సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసు: నిందితులందరికీ విముక్తి

21 Dec, 2018 13:30 IST|Sakshi

సాక్షి, ముంబై : 2005లో  సోహ్రబుద్దీన్‌ షేక్‌, తులసీరాం ప్రజాపతి ఎన్‌కౌంటర్‌ కేసులో మొత్తం 22 మంది నిందితులకు విముక్తి కల్పిస్తూ శుక్రవారం ముంబై కోర్టు తీర్పు వెలువరించింది. నిందితులపై నేరాన్ని రుజువు చేసేందుకు తగిన ఆధారాలు లేనందున వారిని కేసు నుంచి తప్పిస్తున్నట్టు సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి స్పష్టం చేశారు. గుజరాత్‌, రాజస్ధాన్‌లకు చెందిన పోలీస్‌ అధికారులే నిందితుల్లో అధికంగా ఉన్నారు. రాజకీయ, ఆర్థిక లబ్ధి కోసమే ఈ హత్యలకు కుట్ర జరిగిందని కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఆరోపించింది. ఇదే కేసులో సీబీఐ నిందితుడిగా చేర్చిన బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాకు గతంలో కేసు నుంచి ఊరట లభించింది. ఆయన పాత్రపై ఆధారాలు లేనందున అమిత్‌ షాతో గుజరాత్‌ మాజీ డీజీపీ వంజరాలకు కేసు నుంచి కోర్టు విముక్తి కల్పించింది.

ఈ కేసులో మొత్తం 210 మంది సాక్షులను కోర్టు విచారించగా వీరిలో 92 మంది అప్రూవర్లుగా మారారు. సోహ్రబుద్దీన్‌ అపహరణ, ఎన్‌కౌంటర్‌ బూటకమని నిరూపించేందుకు ప్రాసిక్యూషన్‌ గట్టిగా కృషి చేసినా సాక్షులు అప్రూవర్లుగా మారడంతో వారు నోరుమెదపలేదని, ఇందులో ప్రాసిక్యూషన్‌ తప్పేమీ లేదని కోర్టు పేర్కొంది. సోహ్రబుద్దీన్‌, తులసీరామ్‌ ప్రజాపతి కుటుంబాలకు న్యాయస్ధానం విచారం వెలిబుచ్చుతోందని, కోర్టులు కేవలం సాక్ష్యాల ఆధారంగానే పనిచేయాలని వ్యవస్థ, చట్టం నిర్దేశిస్తాయని తీర్పును చదువుతూ న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌జే శర్మ వ్యాఖ్యానించారు. కాగా, ఈ కేసును తొలుత గుజరాత్‌ సీఐడీ విచారించగా తదుపరి 2010లో దర్యాప్తును సీబీఐకి బదలాయించారు. సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ సహా ఈ ఘటనలు జరిగిన సమయంలో గుజరాత్‌ హోంమంత్రిగా వ్యవహరించిన అమిత్‌ షాను నిందితుల్లో ఒకరిగా చేర్చగా ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు లేవంటూ 2014లో కేసు నుంచి విముక్తి కల్పించారు.

అసలేం జరిగింది..
ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ అప్పటి గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయంలో ఆయన హత్యకు కుట్రపన్నిన సోహ్రబుద్దీన్‌ షేక్‌ 2005 నవంబర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడని గుజరాత్‌ పోలీసులు వెల్లడించారు. అదే ఏడాది నవంబర్‌ 22న సోహ్రబుద్దీన్‌, ఆయన భార్య కౌసర్‌ బి, సహచరుడు తులసీరాం ప్రజాపతిలు హైదరాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని సంగ్లీకి బస్సులో వెళుతుండగా గుజరాత్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సీబీఐ తెలిపింది. నాలుగు రోజుల తర్వాత సోహ్రబుద్దీన్‌ను అహ్మదాబాద్‌ వద్ద హతమార్చారని, అదృశ్యమైన కౌసర్‌ బీని నవంబర్‌ 29న బనస్కంత జిల్లాలోని ఓ గ్రామానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడి అనంతరం హతమార్చారని సీబీఐ ఆరోపించింది. ఇక 2006 డిసెంబర్‌ 27న గుజరాత్‌-రాజస్ధాన్‌ సరిహద్దుల్లో ఇరు రాష్ట్రాల పోలీసులు చాప్రి ప్రాంతం వద్ద కాల్చిచంపారని పేర్కొంది. అయితే ప్రజాపతిని ఓ కేసు విచారణ నిమిత్తం అహ్మదాబాద్‌ నుంచి రాజస్ధాన్‌కు తీసుకువెళుతుండగా పారిపోయేందుకు ప్రయత్నించగా అతడిని ఆపే క్రమంలో జరిపిన కాల్పుల్లో మరణించాడని పోలీసులు చెబుతున్నారు.

నిర్ధోషులుగా బయటపడిన ప్రముఖులు
సోహ్రబుద్దీన్‌ కేసులో బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాతో పాటు గుజరాత్‌ పోలీసు అధికారి అభయ్‌ చుడాసమ, రాజస్ధాన్‌ మాజీ హోంమంత్రి గులాబ్‌చంద్‌ కటారియా, మాజీ గుజరాత్‌ డీజీపీ పీసీ పాండే, సీనియర్‌ పోలీస్‌ అధికారి గీతా జోహ్రి తదితరులున్నారు. ఇక తాజా తీర్పులో కేసు నుంచి విముక్తి పొందిన వారిలో అత్యధికులు గుజరాత్‌, రాజస్ధాన్‌లకు చెందిన దిగువస్ధాయి పోలీసు అధికారులే ఉండటం గమనార్హం.

>
మరిన్ని వార్తలు