ఆన్‌లైన్‌లో పరిచయం.. ఆపై మోసం..

21 Dec, 2018 13:27 IST|Sakshi

యువకుడిని అరెస్ట్‌ చేసిన నున్న పోలీసులు

అజిత్‌సింగ్‌నగర్‌(విజయవాడ సెంట్రల్‌): ఆన్‌లైన్‌లో కెమెరా అమ్ముతామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన బెంగళూరు యువకుడిని నున్న రూరల్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాష్‌నగర్‌ ప్రాంతానికి చెందిన నాగచైతన్య (17) అనే విద్యార్థికి బెంగళూరుకు చెందిన సయ్యద్‌ ఫుర్‌ఖాన్‌ (19) అనే యువకుడు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. బెంగళూరులో ఒక ఆఫర్‌ పెట్టారని రూ.1.50 లక్షల విలువైన ఫొటో కెమెరా రూ.60 వేలకే లభిస్తుందని ఫుర్‌ఖాన్‌ నాగచైతన్యకు తెలిపాడు. ముందుగా 30 వేలు ఇస్తే కెమెరా పంపుతానని..

కెమెరా చూసుకుని మిగిలిన రూ.30 వేలు ఇవ్వాలంటూ నమ్మబలకడంతో అతని మాటలపై ఆశపెట్టుకున్న నాగచైతన్య పేటీఎం ద్వారా ఫుర్‌ఖాన్‌కు రూ. 29 వేలు పంపాడు. ఎన్ని రోజులైనా కెమెరా రాకపోకవడంతో ఫుర్‌ఖాన్‌కు ఫోన్‌ చేసినా, ఫేస్‌బుక్‌ ద్వారా ప్రయత్నిస్తున్నా అతని నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో మోసపోయానని గమనించిన నాగచైతన్య నున్న రూరల్‌ పోలీసులకు ఆగస్టు 13న ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేసి బెంగళూరులోని ఫుర్‌ఖాన్‌ను గురువారం అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.ఈ కేసులో మరో ముగ్గురు నిందితులున్నారని, వారిని కూడా త్వరలోనే పట్టుకుని న్యాయస్థానం ఎదుట హాజరుపరుస్తామని నున్న ఎస్‌ఐ నాగేశ్వరరావు తెలిపారు.

మరిన్ని వార్తలు