జీఎస్టీకి అన్ని రాష్ట్రాల మద్దతు

15 Jun, 2016 02:03 IST|Sakshi
జీఎస్టీకి అన్ని రాష్ట్రాల మద్దతు

తమిళనాడు అభ్యంతరాలను పరిశీలిస్తాం: జైట్లీ వెల్లడి
- కోల్‌కతాలో జీఎస్టీపై ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ భేటీ
- పన్ను రేటు మార్పుపై పరిమితులుండవు
 
 కోల్‌కతా: జీఎస్టీ( వస్తు, సేవల పన్ను) అమలుకు తమిళనాడు తప్ప అన్ని రాష్ట్రాలు మద్దతు ప్రకటించాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. పరోక్ష పన్నుల సంస్కరణల్లో భాగంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న జీఎస్టీపై కోల్‌కతాలో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికారక కమిటీ మంగళవారం భేటీ  అయింది. అనంతరం జైట్లీ  వివరాలు వెల్లడిస్తూ... జీఎస్టీ బిల్లు అమలుకు ఎలాంటి గడువు లేదని, తమిళనాడు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిందని, ఆ రాష్ట్ర సూచనల్ని కమిటీ పరిగణనలోకి తీసుకుందని చెప్పారు. రెండు రోజులు జరిగే ఈ భేటీలో మొదటిరోజు 22 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు,  అరుణాచల్, మేఘాలయ సీఎంలు, ఢిల్లీ డిప్యూటీ సీఎం పాల్గొన్నారు.

ఎక్కువ మంది ఆర్థిక మంత్రుల హాజరుతో సమావేశం రికార్డు సృష్టించిందని, జీఎస్టీపై రాష్ట్రాలు తమ విస్తృత అభిప్రాయాల్ని తెలిపాయని జైట్లీ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర పన్నులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడమే జీఎస్టీ ముఖ్యోద్దేశం. బిల్లును ఏప్రిల్ 1, 2016 నుంచే అమల్లోకి తేవాలని కేంద్రం భావించినా.. బిల్లులో రాజ్యాంగ సవరణను రాజ్యసభ ఆమోదించ లేదు.  జీఎస్టీ పన్ను రేటుపై భవిష్యత్తులో రాజ్యాంగ సవరణ చేయాలా? అన్న అంశంపై ఏకాభిప్రాయం వచ్చిందని, భవిష్యత్తు అవసరాల కోసం పన్ను రేటుపై పరిమితులు ఉండబోవని, దానిని జీఎస్టీ కౌన్సిల్ పరిశీలనకు ప్రతిపాదించామని జైట్లీ చెప్పారు.

తయారీ రాష్ట్రాలు ఒక శాతం అదనంగా పన్ను వసూలుకు డిమాండ్ చేయడంపై స్పందిస్తూ.. ఈ విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. జీఎస్టీ వినియోగ ఆధారిత పన్ను కావడంతో తయారీ రాష్ట్రాలు అదనపు పన్నును కోరుతున్నాయన్నారు. వచ్చే వర్షాకాల సమావేశాల్లో బిల్లు రాజ్యాంగ సవరణకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తామని, అనంతరం సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ బిల్లుల ఆమోదం కోసం ఆయా సభల్లో ప్రవేశపెడతామన్నారు. రెవెన్యూ న్యూట్రల్ రేట్‌పై మాట్లాడుతూ.. జూలైలో మరోసారి సాధికారిక కమిటీ భేటీ నిర్వహిస్తామన్నారు. పన్ను రేట్ల ద్వంద్వ నియంత్రణపై కేంద్ర, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం ఉందని సాధికారక కమిటీ చైర్మన్ మిత్రా తెలిపారు.   

 మోడల్ జీఎస్టీ చట్టానికి అంగీకారం: మోడ ల్ జీఎస్టీ చట్టం ప్రకారం వస్తువులు, సేవల అమ్మకాలతో పాటు అన్ని ఆన్‌లైన్ కొనుగోళ్లకు లావాదేవీల మొదటి దశలోనే జీఎస్టీ వర్తించనుంది. ఏప్రిల్, 2017 నుంచి అమల్లోకి తేవాలని నిర్ణయించిన ఈ మోడల్ జీఎస్టీ చట్టానికి ఆర్థిక మంత్రుల భేటీలో ఆమోదం తెలిపారు.  వార్షిక టర్నోవర్ రూ. 10 లక్షలుంటే జీఎస్టీ వర్తిస్తుంది. ఆన్‌లైన్ కొనుగోళ్లకు కూడా ఒకే విధమైన జీఎస్టీ పన్నును విధించాలన్న ప్రతిపాదనకు కూడా అంగీకరించారు. దీనిపై అభిప్రాయాలు, సూచనలు తెలుపాలంటూ ఆర్థిక మంత్రుల్ని కోరారు.  ఈ మోడల్ జీఎస్టీ బిల్లులో 162 క్లాజులు, 4 షెడ్యూల్స్ ఉండగా...ఉల్లంఘించిన వారికి ఐదేళ్ల జైలు విధింవచ్చని సూచించారు.
 
 రాష్ట్రాల నష్టాల్ని భర్తీ చేస్తాం
 లోక్‌సభ జీఎస్టీ బిల్లును ఆమోదించినా, రాజ్యసభలో ఇంకా పెండింగ్‌లోనే ఉందని, మొదటిగా పార్లమెంట్‌లో జీఎస్టీపై రాజ్యాంగ సవరణ చేయాలని, తర్వాత రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుందని జైట్లీ చెప్పారు. అనంతరం సెంట్రల్ జీఎస్టీ బిల్లును పార్లమెంట్, స్టేట్ జీఎస్టీ బిల్లును రాష్ట్రాలు ఆమోదించాలన్నారు. తొలి ఐదేళ్లు ఆదాయం కోల్పోతామనే రాష్ట్రాల భయంపై చర్చించామని, నష్టాన్ని కేంద్రం భర్తీ చేస్తుందని అన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా