Ayodhya: శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు మూహూర్తం ఖరారు

20 Nov, 2023 07:29 IST|Sakshi

అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారయ్యింది. 2024, జనవరి 22న అభిజీత్ లగ్నం, మృగశిర నక్షత్రంలో మధ్యాహ్నం 12:20 గంటలకు శ్రీరాముని విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయి కల్పించేందుకు ఆదివారం సాకేత్ నిలయంలో సంఘ్ పరివార్ సమావేశం జరిగింది. 

ఈ సందర్భంగా వేడుకల ప్రచారాన్ని నాలుగు దశలుగా విభజించి నిర్వహించాలని నిర్ణయించారు. దీనిలో మొదటి దశ ఇప్పటికే ప్రారంభమయ్యింది. ఇది డిసెంబర్ 20 వరకు కొనసాగనుంది. దీనిలో ఆరోజు నిర్వహించాల్సిన కార్యాచరణ ప్రణాళిక రూపురేఖలను సిద్ధం చేయనున్నారు. అలాగే స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా, బ్లాక్ స్థాయిలో పది మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

రెండో దశలో డోర్ టు డోర్ కాంటాక్ట్ స్కీమ్ కింద 10 కోట్ల కుటుంబాలకు అక్షతలు, రాంలాల చిత్రం, కరపత్రం అందజేయనున్నారు. జనవరి 22న మొదలయ్యే మూడో దశలో దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించనున్నారు. నాలుగో దశలో దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు శ్రీరాముని దర్శనభాగ్యం కలగనుంది. ఈ నాలుగో దశ గణతంత్ర దినోత్సవం నుండి ప్రారంభమై ఫిబ్రవరి 22 వరకు కొనసాగనుంది. 

నవంబర్ 20న భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేపట్టనున్నారు. ఈ మార్గంలోని రోడ్లు, కూడళ్లకు మరమ్మతులు చేస్తున్నారు. తాత్కాలిక బస్టాండ్ నిర్మించారు. మఠాలు, ఆలయాలను అలంకరించారు. లక్నో నుండి వచ్చే భక్తులు సహదత్‌గంజ్ పరిక్రమ మార్గంలో ఫైజాబాద్ బస్సు స్టేషన్‌కు చేరుకుంటారు. రైలులో వచ్చే వారు అయోధ్య కాంట్‌కు చేరుకుంటారు. ఇక్కడి నుండి వారు అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు. ఈ ప్రదక్షిణల కార్యక్రమం నవంబర్ 21వ తేదీ రాత్రి 11:38 గంటలకు ముగియనుంది. 
ఇది కూడా చదవండి: విశ్వసుందరి పలాసియోస్‌

మరిన్ని వార్తలు