మోదీ, రాహుల్‌ కోసం నా తండ్రి చావలేదు!

9 Apr, 2019 14:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘మోదీ కోసమో, రాహుల్‌ కోసమో నా తండ్రి చనిపోలేదు. భారత్‌ కోసం చనిపోయారు. మన సైనికులను లాగకుండా మీరు ఎన్నికల్లో పోటీ చేయలేరా? ఎన్నికలైతే మీరు కచ్చితంగా మమ్మల్ని మరచిపోతారు. అది మాకు తెలుసు’ సూటిగ గుండెల్లో గుచ్చుకునే ఈ మాటలు అన్నది ఎవరో కాదు, పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లలో ఒకరైన కౌశల్‌ కుమార్‌ రావత్‌ కూతురు అపూర్వ రావత్‌. ‘భారత్‌ సైన్యానికి చెందిన ఎవరిని మీరు రాజకీయాల్లోకి లాగినా మీరు వారిని అవమానించినట్లే. సైనికులేమి ప్రధానికి చెందిన వారు కాదు’ అని కూడా ఆమె వ్యాఖ్యానించారు. భారత సైన్యాన్ని ‘మోదీకీ సేన’ అని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని అపూర్య అలా మాట్లాడి ఉండవచ్చు.

‘భారత సైన్యం ఏ రాజకీయ పార్టీకే, ఏ రాజకీయ నాయకుడికో చెందినది కాదు. దేశంలోని ప్రతి ఒక్కరిది. నా తండ్రి చనిపోయారని వార్త తెల్సిన తర్వాత రాజకీయ నాయకులు తండోపతండాలుగా మా ఇంటికి వచ్చి కుటుంబం పట్ల ఎనలేని సానుభూతి కురిపించారు. మమ్మల్ని విసిగించారు. ఫోన్‌ నెంబర్లు కూడా ఇచ్చి పోయారు. ఆ తర్వాత ఫోన్లు చేస్తే ఒక్కరంటే ఒక్కరి నుంచి కూడా సమాధానం లేదు’ అని ‘తిరంగ టీవీ’ షోకు తన తల్లి మమతా రావత్‌తో హాజరైన అపూర్వ రావత్, రాజకీయ నేతలనుద్దేశించి మాట్లాడారు. అనంతరం ఆమె వ్యాఖ్యలను సీనియర్‌ జర్నలిస్ట్‌ బర్ఖా దత్‌ ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు