మోదీని ఎదుర్కోగలిగే నేత రాహులే: మాకెన్‌

8 Mar, 2020 21:45 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ తిరిగి బాధ్యతలు స్వీకరించాలని  ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అజయ్ మాకెన్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ పుంజుకోవాలంటే రాహుల్‌ గాంధీ పార్టీకి నాయకత్వం వహించాలని అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ పార్టీని ధైర్యంగా ఎదుర్కొగలిగే శక్తి ఒక రాహుల్‌కే ఉందని తెలిపారు. కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు ​సోనియా గాంధీ చాలా అనుభవం గల రాజకీయ నాయకురాలని, రాహుల్‌కు బాధ్యతలు అప్పగించి సలహాలిచ్చే బాధ్యతను సోనియా తీసుకుంటే బాగుంటుందని ఆయన అన్నారు.

దీనికి అనుగుణంగానే పార్టీ రాజ్యాంగాన్ని కూడా మార్చాల్సిన అవసరం ఉందని అజయ్ మాకెన్ వ్యాఖ్యానించారు. దేశానికి మంచి చేసే నాయకుడి అవసరం ఉందని అన్నారు. రాహుల్‌ గాంధీ గెలుపు, ఓటమిలతో సంబంధం లేకుండా అన్ని ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని కొనియాడారు. సామాజిక, జాతీయ, ఆర్థిక అంశాలపై కాంగ్రెస్‌ పార్టీ భావజాలాన్ని పార్టీ నాయకులు అందరు పాటించాలని అజయ్ మాకెన్ పేర్కొన్నారు.

చదవండి: మోదీ తాజ్‌మహల్‌ను కూడా అమ్మేస్తారు: రాహుల్‌

మరిన్ని వార్తలు