోటీ ఎంపీగా గెలుపోందారు. రాజకీయాలతో పాటు దియా కుమారి  అనేక బిజినెస్‌ వెంచర్లు, రెండు స్కూల్స్‌, మ్యూజియం, ట్రస్టు, హోటల్‌, ఎన్‌జీఓలను నిర్వహిస్తు​న్నారు. పలు కార్యక్రమాల ద్వారా ఆమె స్త్రీల అభ్యున్నతికి కృషి చేస్తారు. పలు ఎన్‌జీఓ ద్వారా సేవ చేసినందుకు.. ఆమె ఇటీవల జైపూర్‌లోని అమిటీ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ కూడా పొందారు.

2023 రాజస్థాన్‌ అసెంబ్లీలో విధ్యాదర్‌నగర్‌లో నియోజకవర్గలో పోటీ చేసి 71,368 భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎప్పుడూ ప్రజాక్షేత్రంలో ఉంటూ సేవ ఈ యువరాణి(దియా కుమారి) మహిళలకు భద్రతకు కృషి చేస్తానని, యూవతకు ఉద్యోగ అవకాశాలు, రైతుల కష్టాలను తీర్చుతానని ప్రచారంలో హామీలు ఇచ్చారు.

చదవండి: రాజస్థాన్‌ సీఎంగా ఫస్ట్‌ టైం ఎమ్మెల్యే భజన్‌లాల్‌ శర్మ

>
మరిన్ని వార్తలు