భూటాన్‌లో రావత్, దోవల్‌ రహస్య పర్యటన

19 Feb, 2018 05:30 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ నెల మొదటి వారంలో ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్, విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్‌ గోఖలే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ భూటాన్‌లో రహస్యంగా పర్యటించిన సంగతి ఆలస్యంగా వెలుగుచూసింది. వారు భూటాన్‌ అధికారులతో డోక్లాంలో భద్రతా పరిస్థితి, చైనా నిర్మిస్తున్న రక్షణ మౌలిక వసతులపై చర్చించినట్లు తెలిసింది. డోక్లాం చుట్టుపక్కలా పెరుగుతున్న చైనా ఆర్మీ ప్రాబల్యం, రక్షణలో భారత్, భూటాన్‌ల మధ్య సహకారాన్ని సమీక్షించారు.

ఫిబ్రవరి 6–7 తేదీల్లో ఈ పర్యటన జరిగిందని, సానుకూల ఫలితాలు వెలువడ్డాయని ప్రభుత్వ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాలు రక్షణ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై కూడా చర్చించినట్లు పేర్కొన్నాయి. భారత్, చైనాల మధ్య డోక్లాం ప్రతిష్టంభన తరువాత భూటాన్‌లో మన ఉన్నతాధికారులు పర్యటించడం ఇదే తొలిసారి. అంతకు మూడు రోజుల ముందు ప్రధాని మోదీ భూటాన్‌ ప్రధానితో గువాహటిలో సమావేశవడం గమనార్హం. 

మరిన్ని వార్తలు