‘ఫాల్కే’ అందుకున్న బిగ్‌బీ

30 Dec, 2019 04:29 IST|Sakshi
రాష్ట్రపతి కోవింద్‌ నుంచి అవార్డు అందుకుంటున్న అమితాబ్‌బచ్చన్‌

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ మెగాస్టార్, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో కోవింద్‌ ఈ అవార్డును ప్రదానం చేశారు. వాస్తవంగా బిగ్‌బీ ఈ అవార్డును కొద్ది రోజుల క్రితమే అందుకోవాల్సి ఉన్నా అనారోగ్య కారణాల రీత్యా కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. దీంతో ఆదివారం జరిగే ప్రత్యేక కార్యక్రమంలో బిగ్‌బీకి అవార్డు అందిస్తామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఇటీవల ప్రకటించారు.

జాతీయ సినీ పురస్కారాలు అందుకున్న నటులకు రాష్ట్రపతి తన నివాసంలో ఆదివారం తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమితాబ్‌కు అవార్డు అందజేశారు. భారతీయ సినీ రంగానికి విశిష్ట సేవలు అందించినందుకు గానూ.. బిగ్‌బీకి ఈ పురస్కారం లభించింది. భారతీయ సినిమాలో ఇది అత్యున్నత పురస్కారం. ఈ అవార్డు కింద రూ.10 లక్షలతో పాటు స్వర్ణ కమలం అందజేస్తారు. కాగా.. ఈ అవార్డుకు అర్హుడిగా తనను ఎంపిక చేసిన నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ జ్యూరీ సభ్యులకు, కేంద్ర ప్రభుత్వం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలకు అమితాబ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

తనతో సినిమాలు తీసిన నిర్మాతలు, దర్శకులు, తోటి కళాకారులు, తనను ఆరాధిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమితాబ్‌ సతీమణి, ఎంపీ జయా బచ్చన్, కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ తదితరులు పాల్గొన్నారు. భారతీయ సినిమా పితామహుడు ధుండిరాజ్‌ గోవింద్‌ ఫాల్కే పేరు మీదుగా 1969 నుంచి దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును అందజేస్తున్నారు. అదే ఏడాది అమితాబ్‌ ‘సాత్‌ హిందుస్తానీ’అనే హిందీ సినిమాతో అరంగేట్రం చేశారు.   

మరిన్ని వార్తలు