సరిహద్దు సమస్యపై ఆర్మీ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు..

1 Jan, 2020 15:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు సమస్యలకు త్వరలోనే శాశ్వత సానుకూల పరిష్కారం లభిస్తుందని నూతన ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ముకుంద్‌ నరవనే ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు ప్రధాన దేశాలతో భారత్‌ సరిహద్దులు పంచుకుంటోందని..ఇరు దేశాలూ సమాన ప్రాధాన్యత కలిగినవేనని ఆయన అన్నారు. గతంలో మనం పశ్చిమ ప్రాంతంవైపే దృష్టిసారించామని, ఉత్తర ప్రాంతం కూడా అంతే ప్రాధాన్యత కలిగిఉందని గుర్తెరగాలన్నారు.

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ స్వాధీనంపై రాజకీయ నేతలు తరచూ చేస్తున్న ప్రకటనలపై స్పందిస్తూ అన్ని సవాళ్లు, వ్యూహాలపై సైన్యం విశ్లేషిస్తుందని, ఇది నిరంతర ప్రక్రియ అని జనరల్‌ నరవనే పేర్కొన్నారు. సేనల ఆధునీకరణ ప్రణాళికలకు కీలక ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకొచ్చారు. సవాళ్లకు అనుగుణంగా దీర్ఘకాల వ్యూహాలతో ముందుకెళతామని, సేనలకు ఎదురయ్యే సవాళ్లలో మార్పులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు. కాగా సీడీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన జనరల్‌ బిపిన్‌ రావత్‌ స్ధానంలో దేశ 28వ ఆర్మీ చీఫ్‌గా జనరల్‌ నరవనే మంగళవారం నూతన బాధ్యతలు స్వీకరించారు.

మరిన్ని వార్తలు